Site icon NTV Telugu

Myanmar Military Airstrike: మయన్మార్‌లో సైన్యం దాడులు.. 80 మంది దుర్మరణం

Myanmar Airstrikes

Myanmar Airstrikes

Myanmar Military Airstrike: మయన్మార్‌లో విధ్యంసకాండ నడుస్తోంది. అక్కడ సైనిక పాలన అరాచకం సృష్టిస్తోంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే వారికి ఈ భూమి మీద నూకలు చెల్లినట్లే. అక్కడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం వినిపిస్తుండటంతో వారిని అణచివేసేందురు సైన్యం వైమానిక దాడులకు దిగింది. ఇప్పటికే ఈ దాడుల్లో దాదాపు 80 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. మృతుల్లో ఒక గాయకుడితోపాటు వ్యాపారవేత్తలు, సామాన్య పౌరులు కూడా ఉన్నారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. కచిన్‌ రాష్ట్రంలో జరుపుకుంటున్న వేడుకలపై సైన్యం విరుచుకుపడటంతో మారణకాండ చోటుచేసుకుంది.

కచిన్ జాతి మైనారిటీ గ్రూపునకు చెందిన ఓ రాజకీయ సంస్థ వార్షికోత్సవ వేడుకలు నిర్వహించగా.. ఇందులో పలువురు గాయకులు, సంగీత విద్యాంసులు, వ్యాపారవేత్తలు, పౌరులు హాజరయ్యారు. మయన్మార్ సైన్యం జరిపిన వైమానిక దాడుల్లో పలువురు గాయకులు, సంగీత విద్వాంసులు సహా 80 మందికి పైగా మరణించారు. వందకు పైగా గాయపడినట్లు తెలుస్తోంది. మూడు జెట్‌ ఫైటర్లతో సైన్యం నాలుగు బాంబులు విసిరింది. ఆంగ్‌సాన్‌ సూకీ నుంచి అధికారాన్ని హస్తగతం చేసుకున్న అనంతరం సైన్యం జరిపిన దాడుల్లో ఇదే పెద్దదిగా చెప్పుకోవచ్చు. ఆర్మీ సైనిక శిక్షణ కోసం హపకాంత్‌ టౌన్‌షిప్‌లోని ఆంగ్‌ బార్లే గ్రామానికి దగ్గర్లోనే ఈ దాడులు జరిగాయి. ఈ ఘటనలో మరణించిన వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. వందకుపైగా గాయపడినట్లు సమాచారం.

Fire Accident: అంధుల పాఠశాలలో అగ్నిప్రమాదం.. 11 మంది బాలికలు సజీవదహనం

మయన్మార్‌లో విస్తృతంగా జరుగుతున్న హింసాకాండపై చర్చించేందుకు ఆగ్నేయాసియా దేశాల విదేశాంగ మంత్రులు ఇండోనేషియాలో మరో మూడు రోజుల్లో ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు. ఇంతలోనే ఈ దాడులు జరగడం గమనార్హం. కాగా, కచిన్ ఇండిపెండెన్స్ ఆర్మీ 9వ బ్రిగేడ్ ప్రధాన కార్యాలయంపై దాడి జరిగినట్లు మిలటరీ ప్రభుత్వ సమాచార కార్యాలయం సోమవారం అర్థరాత్రి ఒక ప్రకటనలో ధ్రువీకరించింది. కచిన్ గ్రూపు ఉగ్రవాద చర్యలకు ప్రతిస్పందనగా ఈ ఆపరేషన్ చేపట్టినట్లుగా సైన్యం పేర్కొనడం గమనార్హం.

Exit mobile version