NTV Telugu Site icon

Murali Vijay: క్రికెట్‌కు మురళీ విజయ్ గుడ్‌బై.. అన్ని ఫార్మాట్ల నుంచి రిటైర్

Murali Vijay 1

Murali Vijay 1

టీమిండియా వెటరన్ క్రికెటర్ మురళీ విజయ్ కెరీర్‌కు ముగింపు పలికాడు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకొంటున్నట్లు చెప్పాడు. ప్రపంచ క్రికెట్‌లో కొత్త అవకాశాల కోసం ఎదురు చూస్తున్నానని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించాడు. 2018 డిసెంబర్‌లో టీమిండియా తరఫున చివరి మ్యాచ్ ఆడాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో అతడు తన చివరి టెస్ట్ మ్యాచ్‌లో కనిపించాడు. మొత్తంగా తన కెరీర్‌లో ఇండియా తరఫున మురళీ విజయ్ 61 టెస్టులు, 17 వన్డేలు, 9 టీ20లు ఆడాడు. 2008 బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా జరిగిన చివరి టెస్టే విజయ్‌కు తొలి మ్యాచ్. మొత్తం ఆడిన 61 టెస్టుల్లో 3,982 రన్స్ చేశాడు. ఇందులో 12 సెంచరీలు, 15 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.

ఇక 17 వన్డేల్లో ఒకే హాఫ్ సెంచరీతో 339 రన్స్ చేయగా.. 9 టీ20ల్లో 169 రన్స్ చేశాడు. తన రిటైర్మెంట్ ప్రకటనను ట్విట్టర్ ద్వారా విజయ్ వెల్లడించాడు. “అంతర్జాతీయ క్రికెట్‌ అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకొంటున్నా. 2002 నుంచి 2018 వరకు నా జీవితంలో అద్భుతమైన క్షణాలు. ఇండియా తరఫున అత్యున్నత స్థాయిలో ఆడటం గొప్ప గౌరవంగా భావిస్తున్నా. నాకు అవకాశం ఇచ్చినందుకు బీసీసీఐ, తమిళనాడు క్రికెట్ అసోసియేషన్, చెన్నై సూపర్ కింగ్స్, కెంప్లాస్ట్ సన్మార్‌లకు కృతజ్ఞతలు. నా టీమ్ మేట్స్, కోచ్‌లు, గురువులు, సపోర్ట్ స్టాఫ్ అందరికీ ధన్యవాదాలు. మీ అందరితో కలిసి ఆడటం గొప్ప గౌరవంగా భావిస్తున్నా. నా కలను నిజం చేయడంలో మీరు చేసిన సాయానికి థ్యాంక్యూ. నా కెరీర్ ఒడిదుడుకుల్లోనూ నా వెంట ఉన్న క్రికెట్ ఫ్యాన్స్‌కు కూడా కృతజ్ఞతలు” అని విజయ్ ట్వీట్ చేశాడు. కాగా, తమిళనాడు తరఫున మురళీ విజయ్ తన కెరీర్లో మొత్తం 135 ఫస్ట్ క్లాస్, 94 లిస్ట్ క్రికెట్ మ్యాచ్‌లు ఆడాడు. ఇక అతడు ఐపీఎల్లోనూ 106 మ్యాచ్‌ల్లో ప్రాతినిధ్యం వహించాడు. ఈ మెగా లీగ్‌లో రెండు సెంచరీలు, 13 హాఫ్ సెంచరీలతో 2,619 రన్స్ చేశాడు.