NTV Telugu Site icon

Corona Virus: కరోనా వచ్చి.. తగ్గిపోలేదు.. ఏడాది తర్వాతే దాని విశ్వరూపం

Corona

Corona

Corona Virus: కరోనా మహమ్మారి ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన సంగతి తెలిసిందే. ప్రజా జీవితాన్ని సమూలంగా మార్చేసింది. మనిషి ఎదుటి వారిని చూసి జడుసుకునేంతగా చేసేసింది. అప్పటి వరకు మాస్క్, శానిటైజర్లంటే తెలియని జనానికి వాటిని తప్పనిసరి చేసింది. పలు దేశాల ఆర్థికవ్యవస్థలను చిన్నాభిన్నం చేసింది. ప్రతి సారి దాని ప్రభావం పోయింది.. అనుకునే లోపే మళ్లీ రూపం మార్చుకుని తన ప్రతాపాన్ని చూపిస్తూనే ఉంది. తాజాగా బ్రిటన్‌ పరిశోధకుల అధ్యయనంలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. కరోనా వైరస్‌ లక్షణాలు బయటపడ్డ ఏడాది తర్వాత శరీరంలోని ఏదో ఒక అవయవం దెబ్బతింటున్నదని అధ్యయనంలో తేలింది. అలసట, శ్వాస సమస్యలు, ఛాతి, కీళ్ల నొప్పులు, తలనొప్పి, మెదడు సంబంధ సమస్యలు, నిద్రలేమి, ఆందోళనతో రోగులు నిత్యం సతమతమవుతూనే ఉన్నారు.

Read Also: Wedding Card : పెళ్లికి ఒక్కమ్మాయే దొరకడం లేదంటే.. నీకు ఇద్దరా.. గ్రేట్ బాసూ

కాగా, దీర్ఘకాల కొవిడ్‌ లక్షణాలతో బాధపడుతున్న 59 శాతం మందిలో కరోనా వైరస్‌ లక్షణాలు బయటపడ్డ ఏడాది తర్వాత శరీరంలోని ఏదో ఒక అవయవం దెబ్బతింటున్నదని పరిశోధనలు తెలుపుతున్నాయి. కరోనా వైరస్ సోకినప్పుడు ఇబ్బంది పడని వారిలో కూడా ఈ సమస్య తలెత్తుతుందని పరిశోధకులు గుర్తించారు. 536 మంది కొవిడ్‌ రోగులపై పరిశోధకులు అధ్యయనం నిర్వహించారు. ఇందులో 13 శాతం మంది కరోనాతో దవాఖానలో చేరినవారు కాగా, 32 శాతం మంది ఆరోగ్య కార్యకర్తలు ఉన్నారు. ఈ 536 మంది రోగులకు ఆరు నెలల తర్వాత 40 నిమిషాల పాటు మల్టీ ఆర్గాన్‌ ఎంఆర్‌ఐ స్కాన్‌ నిర్వహించారు. ఈ ఫలితాలను ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీలో విశ్లేషించగా, ఇందులో షాకింగ్‌ విషయాలు బయటపడ్డాయి. ఈ అధ్యయన ఫలితాలు ‘జర్నల్‌ ఆఫ్‌ ది రాయల్‌ సొసైటీ ఆఫ్‌ మెడిసిన్‌’లో ప్రచురితమయ్యాయి.