Site icon NTV Telugu

Off The Record: నాడు కాలు పెట్టనివ్వబోనన్న రేవంత్ రెడ్డికి నేడు రెడ్ కార్పెట్

Off The Record

Off The Record

Off The Record: నా…. నియోజకవర్గం నా ఇష్టం. ఇక్కడ కాంగ్రెస్‌ పార్టీకి రాజు నేనే…. రారాజు నేనే….. సామంత రాజుని కూడా నేనే. స్టేట్‌ లీడర్స్‌ పేరుతో ఎవ్వరూ కాలు పెట్టాల్సిన అవసరమే లేదు. ఒకవేళ ఎవరైనా రావాలనుకున్నా నేను పర్మిషన్‌ ఇచ్చే ప్రసక్తే లేదంటూ ఒకనాడు వీర లెవల్లో స్టేట్మెంట్స్‌ ఇచ్చేశారు అప్పటి మాజీ, ఇప్పుడు సిట్టింగ్‌ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి.

READ ALSO: Off The Record: లోకేష్ రాజమండ్రి టూర్ రద్దు వెనక బలమైన కారణాలే ఉన్నాయా?

కట్‌ చేస్తే… నాడు కాలు పెట్టనివ్వబోనన్న నాయకుడికే నేడు రెడ్‌ కార్పెట్‌ వేసి, స్వాగత తోరణాలు కట్టి మరీ… వెల్కమ్‌ చెబుతున్నారాయన. ఇంతకీ…. మేటరేంటంటే…. సీఎం రేవంత్‌ రెడ్డి తెలంగాణ కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు… రాష్ట్రమంతా పాదయాత్ర చేశారు. పీసీసీ చీఫ్‌ హోదాలో ఆయన అలా… ప్రజల సమస్యలు తెలుసుకుంటూ… ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోకి ఎంటరయ్యాక ఓ కొత్త సమస్య మొదలైంది. అప్పుడున్న షెడ్యూల్‌ ప్రకారం రేవంత్‌రెడ్డి పాదయాత్ర హన్మకొండ నుంచి నర్సంపేట నియోజకవర్గంలో వెళ్ళాలి. కానీ… ఆ నియోజకవర్గానికి చెందిన పార్టీ నేత, అప్పుడు మాజీ ఎమ్మెల్యే అయిన దొంతి మాధవ రెడ్డి.. నో అనేశారు. నా దగ్గర మీ యాత్రలేవీ అవసరం లేదంటూ మోకాలడ్డారు. కాదు కూడదని వచ్చినా నా వైపు నుంచి సహకారం ఉండబోదని క్లియర్‌గా చెప్పేయడంతో… ఏం చేయాలో పాలుపోని స్థితిలో అప్పటికి హన్మకొండలోనే రేవంత్ రెడ్డి ఆగిపోవాల్సి వచ్చింది. పాదయాత్రకు ఒకరోజు బ్రేక్‌ తీసుకుని తీవ్ర తర్జన భర్జనల తర్వాత అనవసరంగా పార్టీలో గొడవలెందుకన్న ఆలోచనతో నర్సంపేటను వదిలేసి భూపాలపల్లి నియోజకవర్గంలోకి ఎంటరైపోయారు అప్పటి పీసీసీ చీఫ్‌. అలాంటి దొంతి మాధవరెడ్డి అదే రేవంత్‌ రెడ్డిని ఇప్పుడు సీఎం హోదాలో, తాను సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా…. రండి రండి రండి… దయచేయండి. తమరి రాక మాకెంతో సంతోషం సుమండి అంటూ సాంగ్‌ సింగారు.

ఇలాంటి సీనే నల్గొండ జిల్లాలో కూడా జరిగింది అప్పట్లో. మా జిల్లాలో ఇతర జిల్లా నాయకులు అవసరం లేదంటూ ఏకంగా ప్రెస్‌మీట్లే పెట్టేశారు ఇక్కడి సీనియర్‌ లీడర్స్‌. ఎవరూ రావాల్సిన పని లేదు..మా జిల్లాను మేమే చూసుకుంటామని చెప్పేశారు. ఆ రకంగా…మొదట్లో బ్రేకులు వేసినా…తర్వాత కొంత పట్టువిడుపులు ఇచ్చారు అది వేరే సంగతి. నల్గొండలోకి రేవంత్ రెడ్డి ఎంటర్ అవడం కోసం ఇప్పుడు మంత్రులుగా ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో మాజీ మంత్రి జానారెడ్డి మీటింగులు పెట్టి.. డీసీసీతో సయోధ్య కుదిర్చి లైన్‌ క్లియర్‌ చేశారు. అక్కడ సీన్‌ కట్‌ చేస్తే.. సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవడం… రేవంత్ రెడ్డి సీఎం అవ్వడం… మంత్రివర్గంలోకి ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి ఉత్తమ్… కోమటిరెడ్డిలను తీసుకుని కీలక శాఖలు అప్పగించడం చకచకా జరిగిపోయాయి. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన సన్నబియ్యం పథకం ఉత్తం కుమార్ రెడ్డి నియోజకవర్గంలో సీఎం చేతుల మీదుగా ప్రారంభమైంది. ఇక కోమటిరెడ్డి వెంకటరెడ్డి సొంతూరు బ్రాహ్మణ వెల్లంలలో ఓ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డిని దగ్గరుండి మరీ తీసుకువెళ్ళారు. భారీ ఎత్తున స్వాగతం పలికారు. అన్నిటికీ మించి ఇప్పుడు సీఎంకి అత్యంత సన్నిహితుల్లో ఒకరిగా మారిపోయారు మంత్రి వెంకటరెడ్డి.

ఇప్పుడిక వరంగల్‌ ఎపిసోడ్‌కి వస్తే…. నాడు నో ఎంట్రీ బోర్డ్‌ పెట్టేసిన దొంతి మాధవ రెడ్డి నేడు స్వయంగా స్వాగత బ్యానర్లు కట్టించారు. సీఎం రేవంత్‌తో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు, భారీ సభతో విధేయత చాటుకున్నారు. నర్సంపేటకు అసలు రాష్ట్ర స్థాయి నాయకులు అవసరం లేదన్న నాయకుడే…నేడు సీఎం హోదాలో రేవంత్‌ను వెంటబెట్టుకుని వెళ్లారు. దీన్ని చూస్తున్నవాళ్ళంతా… టైం బాబూ టైం… కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదని కామెంట్‌ చేస్తున్నారు. మన గుడ్‌ టైం నడుస్తున్నప్పుడు కూడా… కాస్త పద్ధతులు పాటిస్తే….ఎప్పటికీ ఇబ్బంది ఉండబోదని గుర్తు చేసుకుంటున్నారు. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరన్న సంగతి కూడా మరోసారి రుజువైందన్నది పొలిటికల్ వాయిస్‌.

READ ALSO: Alcohol Sprinkling: మద్యం తాగే ముందు చేసే ఈ చిన్న పనికి ఎంత పెద్ద అర్థం ఉందో తెలుసా..?

Exit mobile version