Nandre Burger: రాజస్థాన్ రాయల్స్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో RR 40 పరుగుల తేడాతో లక్నో సూపర్ జెయింట్స్ పై ఘన విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 159 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో లక్నో జట్టు 18 ఓవర్లలో 119 పరుగులకే ఆలౌట్ అయింది. ఇది ఇలా ఉండగా రాజస్థాన్ రాయల్స్ జట్టు పేసర్ నంద్రే బర్గర్ కు పెద్ద షాక్ తగిలింది.
మ్యాచ్‌లో కోడ్ ఆఫ్ కండక్ట్ ఉల్లంఘించినందుకు అతనిపై మ్యాచ్ ఫీజులో 10% జరిమానా విధించారు. అంతేకాకుండా ఒక డీమెరిట్ పాయింట్ కూడా నమోదు చేశారు. ఐపీఎల్ నిర్వాహకులు విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. బర్గర్ మ్యాచ్ సమయంలో అనుచిత ప్రవర్తనకు పాల్పడ్డాడు. ముఖ్యంగా ఇతర ఆటగాళ్లను రెచ్చగొట్టేలా లేదా అవమానించేలా మాటలు, చర్యలు, హావభావాలు ప్రదర్శించినందుకు అతను ఆర్టికల్ 2.5ను ఉల్లంఘించినట్లు గుర్తించారు.
ఈ ఉల్లంఘన లెవల్-1 కేటగిరీలోకి వస్తుంది. ఈ రకమైన కేసుల్లో మ్యాచ్ రిఫరీ తీసుకునే నిర్ణయం తుదిగా ఉంటుంది. దీనితో బర్గర్ పై విధించిన శిక్ష అమల్లోకి వచ్చింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే రాజస్థాన్ రాయల్స్ బౌలింగ్ విభాగం అద్భుతంగా రాణించి లక్నో సూపర్ జెయింట్స్‌ను 40 పరుగుల తేడాతో ఓడించింది. బౌలర్ల సమిష్టి ప్రదర్శనతో రాజస్థాన్ జట్టు విజయం సాధించింది.
