Mohammad Rizwan – Litton Das: అరె బాబు కొట్టేసుకుంటారా ఏంటి.? పాక్ – బంగ్లా ఆటగాళ్ల మధ్య మాటల యుద్ధం..

Mohammad Rizwan Litton Das

Mohammad Rizwan Litton Das

Mohammad Rizwan and Litton Das: బంగ్లాదేశ్ లోని సిల్హెట్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా జరుగుతున్న బంగ్లాదేశ్, పాకిస్తాన్ రెండో టెస్టు మ్యాచ్‌లో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఉత్కంఠభరితంగా సాగుతున్న ఈ మ్యాచ్‌లో, పాకిస్తాన్ బ్యాటర్ మొహమ్మద్ రిజ్వాన్, బంగ్లాదేశ్ వికెట్ కీపర్ లిట్టన్ దాస్ మధ్య తీవ్ర వాగ్వాదం నెలకొంది. ఇద్దరి మధ్య మాటామాటా పెరగడంతో కొద్దిసేపు మ్యాచ్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

ఈ టెస్టులో బంగ్లాదేశ్ నిర్దేశించిన 437 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో పాకిస్తాన్ జట్టు ఆపసోపాలు పడుతోంది. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి పాకిస్తాన్ 316 పరుగులు చేసింది. ఇంకా విజయానికి 121 పరుగులు అవసరం కాగా, చేతిలో కేవలం మూడు వికెట్లు మాత్రమే మిగిలి ఉన్నాయి. అయితే మ్యాచ్ నాలుగో రోజు 72వ ఓవర్ సమయంలో ఈ వివాదం చోటు చేసుకుంది. బ్యాటింగ్ చేస్తున్న రిజ్వాన్.. సైడ్ స్క్రీన్ సరిగా లేదని అంపైర్‌కు ఫిర్యాదు చేస్తూ బౌలర్‌ను ఆపేశాడు. ఇదే సమయంలో లిటన్ దాస్ జోక్యం చేసుకుని రిజ్వాన్‌పై వ్యంగ్య వ్యాఖ్యలు చేశాడు.

“ఏం చేస్తున్నావ్?”, “అక్కడ ఏమి చూస్తున్నావ్? ఇక్కడ బ్యాటింగ్ చేయ్” అంటూ లిటన్ దాస్ వ్యాఖ్యానించగా, రిజ్వాన్ కూడా తీవ్రంగా స్పందించాడు. “ఇది నీ పని కాదు.. అంపైర్ పని” అంటూ కౌంటర్ ఇచ్చాడు. దీంతో మాటామాటా పెరిగి ఇద్దరి మధ్య ఘర్షణాత్మక వాతావరణం ఏర్పడింది. ఇంతటితో ఆగని లిటన్ దాస్.. “50 పరుగులు అయ్యాక ఇప్పుడు యాక్టింగ్ మొదలవుతుంది” అంటూ రిజ్వాన్‌ను ఎగతాళి చేసినట్లు స్టంప్ మైక్‌లో వినిపించింది. ఈ వ్యాఖ్యలతో రిజ్వాన్ మరింత ఆగ్రహానికి గురయ్యాడు. వెంటనే అంపైర్లు జోక్యం చేసుకుని ఇద్దరినీ శాంతింపజేశారు. అనంతరం మ్యాచ్ తిరిగి ప్రారంభమైంది.

ఇప్పటివరకు సిరీస్‌లో ఆశించిన స్థాయిలో రాణించని రిజ్వాన్.. ఈ మ్యాచ్‌లో మాత్రం అర్థ సెంచరీతో ఫామ్‌లోకి వచ్చినట్లు కనిపించాడు. దీనితో లిటన్ దాస్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కొందరు అభిమానులు లిటన్ దాస్ వైఖరిని సరదాగా తీసుకుంటుండగా, మరికొందరు మాత్రం మైదానంలో పరస్పర గౌరవం ఉండాలని అభిప్రాయపడుతున్నారు. ఈ ఘటనతో మ్యాచ్‌కు మరింత మసాలా జతైంది. చివరి రోజు ఆటలో పాకిస్తాన్ లక్ష్యాన్ని చేధిస్తుందా? లేక బంగ్లాదేశ్ చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేస్తుందా? అనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. ఇప్పటికే మొదటి టెస్ట్ లో బంగ్లా విజయం సాధించిన సంగతి తెలిసిందే.