Rangareddy District: ఎంవీఎస్ఆర్ కాలేజీలో ఘోర ప్రమాదం.. లైటింగ్ స్టాండ్ కూలి విద్యార్థిని మృతి

Mvsr Engineering College

Mvsr Engineering College

MVSR Engineering College Accident: రంగారెడ్డి జిల్లా బడంగ్‌పేట్ పరిధిలోని నాదర్‌గుల్ ఎంవీఎస్ఆర్ (MVSR) ఇంజనీరింగ్ కళాశాలలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. లైటింగ్ సిస్టమ్‌ ఒక్కసారిగా కూలిపోయి మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ప్రథమ సంవత్సరం బీటెక్ విద్యార్థిని నారాయణదాసు సోనా (18) మృతి చెందగా.. పలువురు విద్యార్థులు గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. శనివారం సాయంత్రం ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో గాయపడిన 10 మంది ప్రస్తుతం మలక్‌పేట యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గాయపడిన వారిలో స్పందన (18) డిశ్చార్జ్ అయినట్లు వైద్యులు తెలిపారు. ఇక, 17 ఏళ్ల అక్షరారెడ్డి.. విద్యార్థిని ఐసీయూలో చికిత్స పొందుతోంది. మరో ఎనిమిది మందికి సంబంధించిన వివరాలను యాజమాన్యం పంచుకుంది. ఇందులో శ్రేయ (18) – మంచిర్యాల, విష్ణు (21) – మహబూబ్‌నగర్, సానియా (18) – నల్గొండ, సుష్మ (19) – దేవరకొండ, దీక్షిత (21) – గద్వాల, మీనా (17) – వనపర్తి, అనుజ్ఞ (18) – మహబూబ్‌నగర్, షహీరా షేక్ (18) – రక్షాపురం ఉన్నారు.

ఇక, మృతి చెందిన స్టూడెంట్ సోనీ కుటుంబ సభ్యులు NTVతో మాట్లాడారు. “నాదర్‌గుల్ ఎంవీఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ నిర్లక్ష్యం వల్లే సోనీని కోల్పోయాం. సోనీ నారాయణదాసు పెద్ద పాప. తలపై లైట్ స్టాండ్‌లు పడి స్పాట్లోనే మృతి చెందింది. చిన్న పాప పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తుంది. కాలేజీలో దాండియా ప్రోగ్రాం జరుగుతుంది. కాలేజ్ మేనేజ్మెంట్ నిర్లక్ష్యం కారణంగానే సోనీ నారాయణదాసు చనిపోయింది. కాలేజ్ ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం చదువుతోంది. మాది వనపర్తి జిల్లా. మాది పేద కుటుంబం. మోనా నారాయణదాసు కూడా తీవ్ర గాయాలు అయ్యాయి. ఆమె పరిస్థితి విషమంగా ఉంది. కాలేజ్ మేనేజ్మెంట్‌పై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి.” అని వివరించారు.