Site icon NTV Telugu

MS Swaminathan Jayanti: ప్రజల ఆకలి తీర్చిన విజ్ఞాని.. ఎంఎస్ స్వామినాథన్ జయంతి స్పెషల్

Ms Swaminathan

Ms Swaminathan

MS Swaminathan Jayanti: ఒక నాడు తిండి గింజలు లేక ఏడ్చిన దగ్గరి నుంచి నేడు వాటిని విదేశాలకు ఎగుమతి చేసే స్థాయికి భారత్ ఎదిగిందంటే దాని వెనక ఉన్న వ్యక్తి ఎంఎస్ స్వామినాథన్‌. కరువుతో అల్లాడుతున్న ప్రజలకు కాంతిరేఖలా మారిన ఆ మహోన్నత వ్యక్తి కృషి ఫలితమే నేడు మనం తినే తిండి గింజలు. ఎంఎస్ స్వామినాథన్‌‌గా దేశ ప్రజలందరికి సుపరిచతమైన ఆయన అసలు పేరు మంకొంబు సాంబశివన్ స్వామినాథన్. ఆయన 7 ఆగస్టు 1925 జన్మించి, 28 సెప్టెంబర్ 2023లో స్వర్గస్థులయ్యారు. నేడు ఆ మహనీయుడి జయంతి. ఆయన గురించి ఈ స్టోరీలో తెలుసుందాం..

READ MORE: Manchu Lakshmi : మంచు లక్ష్మీ యాసపై బన్నీ కూతురు సెటైర్లు..

పుట్టుక నీది.. చావు నీది.. బతుకంతా దేశానిది
తమిళనాడులోని కుంభకోణంలో 1925 ఆగస్టు 7న స్వామినాథన్ పుట్టారు. వారి తల్లిదండ్రులు జనరల్ సర్జన్ ఎంకే సాంబశివన్-పార్వతి తంగమ్మాళ్ సాంబశివన్. 1951లో ఆయన కేంబ్రిడ్జ్‌లో చదువుతున్నప్పుడు తన మీనా స్వామినాథన్‌ను కలిశారు. వారికి ముగ్గురు కుమార్తెలు సౌమ్య స్వామినాథన్, మధుర స్వామినాథన్, నిత్య స్వామినాథన్.
పుట్టుక నీది.. చావు నీది.. బతుకంతా దేశానిదని అన్న ప్రజాకవి కాళోజీ వాక్యాలు ఎంఎస్ స్వామినాథన్‌కు అచ్చం సరిపోతాయి. ఆయన తన 3 పదుల వయసులోనే దేశ భవిష్యత్ మార్చారు. 1954 ప్రారంభంలో కటక్‌లోని సెంట్రల్ రైస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో తాత్కాలికంగా అసిస్టెంట్ బోటనిస్ట్‌గా ఆయన వృత్తి జీవితం ప్రారంభం అయ్యింది. ఆ తరువాత అక్టోబర్ 1954లో అసిస్టెంట్ సైటోజెనెటిస్ట్‌గా న్యూఢిల్లీలోని ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (IARI)లో చేరారు. భారతదేశంలో డెబ్బై శాతం వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నప్పుడు భారతదేశం ఆహార ధాన్యాలను దిగుమతి చేసుకోవడాన్ని స్వామినాథన్ విమర్శించారు.

