NTV Telugu Site icon

MS Dhoni: మాటలతో కాకుండా.. పనులతో గౌరవం పొందడం ముఖ్యం!

Ms Dhoni Captain

Ms Dhoni Captain

మాటలతో కాకుండా.. పనులతో గౌరవం పొందడం చాలా ముఖ్యం అని టీమిండియా మాజీ కెప్టెన్‌ ఎంఎస్ ధోనీ అభిప్రాయపడ్డాడు. ఉన్నత పదవిలో ఉన్నంత మాత్రాన గౌరవం రాదని, దాన్ని మన ప్రవర్తనతో సంపాదించుకోవాలన్నాడు. మాటలు చెప్పడం కంటే చేతల్లో చూపిస్తేనే నమ్మకం పొందగలమని మహీ చెప్పాడు. భారత క్రికెట్‌లోనే కాకుండా ప్రపంచ క్రికెట్‌లో కూడా ధోనీ ఓ లెజెండ్‌. టీమిండియాకు 2007 టీ20 ప్రపంచకప్, 2011 వన్డే ప్రపంచకప్, 2023 ఛాంపియన్స్ ట్రోఫీని అందించాడు. అంతేకాకుండా.. ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో మొదటిసారిగా టీమిండియాను అగ్రస్థానానికి చేర్చాడు.

శుక్రవారం ముంబైలో జరిగిన ఓ ఫంక్షన్‌లో పాల్గొన్న ఎంఎస్ ధోనీ పలు విషయాలపై స్పందించాడు. ‘విధేయత, గౌరవంకు చాలా సంబంధం ఉంది. మన పట్ల వ్యక్తుల్లో గౌరవం ద్వారానే విధేయత వస్తుంది. డ్రెస్సింగ్‌ రూంలో సహాయక సిబ్బంది లేదా ఆటగాళ్లు మిమ్మల్ని గౌరవిస్తే తప్ప విధేయతను పొందడం కష్టం. నువ్ ఏమీ మాట్లాడకున్నా.. నీ ప్రవర్తన గౌరవాన్ని సంపాదించుకోగలదు. గౌరవం సంపాదించడం ముఖ్యమని నేను ఎప్పుడూ భావిస్తాను. గౌరవం అనేది హోదాతో రాదు, మన ప్రవర్తనతోనే వస్తుంది. మనం కేవలం మాటలు చెబితే సరిపోదు, ఏదైనా చేతల్లోనే చూపించాలి’ అని ధోనీ చెప్పాడు.

Also Read: Miss World Pageant: భారత్‌లోనే మిస్‌ వరల్డ్‌ పోటీలు!

‘ఒక్కోసారి ప్లేయర్స్ అభద్రతాభావంలో ఉంటారు. కొన్నిసార్లు జట్టు మిమ్మల్ని విశ్వసించినప్పటికీ.. మిమ్మల్ని విశ్వసించని మొదటి వ్యక్తి మీరే అవుతారు. సంక్షిప్తంగా చెప్పాలంటే.. గౌరవం దానంతట అది రాదు, మనం సంపాదించుకోవాలి. మీకు విధేయత ఉంటే.. గౌరవం అదే వస్తుంది. జట్టులో కొంతమంది ఒత్తిడిని ఇష్టపడతారు, కొంతమంది ఇష్టపడరు. వ్యక్తి యొక్క బలాన్ని మరియు బలహీనతను అర్థం చేసుకోవడం ముఖ్యం. బలహీనత అని అతనికి చెప్పకుండానే మనం దానిని దూరం చేసే ప్రయత్నం చేయాలి. ఆటగాడి లోపాలను గుర్తించడం కెప్టెన్ లేదా కోచ్ యొక్క పని’ అని ఎంఎస్ ధోనీ చెప్పుకొచ్చాడు.