Site icon NTV Telugu

American Politics: అగ్రరాజ్యంలో ముస్లింల ఆధిపత్యం..? క్రైస్తవ దేశంలో నయా చరిత్ర!

Zohraan Mamdani

Zohraan Mamdani

American Politics: క్రైస్తవులకు కేంద్ర బిందువుగా ఉన్న పేరుగాంచిన అమెరికాలో నయా చరిత్ర మొదలవుతున్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. యూఎస్ రాజకీయాల్లో ముస్లిం నాయకులు ఉద్భవిస్తున్నారు. తాజాగా న్యూయార్క్ మేయర్‌గా భారతీయ-అమెరికన్ జోహ్రాన్ మమ్దానీ, వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్‌గా గజాలా హష్మీ ఎన్నికవడంతో అమెరికాలో ముస్లిం రాజకీయ ప్రభావం ఎంతవరకు ఉందనే దానిపై కొత్త చర్చకు దారితీసిందని విశ్లేషకులు చెబుతున్నారు.

READ ALSO: Riaz Encounter Case: ఎన్ కౌంటర్ మృతుడు రియాజ్ తో నాకు ఎలాంటి పరిచయం లేదు..

జోహ్రాన్ మమ్దానీ, గజాలా హష్మీల చరిత్రాత్మక విజయం..
అమెరికాలో గత 20 ఏళ్లలో ముస్లిం నాయకుల ప్రభావం పెరిగిందని పలు గణాంకాలు చెబుతున్నాయి. యూఎస్ రాజకీయాల్లో ముస్లిం నాయకులు రెండు ఉన్నత పదవులను అధిరోహించి నయా చరిత్ర సృష్టించారు. అమెరికాలో అతిపెద్ద నగరమైన న్యూయార్క్ నగరానికి జోహ్రాన్ మమ్దానీ మేయర్‌గా ఎన్నికవడం దేశ రాజకీయాల్లో గేమ్-ఛేంజర్‌గా మారబోతుందని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. మమ్దానీ 34 ఏళ్ల వయసులో అతి పిన్న వయస్కుడైన మేయర్‌గా ఎన్నికై, ఆ పదవిని చేపట్టిన మొదటి ముస్లిం, భారత సంతతికి చెందిన వ్యక్తిగా రికార్డు సృష్టించారు. విజయం అనంతరం మమ్దానీ మాట్లాడుతూ.. “ఈ విజయం నాది మాత్రమే కాదు, మార్పులో భాగమని భావించే వారందరిదీ” అని పేర్కొన్నారు.

వర్జీనియాలో జరిగిన డిప్యూటీ గవర్నర్ ఎన్నికల్లో గజాలా హష్మీ విజయం సాధించడం ద్వారా దేశంలో కొత్త చరిత్ర సృష్టించారు. ఆమె 2019 లో వర్జీనియా మొదటి ముస్లిం, మొదటి ఇండియన్-అమెరికన్ సెనేటర్ అయ్యారు. అగ్రరాజ్యంలో ముస్లిం నాయకుల ఈ విజయాలు అకస్మాత్తుగా వచ్చినవి కాదని విశ్లేషకులు చెబుతున్నారు. గత రెండు దశాబ్దాలుగా అమెరికాలో ముస్లిం ప్రాతినిధ్యం క్రమంగా పెరిగిందని పలు నివేదికలు చెబుతున్నాయి. ప్రస్తుతం యూఎస్ కాంగ్రెస్‌లో నలుగురు ముస్లిం చట్టసభ సభ్యులు ఉన్నారు. వాస్తవానికి ఇదే దేశంలో ఇప్పటివరకు అత్యధిక సంఖ్య. అలాగే యూఎస్ వ్యాప్తంగా 80 మందికి పైగా ముస్లిం స్థానిక ప్రతినిధులు ఎన్నికయ్యారు. మిచిగాన్, న్యూయార్క్ వంటి రాష్ట్రాల్లో అనేక ప్రధాన నగరాలు ఇప్పుడు ముస్లిం నాయకుల నేతృత్వంలో ఉన్నాయి. మిచిగాన్‌లోని డియర్‌బోర్న్, హామ్‌ట్రామ్క్ వంటి నగరాల్లో ముస్లిం-మెజారిటీ నగర ప్రభుత్వాలు కొలువుదీరాయి.

ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే అమెరికా దేశ జనాభాలో ముస్లిం జనాభా కేవలం 1.1 శాతం మాత్రమే ఉంది. అయినప్పటికీ వారి రాజకీయ ప్రభావం దేశంలో వారి జనాభా కంటే వేగంగా పెరిగిందని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ మార్పు సోషల్ మీడియా ద్వారా ప్రజలతో కనెక్ట్ అవ్వడం, అట్టడుగు స్థాయిలో పనిచేస్తున్న సాంప్రదాయ రాజకీయ పద్ధతుల నుంచి భిన్నంగా యువతను చేరుకోవడం ద్వారా సాధ్యం అయ్యిందని విశ్లేషకులు పేర్కొన్నారు.

READ ALSO: Purushaha: భర్త కావాలనుకున్నాక జీవితం యుద్ధ భూమే !

Exit mobile version