ములుగు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఆరు నెలలుగా జీతాలు లేక ఔట్సోర్సింగ్ ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ములుగు జిల్లా మాధవరావుపల్లి కి చెందిన మైదం మహేష్(34).. ములుగు గ్రామ పంచాయతీలో ఔట్సోర్సింగ్ డైలీ లేబర్ గా విధులు నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ నేపథ్యంలో గత ఆరు నెలలుగా జీతం లేకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టాయి. దీంతో ఏం చేయాలో తోచక గడ్డి మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు మహేష్..
READ MORE: Supreme Court: చెట్లు నరకడం వల్లే ఈ దుస్థితి.. వరదలపై కేంద్ర, రాష్ట్రాలకు నోటీసులు
గమనించిన కుటుంబీకులు హుటాహుటిన ములుగు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. డాక్టర్ల సూచన మేరకు వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మహేష్ మృతి చెందాడు. కేసు నమోదు చేసిన పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎంజీఎం మార్చురీకి తరలించారు. ప్రభుత్వం ఉద్యోగ భత్యాలు ఇవ్వడంలో విఫలమైన కారణం చేత తమ భర్తను కోల్పోయానంటూ మహేష్ భార్య ఆవేదన వ్యక్తం చేశారు. బాధితుడి కుటుంబీకులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. మహేష్‌కు ముగ్గురు కుమార్తెలు ఉండగా వారిని ప్రభుత్వం ఆదుకోవాలని ములుగు జిల్లా కేంద్రంలోని మున్సిపాలిటీ కార్యాలయం ఎదుట తోటి కార్మికులు ధర్నా నిర్వహించారు.
READ MORE: Hyderabad: డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడ్డ 8 మంది ట్రాన్స్‌జెండర్లు.. ఈ యాప్ ద్వారా కొనుగోళ్లు..!