ఆయన పరిశోధనల కృషి..
బంగాళాదుంపలపై ఆయన చేసిన పరిశోధన చాలా విలువైనది. ఆయన విస్కాన్సిన్ విశ్వవిద్యాలయంలో తన పోస్ట్‌డాక్టోరల్ ఫెలోషిప్ సమయంలో, మంచు-నిరోధక బంగాళాదుంపను అభివృద్ధి చేయడంలో పరిశోధనలు జరిపారు. ఆయన పరిశోధనల్లో దిగుబడి, పెరుగుదలను నియంత్రించే జన్యు లక్షణాలు, ఉత్పాదకతను పెంచడంలో ముఖ్యమైన కారకాలు సహా బంగాళాదుంపల జన్యు విశ్లేషణ కీలకమైనవి చెప్తారు. 1950 – 1960 లలో స్వామినాథన్ హెక్సాప్లోయిడ్ గోధుమల సైటోజెనెటిక్స్‌పై ప్రాథమిక పరిశోధనలు చేశారు. స్వామినాథన్ – బోర్లాగ్ అభివృద్ధి చేసిన గోధుమ, బియ్యం రకాలు హరిత విప్లవానికి పునాదిగా నిలిచాయని చరిత్రకారులు పేర్కొన్నారు. మెరుగైన కిరణజన్య సంయోగక్రియ, నీటి వినియోగాన్ని అనుమతించే C 4 కార్బన్ స్థిరీకరణ సామర్థ్యాలతో వరిని పండించే ప్రయత్నాలు IRRIలో స్వామినాథన్ ఆధ్వర్యంలోనే ప్రారంభించబడ్డాయి. ప్రపంచంలోనే మొట్టమొదటి అధిక దిగుబడినిచ్చే బాస్మతి అభివృద్ధిలో స్వామినాథన్ పాత్ర ఉంది.

స్వామినాథన్ అధిరోహించిన పదవులు..
ఎంఎస్ స్వామినాథన్ తన జీవిత కాలంలో అనేకానేక పదవులను అధిరోహించారు. 1961-72 మధ్య కాలంలో ఇండియన్ అగ్రికల్చరల్ రీసర్చ్ ఇన్‌స్టిట్యూట్ డైరెక్టర్‌గా పనిచేశారు. 1972-79 మధ్యకాలంలో ICAR డైరక్టర్ జనరల్‌గా ఎన్నికయ్యారు. 1979-80లో వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శిగా విధులు నిర్వహించారు. 1980-82 మధ్యకాలంలో ప్లానింగ్ కమిషన్ సభ్యుడు (సైన్స్ అండ్ అగ్రికల్చర్)గా, డిప్యూటీ ఛైర్మన్‌గా సేవలందించారు. 1982-88 మధ్యకాలంలో ఫిలిప్పీన్స్ ఇంటర్నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ డైరక్టర్ జనరల్‌గా బాధ్యతలు నిర్వహించారు. 2004లో దేశంలోని రైతుల ఆత్మహత్యలు, ఇబ్బందులను అధ్యయనం చేయడానికి ఏర్పాటు చేసిన నేషనల్ కమిషన్‌కు ఛైర్మన్‌గా నియమితులయ్యారు. ఈ కమిటీ దేశంలోని రైతుల ఆర్థిక స్థితిగతులు, ఆత్మహత్యలు, ఒత్తిళ్లపై అధ్యయనం చేసి 2006లో నివేదిక సిద్ధం చేసింది. సాగు సగటు ఉత్పత్తి వ్యయంలో కనీసం 50% ఉండేలా పంటకు కనీస మద్దతు ధర నిర్ణయించాలని కమిటీ ఈ సందర్భంగా సూచించింది. 1987లో ‘వరల్డ్ ఫుడ్ ప్రైజ్’ పురస్కారాన్ని అందుకున్నారు. 1988లో ఎం.ఎస్ స్వామినాథన్ రీసర్చ్ ఫౌండేషన్ (MSSRF)ను స్థాపించి గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేసేందుకు కృషిచేశారు. ఈ సంస్థ వ్యవసాయ పరిశోధనలతో దేశవ్యాప్తంగా 14 రాష్ట్రాల్లోని రైతులకు సాయం చేస్తోంది. భారత రత్న, ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ MS స్వామినాథన్.. జపాన్, యూఎస్, మెక్సికో శాస్త్రవేత్తలతో కలిసి వరి, గోధుమ వంగడాలపై చేసిన పరిశోధనలు ఎంతో మంది ఆకలి కేకలను దూరం చేశాయి. తిండి గింజలు లేక ఏడ్చిన స్థాయి నుంచి ప్రపంచ దేశాలకు వాటిని ఎగుమతి చేసే స్థాయికి భారత్ ఈ రోజు ఎదిగిందంటే కారణం ఆయన కృషి ఫలితమే.

READ MORE: Instagram: యూజర్ల కోసం ఇన్‌స్టాగ్రామ్ 3 కొత్త ఫీచర్లు.. ఇకపై మీకు నచ్చిన రీల్స్ ను..

Exit mobile version