Mustafizur Rahman is likely to be available for the CSK vs KKR Match: ఐపీఎల్ 2024లో భాగంగా నేడు చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో రాత్రి 7.30కు మ్యాచ్ ఆరంభం కానుంది. కేకేఆర్ ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ విజయాలు సాధిస్తే.. సీఎస్‌కే మాత్రం నాలుగు మ్యాచ్‌ల్లో రెండే విజయాలు అందుకుంది. టోర్నీలో ముందంజ వేయాలంటే.. ఈ మ్యాచ్ సీఎస్‌కేకు చాలా కీలకం. ఈ కీలక మ్యాచ్‌కు ముందు చెన్నైకి ఓ శుభవార్త. ఎస్‌ఆర్‌హెచ్‌తో మ్యాచ్‌కు దూరంగా ఇద్దరు స్టార్ పేసర్లు కేకేఆర్‌తో జరిగే మ్యాచ్‌లో ఆడనున్నారు.
సీఎస్‌కే స్టార్ పేసర్లు ముస్తాఫిజుర్ రెహ్మాన్, మతీశ పతిరణలు కేకేఆర్‌తో జరిగే మ్యాచ్‌కు అందుబాటులోకి రానున్నారని తెలుస్తోంది. టీ20 ప్రపంచకప్ 2024 వీసా ప్రాసెస్ కోసం స్వదేశమైన బంగ్లాదేశ్‌కు వెళ్లిన ముస్తాఫిజుర్.. చెన్నైకి బయల్దేరాడని సమాచారం. గాయం కారణంగా గత మ్యాచ్‌కు దూరంగా ఉన్న పతిరణ ఫిట్‌నెస్ సాధించాడట. ముస్తాఫిజుర్, పతిరణ కేకేఆర్‌తో జరుగబోయే మ్యాచ్‌లో ఆడితే.. సీఎస్‌కే బౌలింగ్ బలం పెరగనుంది. ఈ ఇద్దరి గైర్హాజరీలో గత మ్యాచ్‌లో చెన్నై బౌలింగ్ పూర్తిగా తేలిపోయింది.
Also Read: Yash Thakur-IPL 2024: ఐపీఎల్ 2024లో లక్నో బౌలర్ల హవా.. యశ్ ఠాకూర్ అరుదైన రికార్డు!
ఐపీఎల్ 2024లో ముస్తాఫిజుర్ రెహ్మాన్, మతీశ పతిరణ మంచి ఫామ్‌లో ఉన్నారు. ముస్తాఫిజుర్ 3 మ్యాచ్‌ల్లో 7 వికెట్లు పడగొట్టగా.. పతిరణ 2 మ్యాచ్‌ల్లో 4 వికెట్లు తీశాడు. ఇక పాయింట్ల పట్టికలో ప్రస్తుతం కేకేఆర్ రెండో స్థానంలో ఉండగా.. సీఎస్‌కే నాలుగో స్థానంలో ఉంది. కేకేఆర్‌పై గెలిచి పట్టికలో ముందంజ వేయాలని చెన్నై చూస్తోంది.