IPL 2026 Mumbai Indians: ముంబై ఇండియన్స్ జట్టు ఐపీఎల్ 2026ను మంచి ఆరంభంతో ప్రారంభించినప్పటికీ.. ప్రస్తుతం పీకల్లోతు కష్టాల్లో పడింది. తొలి మ్యాచ్‌లో కోల్కతా నైట్ రైడర్స్ పై విజయం సాధించిన ముంబై, ఆ తర్వాత మాత్రం ఫామ్ కోల్పోయింది. గురువారం రాత్రి చెన్నై సూపర్ కింగ్స్ పై వాంఖెడేలో జరిగిన మ్యాచ్ లో ముంబై ఓటమి చవిచూడడంతో జట్టు పరిస్థితి మరింత కష్టంగా మారింది.
హార్దిక్ పాండ్యా సారథ్యంలో ముంబై ఇండియన్స్ ఐపీఎల్ 2026 సీజన్ లో ఇప్పటివరకు 7 మ్యాచ్‌లు ఆడి కేవలం 2 విజయాలు, నెట్ రన్ రేట్ -0.736తో 4 పాయింట్లు మాత్రమే సాధించింది. దీనితో పాయింట్ల పట్టికలో జట్టు 8వ స్థానంలో ఉంది. ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించాలంటే ఇక ప్రతి మ్యాచ్ కీలకంగా మారింది. సాధారణంగా 10 జట్ల ఫార్మాట్‌లో ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించాలంటే కనీసం 16 పాయింట్లు అవసరం.
ప్రస్తుతం ముంబై ఇండియన్స్ 4 పాయింట్లతో ఉండగా, ఇంకా 7 మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. కాబట్టి ప్లేఆఫ్స్‌కు చేరాలంటే కనీసం 6 మ్యాచ్‌లు గెలవాలి. అప్పుడు మొత్తం 16 పాయింట్లు సాధించి టాప్-4లో స్థానం దక్కించుకునే అవకాశాలు బలంగా ఉంటాయి. ఒకవేళ 5 మ్యాచ్‌లు మాత్రమే గెలిస్తే 14 పాయింట్లకు చేరుతుంది. ఇది కొన్నిసార్లు సరిపోతుంది. కానీ.. నెట్ రన్ రేట్, ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడి ఉంటుంది.
ముంబై ఇండియన్స్ గతంలో కూడా ఇలాంటి పరిస్థితుల నుంచి తిరిగి పుంజుకున్న అనుభవం బాగానే ఉంది. ముఖ్యంగా 2015 సీజన్‌లో రోహిత్ శర్మ కెప్టెన్సీలో తొలి 7 మ్యాచ్ లలో కేవలం 2 విజయాలు మాత్రమే సాధించిన జట్టు, ఆ తర్వాతి 7 మ్యాచ్‌లలో 6 విజయాలు సాధించి 16 పాయింట్లతో ప్లేఆఫ్స్ చేరి చివరికి ఛాంపియన్‌గా నిలిచింది. అలాగే గత సీజన్‌లో కూడా చివరి దశలో 7 మ్యాచ్ లలో 5 గెలిచి ప్లేఆఫ్స్ కు చేరింది. అయితే ఈసారి పోటీ మరింత కఠినంగా ఉండటంతో అదే ప్రదర్శన సరిపోతుందా అన్నది అనుమానమే. ప్రస్తుతం ముంబై ఇండియన్స్‌కు ప్రతి మ్యాచ్ ‘డూ ఆర్ డై’ పరిస్థితిగా మారింది. బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలోనూ స్థిరత్వం అవసరం. అనుభవజ్ఞులైన ఆటగాళ్లు తమ స్థాయికి తగ్గ ప్రదర్శన ఇవ్వాల్సిన అవసరం కనపడుతుంది.
