Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!

  • లిఫ్ట్, గోడ మధ్య ఇరుక్కున్న మురళి
  • సెన్సార్లు పనిచేయక పైకి కదిలిన లిఫ్ట్
  • గోడ బద్దలుకొట్టి గంటన్నరపాటు రెస్క్యూ
  • సకాలంలో స్పందించి ప్రాణాలు కాపాడిన సిబ్బంది
Hydraa

Hydraa

హైదరాబాద్‌లోని మూసాపేట ఆంజనేయ నగర్‌లో ఆదివారం ఉదయం తీవ్ర ఉత్కంఠ రేపిన ఘోర లిఫ్ట్ ప్రమాదం చోటుచేసుకుంది. ఓ మూడంతస్తుల భవనంలో లిఫ్టుకు, గోడకు మధ్య ఇరుక్కుపోయి తీవ్ర ప్రాణాపాయ స్థితిలో వేలాడుతున్న వ్యక్తిని హైడ్రా డీఆర్ఎఫ్, ఫైర్ సిబ్బంది అత్యంత సాహసోపేతంగా శ్రమించి సురక్షితంగా బయటకు తీశారు. సమయస్ఫూర్తితో వ్యవహరించిన అధికారులు బాధితుడికి పునర్జన్మ ప్రసాదించారు.

లిఫ్ట్ నుంచి అడుగు బయటపెడుతుండగానే అనూహ్య ప్రమాదం!

బాధితుడు మురళి (40) తన భార్యతో కలిసి గ్రౌండ్ ఫ్లోర్ నుంచి రెండో అంతస్తుకు వెళ్లేందుకు అపార్ట్‌మెంట్ లిఫ్ట్ ఎక్కారు. సరిగ్గా రెండో అంతస్తు రాగానే ఆయన బయటకు అడుగుపెడుతున్న సమయంలో, మూడో అంతస్తులోని వారు ఎవరో లిఫ్ట్ బటన్ నొక్కారు. దీంతో సెన్సార్లు పనిచేయకపోవడంతో లిఫ్ట్ హఠాత్తుగా పైకి కదిలింది. ఈ క్రమంలో మురళి ఒక కాలు బయట, మరో కాలు లిఫ్ట్‌లో ఉండగానే ఆయన శరీరం గోడకు, లిఫ్టుకు మధ్య తీవ్రంగా ఇరుక్కుపోయింది. కాలు గ్రిల్స్‌లో చిక్కుకుని వేలాడుతున్న మురళిని చూసి ఆయన భార్య గట్టిగా కేకలు వేయడంతో అపార్ట్‌మెంట్ వాసులు కాపాడేందుకు విఫలయత్నం చేశారు.

గోడ బద్దలుకొట్టి.. గంటన్నరపాటు సాహసోపేత ఆపరేషన్!

ఉదయం 9:15 గంటలకు కంట్రోల్ రూమ్‌కు సమాచారం అందుకోగానే కూకట్‌పల్లి డీఆర్ఎఫ్ బృందం మార్షల్ జేడీవీ ప్రసాద్ నేతృత్వంలో 9:30 గంటలకల్లా ఘటనా స్థలానికి చేరుకుంది. పరిస్థితి విషమంగా ఉండటంతో సనత్‌నగర్ ఫైర్ సిబ్బందిని కూడా రప్పించారు. ఫైర్ సిబ్బంది తెచ్చిన హైడ్రాలిక్ కట్టర్ల సాయంతో లిఫ్ట్ పక్కనే ఉన్న గోడను బద్దలుకొట్టారు. అత్యంత జాగ్రత్తగా గంటన్నర పాటు శ్రమించి ఉదయం 10:50 గంటల సమయంలో మురళిని క్షేమంగా బయటకు తీశారు.

పాతబడిన సెన్సార్లే కారణం.. సిబ్బందికి గ్రామస్థుల అభినందనలు!

భవనంలోని పాత గ్రిల్స్, లిఫ్ట్ సెన్సార్లు సరిగ్గా పనిచేయకపోవడమే ఈ దుర్ఘటనకు ప్రధాన కారణమని పోలీసులు తెలిపారు. ప్రమాదంలో మురళి కాలు లిఫ్ట్ మధ్య నలిగిపోయి ఫ్రాక్చర్ కావడంతో సిబ్బంది వెంటనే అతడిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సకాలంలో స్పందించి ఒకరి ప్రాణాన్ని నిలబెట్టిన హైడ్రా డీఆర్ఎఫ్ , ఫైర్ సిబ్బంది సాహసాన్ని, చాకచక్యాన్ని స్థానికులు వేనోళ్ల ప్రశంసించారు.