Ashok Kharat: మహారాష్ట్రాలో ఓ జ్యోతిష్కుడి బాగోతం బట్టబయలైంది. రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, ప్రముఖుల భవిష్యత్తును చెబుతానని నమ్మిస్తూ నాసిక్‌కు చెందిన జ్యోతిష్కుడు చేసిన దుశ్చర్యలు బయటపడ్డాయి. తనను తాను కెప్టెన్ అని పిలుచుకునే అశోక్ ఖరత్‌ను నిన్న పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. పోలీసుల దర్యాప్తులో ఒక్కొక్కటిగా ఆధారాలు బయటపడుతున్నాయి. అత్యాచారం, బ్లాక్‌మెయిలింగ్ ఆరోపణలపై అరెస్టు అయిన ఖరత్ వద్ద ఏకంగా 58 వీడియో క్లిప్‌లు, 150 కోట్ల రూపాయలకు పైగా విలువైన ఆస్తులు లభ్యమయ్యాయి. వాస్తవానికి.. నాసిక్ క్రైమ్ బ్రాంచ్ యూనిట్-1, 18వ తేదీన తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో అశోక్ ఖరత్‌ను అరెస్టు చేసింది. సర్కార్వాడ పోలీస్ స్టేషన్‌లో 35 ఏళ్ల మహిళపై అత్యాచారం కేసు నమోదైంది. కేసు తీవ్రత దృష్ట్యా, మహారాష్ట్ర ప్రభుత్వం ఈ కేసును ప్రత్యేక దర్యాప్తు బృందానికి (SIT) అప్పగించింది. ఈ బృందానికి మహిళా ఐపీఎస్ అధికారిణి తేజస్విని సత్పూటే నేతృత్వం వహిస్తున్నారు.
READ MORE: Golmal 5 : బాలీవుడ్ కామెడీ బ్లాక్‌బస్టర్ ఫ్రాంచైజీ గోల్మాల్ 5లో విలన్ గా స్టార్ హీరో
అయితే.. సిట్ బృందం నిందితుడిని సుమారు రెండు గంటల పాటు విచారించింది. విచారణలో ఏం తేలింది అనే అంశంపై అధికారిక ప్రకటన రాలేదు. దర్యాప్తు ఇంకా ప్రాథమిక దశలోనే ఉందని, వాస్తవాలు వెలుగులోకి వచ్చిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామని బృందం వెల్లడించింది. ఈ కేసులో అత్యంత దిగ్భ్రాంతికరమైన సాక్ష్యం 58 వీడియో క్లిప్పులు అని చెబుతున్నారు. దాడుల సమయంలో వివిధ డిజిటల్ పరికరాల నుంచి ఈ వీడియోలను సిట్ స్వాధీనం చేసుకుంది. ఈ వీడియోలలో కొన్నింటిలో మహిళలు, ప్రముఖ వ్యక్తులు ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. అయితే, పోలీసులు దీనిని ఇంకా ధృవీకరించలేదు. ఈ వీడియోలపై ఫోరెన్సిక్ దర్యాప్తు కొనసాగుతోంది. ఈ ఆరోపణలు నిజమని రుజువైతే, ఈ కేసు కేవలం లైంగిక దోపిడీకే పరిమితం కాకుండా.. పెద్ద బ్లాక్‌మెయిలింగ్ దందాపై కూడా చర్యలు తీసుకుంటామని సిట్ చెబుతోంది.
