Muzaffarnagar Road Accident: ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌లో హృదయవిదారక విషాదం చోటుచేసుకుంది. మితిమీరిన వేగంతో ప్రయాణిస్తున్న ఓ కారు అదుపుతప్పి విద్యుత్ స్తంభాన్ని బలంగా ఢీకొట్టడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే కారు పూర్తిగా దగ్ధమైపోవడంతో, లోపల ఉన్నవారు బయటపడే అవకాశం లేక అక్కడికక్కడే సజీవదహనమయ్యారు. మృతుల్లో ఓ చిన్నారి కూడా ఉండటం తీవ్ర కలకలం రేపింది.
పానిపట్-ఖతిమా జాతీయ రహదారిపై జాగేహేడి సమీపంలో ఈ ఘోర ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి రహదారి పక్కనే ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఘోరంగా ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన వెంటనే వాహనంలో భారీగా మంటలు చెలరేగి, చూస్తుండగానే కారు మొత్తానికి వేగంగా వ్యాపించాయి. మంటలు ఒక్కసారిగా చుట్టుముట్టడంతో లోపల ఉన్న ప్రయాణికులకు బయటకు వచ్చే సమయం కూడా చిక్కలేదు. దీంతో కారులో ప్రయాణిస్తున్న ఆరుగురు వ్యక్తులు మంటల్లో చిక్కుకుని ఘటనా స్థలంలోనే ప్రాణాలు విడిచారు. తీవ్రమైన మంటల ధాటికి వాహనంలోని వారు పూర్తిగా అస్థిపంజరంలా మారిపోయారు.
ప్రమాదంపై సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కారులో పూర్తిగా కాలిపోయిన స్థితిలో ఉన్న ఆరుగురి మృతదేహాలను వెలికితీసి, పోస్టుమార్టం నిమిత్తం సమీప ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతుల వివరాలను సేకరిస్తూ దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

