టీమిండియా సీనియర్ ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమీ గత కొంతకాలంగా భారత జట్టుకు దూరమయ్యాడు. ఇటీవలి కాలంలో టెస్ట్, వన్డేలతో పాటు టీ20 సిరీస్‌లో కూడా షమీకి చోటు దక్కలేదు. షమీ చివరిసారిగా చాంపియన్స్ ట్రోఫీలో ఆడాడు. గాయం కారణంగా షమీ ఆడట్లేదని, అతడి ఫిట్‌నెస్‌పై తమకు ఎలాంటి సమాచారం లేదని అప్పట్లో చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ చెప్పాడు. త్వరలో జరగనున్న ఆస్ట్రేలియా వన్డే సిరీస్‌కు కూడా షమీ ఎంపిక కాలేదు. తనను ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపిక చేయకపోవడంపై బీసీసీఐ సెలెక్టర్లపై పరోక్షంగా షమీ అసంతృప్తి వ్యక్తం చేశాడు.
తాజాగా మహమ్మద్ షమీ మాట్లాడుతూ… ‘నేను రంజీ ట్రోఫీలో నాలుగు రోజుల మ్యాచ్‌లు ఆడటానికి సిద్ధంగా ఉన్నాను. అంటే 50 ఓవర్ల వన్డే మ్యాచ్‌లు ఆడటంలో ఎలాంటి సమస్య లేదు. అయినా సెలెక్షన్ నా చేతుల్లో లేదు. ఒకవేళ నాలో ఫిట్‌నెస్ సమస్య ఉంటే.. నేను ఇక్కడ బెంగాల్ తరపున ఆడేందుకు సిద్ధంగా ఉండేవాడిని కాదు. నేను నాలుగు రోజుల మ్యాచ్‌లు ఆడగలిగినప్పుడు.. 50 ఓవర్ల క్రికెట్ కూడా ఆడగలను’ అని తన సామర్థ్యంపై నమ్మకాన్ని వ్యక్తం చేశాడు.
Also Read: IND vs PAK: షేక్‌హ్యాండ్ ఇచ్చుకున్న భారత్-పాకిస్థాన్ ప్లేయర్లు.. ఫోటో వైరల్!
ఫిట్‌నెస్‌పై అప్‌డేట్ ఇవ్వడం తన బాధ్యత కాదని మహమ్మద్ షమీ ఫైర్ అయ్యాడు. ‘ఫిట్‌నెస్ గురించి చెప్పడం అడగడం, సమాచారం ఇవ్వడం నా బాధ్యత కాదు. అది నా పని కూడా కాదు. ఎన్‌సీఏకు వెళ్లి సిద్ధమవడం, మ్యాచ్‌లు ఆడడమే నా పని. సెలెక్టర్లకు ఎవరు అప్‌డేట్ ఇస్తున్నారు, ఎవరు ఇవ్వడం లేదు అనేది వారి విషయం. ఒక్కటి మాత్రం చెప్పగలను నా ఫిట్‌నెస్ విషయంలో ఎలాంటి సమస్య లేదు’ అని టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్‌ను షమీ ఏకిపారేసాడు. షమీ భారత్ తరఫున 64 టెస్టులు, 108 వన్డేలు, 25 టీ20లు ఆడాడు.
