Russia Airspace Violation: రష్యాది నిజంగా బరితెగింపు చర్య అని నాటో కూటమి విమర్శించింది. ఇంతకీ మాస్కో ఏం చేసిందో తెలుసా.. శుక్రవారం మూడు రష్యన్ యుద్ధ విమానాలు ఎస్టోనియన్ గగనతలంలోకి ప్రవేశించాయి. వెంటనే అలర్ట్ అయిన నాటో (నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్) తన జెట్లతో మాస్కో యుద్ధ విమానాలను తిప్పికొట్టింది. ఫిన్లాండ్ గల్ఫ్‌లోని విండలూ ద్వీపం సమీపంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. అక్కడ రష్యన్ విమానం దాదాపు 12 నిమిషాల పాటు ఎస్టోనియన్ గగనతలంలో ఉందని సమచారం. వెంటనే నాటో బాల్టిక్ ఎయిర్ పోలీసింగ్ మిషన్‌లో భాగంగా మోహరించిన ఇటాలియన్ F-35 యుద్ధ విమానాలు రష్యన్ విమానాన్ని అడ్డుకున్నాయి.
READ ALSO: Tirupati : తిరుపతిలో షాకింగ్ సంఘటన.. మద్యం మత్తులో పాము తల కొరికిన వ్యక్తి
రష్యా తీరుపై విమర్శలు..
ఎస్టోనియన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఈ సంఘటనపై స్పందించింది. శుక్రవారం రష్యన్ యుద్ధ విమానం తమ దేశ గగనతల నిబంధనలు ఉల్లంఘించిందని పేర్కొంది. రష్యన్ విమానం ఎటువంటి విమాన సమాచారాన్ని తమతో పంచుకోలేదని, వాటి ట్రాన్స్ పాండర్లు ఆఫ్‌లో ఉన్నాయని, వారు ఎయిర్ ట్రాఫిక్ సర్వీస్‌ను సంప్రదించలేదని తెలిపింది. NATO వెంటనే స్పందించి చర్యలు తీసుకుని రష్యన్ విమానాన్ని అడ్డుకుందని వెల్లడించింది. ఈ ఘటన తర్వాత ఎస్టోనియా రష్యన్ రాయబార కార్యాలయం ఛార్జ్ డి’అఫైర్స్‌ను పిలిపించి నిరసన తెలిపింది. దీనిపై NATO ప్రతినిధి ఒకరు స్పందిస్తూ.. ఇది రష్యా నిర్లక్ష్య ప్రవర్తనకు, NATO కూటమి వేగవంతమైన ప్రతిస్పందనకు ఉదాహరణ అని తెలిపారు.
ఇప్పటికే నాలుగు సార్లు నిబంధనలు ఉల్లంఘించిన రష్యా..
ఈ ఏడాది రష్యా నాలుగుసార్లు ఎస్టోనియన్ గగనతల నిబంధనలు ఉల్లంఘించిందని, అయితే శుక్రవారం జరిగిన ఘటన తీవ్రమైనదని ఎస్టోనియన్ విదేశాంగ మంత్రి మార్గస్ త్సాఖ్‌నా అన్నారు. రష్యాపై మరింత బలమైన రాజకీయ, ఆర్థిక ఒత్తిడిని తీసుకురావాలని ఆయన అంతర్జాతీయ సమాజానికి పిలుపునిచ్చారు. యూరోపియన్ యూనియన్ విదేశాంగ విధాన చీఫ్ కాజా కల్లాస్ ఈ సంఘటనను “అత్యంత ప్రమాదకరమైన రెచ్చగొట్టడం”గా అభివర్ణించారు. రష్యా చర్యలతో ఈ ప్రాంతంలో మరింతగా ఉద్రిక్తతలు పెరిగే అవకాశం ఉందని తెలిపారు. ఇటీవల పోలాండ్‌లో నాటో విమానం ఒక రష్యన్ డ్రోన్‌ను కూల్చివేసిన తర్వాత ఈ సంఘటన జరగడం విశేషం. 2022లో ఫిబ్రవరి రష్యా ఉక్రెయిన్‌పై యుద్ధం ప్రారంభించిన తర్వాత.. నాటో కూటిమిలో భాగమైన దేశంపై మాస్కో చేసిన అత్యంత తీవ్రమైన సరిహద్దు ఉల్లంఘన ఇదని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
పలు నివేదికల ప్రకారం.. ఎస్టోనియా NATO ఆర్టికల్ 4లో భాగంగా సంప్రదింపులు ప్రారంభించడాన్ని పరిశీలిస్తోంది. ఈ ఆర్టికల్ ప్రకారం.. NATO సభ్య దేశం తన భూభాగం, స్వాతంత్ర్యం లేదా భద్రతకు ముప్పు ఉందని భావిస్తే సంప్రదింపులను అభ్యర్థించవచ్చు. రష్యన్ విమానాలు దాదాపు 9 కిలోమీటర్ల వరకు NATO గగనతలంలోకి ప్రవేశించాయని, ఇటాలియన్ F-35లు వాటిని తిప్పికొట్టాయని నివేదిక పేర్కొంది.
READ ALSO: Manipur : మణిపూర్‌లో ఉగ్రదాడి.. ఉద్రిక్తతలు చెలరేగిన పరిస్థితి !
