NTV Telugu Site icon

Naatu Naatu: ఆస్కార్ బరిలో “నాటు… నాటు…” సందడి!

Rrr

Rrr

Naatu Naatu: ఎప్పుడెప్పుడా అని భారతీయ సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తోన్న ‘ఆస్కార్ అవార్డుల నామినేషన్స్’ ప్రకటన వెలువడింది. మన భారతీయ సినిమా అభిమానులు, ముఖ్యంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగువారు ఆశించినట్టుగానే రాజమౌళి మేగ్నమ్ ఓపస్ ‘ట్రిపుల్ ఆర్’లో కీరవాణి బాణీల్లో రూపొందిన “నాటు నాటు…” పాటకు ‘ఒరిజినల్ సాంగ్’ విభాగంలో నామినేషన్ లభించింది. వీటిని రిజ్ అహ్మద్, ఆలిసన్ విలియమ్స్ ప్రకటించారు.

మనవాళ్ళు ఎన్నడూ లేని విధంగా ఈ సారి ఆస్కార్ నామినేషన్స్ కోసం అంత ఆసక్తిగా ఎదురుచూడటానికి కారణం – గత యేడాది టాప్ గ్రాసర్ గా నిలచిన రాజమౌళి మేగ్నం ఓపస్ ‘ట్రిపుల్ ఆర్’ బరిలో ఉందని తెలియడమే. పైగా ఇప్పటికే ఈ చిత్రం ద్వారా బెస్ట్ డైరెక్టర్ గా రాజమౌళి, బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో కీరవాణి, బెస్ట్ యాక్షన్ కొరియోగ్రాఫర్ గా నిక్ పావెల్ అంతర్జాతీయ వేదికలపై అవార్డులు సొంతం చేసుకున్నారు. దాంతో ‘ట్రిపుల్ ఆర్’ ఆస్కార్ నామినేషన్ కూడా సంపాదిస్తే, మన దేశం నుండి అకాడమీ నామినేషన్ సంపాదించిన తొలి హిందీయేతర చిత్రంగా ‘ట్రిపుల్ ఆర్’ నిలుస్తుంది. అందువల్లే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భారతీయులు, ముఖ్యంగా దక్షిణ భారతీయులు ఈ సారి ఆస్కార్ నామినేషన్స్ పై అమితాసక్తి కనబరుస్తున్నారు. గతంలో ఆస్కార్ నామినేషన్స్ పొందిన భారతీయ చిత్రాలు “మదర్ ఇండియా, సలామ్ బాంబే, లగాన్” మన దేశం నుండి అధికారికంగా ‘ఉత్తమ విదేశీ చిత్రం’ విభాగానికి ఎంట్రీలుగా పంపారు. కానీ, రాజమౌళి ‘ట్రిపుల్ ఆర్’కు ఆ కేటగిరీలో ఇండియా నుండి అధికారిక ఎంట్రీ లభించక పోయినా, అక్కడ ‘ఒరిజినల్ సాంగ్’ విభాగంలో ఈ చిత్రంలోని “నాటు నాటు…” పాట నామినేషన్ సంపాదించడం గమనార్హం!

ఇప్పటి దాకా ఏ భారతీయ చిత్రానికి లభించని గౌరవం ‘ట్రిపుల్ ఆర్’కు దక్కింది. అది ఓ తెలుగు చిత్రం ద్వారా ప్రప్రథమ భారతీయ సినిమా ‘ఒరిజినల్ సాంగ్’ కేటగిరీలో నామినేషన్ సంపాదించడం అన్నది అపూర్వం! ఈ పాట చూస్తే ఇందులో “నాటు నాటు…” మనకు కొత్తగా అనిపించక పోవచ్చు. కానీ, ఈ సినిమా పీరియడ్ మూవీగా తెరకెక్కింది. అందులో అప్పటి జనజీవనానికి సంబంధించిన వాతావరణాన్ని ప్రతిబింబిస్తూ సాగిన చంద్రబోస్ సాహిత్యం, అందుకు తగ్గ కీరవాణి బాణీలు “నాటు నాటు…” పాటను విదేశీయులు సైతం మెచ్చే విధంగా రూపొందింది. ఇప్పటికే ‘గోల్డెన్ గ్లోబ్’ వంటి ప్రతిష్ఠాత్మకమైన అవార్డును సొంతం చేసుకున్న “నాటు నాటు…” సాంగ్, ఆస్కార్ నామినేషన్ సంపాదించడం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భారతీయ సినీ ఫ్యాన్స్ ఆనందాన్ని అంబరమంటేలా చేస్తోంది. ఇక ఈ “నాటు నాటు…” పాట ఆస్కార్ ను సైతం సొంతం చేసుకుంటే మనవాళ్ళ ఆనందం ఏ స్థాయిలో ఉంటుందో చెప్పక్కర్లేదు. ఆ రోజు కూడా రావాలనే ప్రపంచం నలుమూలల ఉన్న భారతీయులు ఆశిస్తున్నారు. మార్చి 13న ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవంలో మన తెలుగు పాట “నాటు నాటు…” చిందేసి విజేతగా నిలవాలనీ ఆశిద్దాం.