ఇదిలా ఉండగా, తాజాగా మరో కేసు వెలుగులోకి వచ్చింది. తన అభ్యంతరకరమైన ఫోటోలు అతడి వద్ద ఉన్నాయని, వాటిని వైరల్ చేస్తామని బెదిరిస్తూ డబ్బులు డిమాండ్ చేస్తున్నట్లు షిర్డీకి చెందిన ఒక మహిళ ఫిర్యాదు చేసింది. ఈ కేసులో నిందితుడి కార్యాలయంలో పనిచేసే నీరజ్ జాదవ్ పేరు బయటపడింది. కొన్ని సంవత్సరాల క్రితం తాను ఖరత్ కార్యాలయానికి వెళ్లినప్పుడు అక్కడే ఆ ఫోటోలు తీశారని ఆ మహిళ ఆరోపిస్తోంది. నీరజ్ జాదవ్ ఇది స్వయంగా చేశాడా? లేక దీని వెనుక ఒక పెద్ద నెట్‌వర్క్ ఉందా? అనే ప్రశ్న ఇప్పుడు తలెత్తుతోంది. పోలీసుల దాడిలో ఖరత్ ఇంటి నుంచి ఒక పిస్టల్, కాట్రిడ్జ్‌లు, సుమారు రూ.6.5 లక్షల నగదు కూడా స్వాధీనం చేసుకున్నారు. గత 15 ఏళ్లలో అశోక్ ఖరత్ భారీగా ఆస్తులు కూడబెట్టినట్లు దర్యాప్తులో వెల్లడైంది. పోలీసుల అంచనా ప్రకారం.. అతని మొత్తం ఆస్తుల విలువ రూ.150 నుంచి రూ. 200 కోట్ల మధ్య ఉంటుంది. నాసిక్‌లోని పాతర్డి ప్రాంతంలో అనేక భూములు ఉన్నాయట. వీటి అంచనా విలువ సుమారు రూ. 150 కోట్లు అని చెబుతున్నారు. సిన్నార్ తాలూకాలోని మిర్గావ్ మరియు కహందల్వాడిలో సుమారు 45 ఎకరాల భూమి. పాతర్డి, గౌలానే ప్రాంతాలలో రూ. 30 కోట్లకు పైగా విలువైన ఆస్తులు, కుటుంబ సభ్యుల పేర్ల మీద నమోదు చేశారని దర్యాప్తులో తేలింది. మీర్‌గావ్‌లోని ఇషాన్యేశ్వర్ ఆలయం వెనుక సుమారు రూ. 10 కోట్ల విలువైన ఫామ్‌హౌస్ సైతం ఉందట. ఓజార్ విమానాశ్రయం సమీపంలోని జనోరి గ్రామంలో సుమారు రూ. 5 కోట్ల విలువైన భూమి, కర్మయోగి నగర్, నాసిక్‌లోని బంగ్లా, కెనడా కార్నర్‌లో కార్యాలయం, షిర్డీలోనూ కోట్ల విలువైన సాగుభూమి ఉందని పోలీసులు తెలిపారు.
అశోక్ ఖరత్ నాసిక్ జిల్లా, సిన్నార్ తాలూకాలోని మీర్‌గావ్‌లో ఉన్న ఇశాన్యేశ్వర ఆలయ ట్రస్ట్‌కు ఛైర్మన్‌గా కొనసాగుతున్నాడట. ఈ పదవి ద్వారా ఆయన సామాజిక, మతపరమైన పలుకుబడిని సంపాదించాడు. 2022 నవంబర్‌లో అప్పటి మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే మీర్‌గావ్‌ను సందర్శించినప్పుడు ఖరత్ వెలుగులోకి వచ్చాడు. దీని తరువాత, ఆయన ప్రజాదరణ వేగంగా పెరిగింది. ప్రముఖులు ఆయనను కలవడం ప్రారంభించారు. మహారాష్ట్ర అంధశ్రద్ధ నిర్మూలన్ సమితి కార్యకర్తలు, ప్రజల విశ్వాసాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపిస్తూ, అప్పటికే ఖరత్‌కు వ్యతిరేకంగా గళం విప్పుతున్నారు. ప్రస్తుతం, సిట్ ఈ మొత్తం కేసుపై క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తోంది. పోలీసులు నిందితుడి ఆర్థిక లావాదేవీలు, డిజిటల్ ఆధారాలు, అతని నెట్‌వర్క్‌పై దృష్టి సారిస్తున్నారు. ఈ కేసు కేవలం ఒక వ్యక్తికి మాత్రమే పరిమితమా లేక దీని వెనుక ఒక పెద్ద, వ్యవస్థీకృత నెట్‌వర్క్ ఉందా అనేది రాబోయే రోజుల్లో బయటపడనుంది.
