భారత జాతీయ జట్టులోకి రీఎంట్రీ ఇచ్చిన సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్‌పై మాజీ క్రికెటర్ మోహద్ కైఫ్ ప్రశంసల వర్షం కురిపించారు. భువనేశ్వర్ కుమార్ ఏమాత్రం తక్కువ కాదని, అగ్రశ్రేణి పేసర్ జస్ప్రీత్ బుమ్రాతో సమానంగా రాణించగలడని ఆయన అభిప్రాయపడ్డారు. టీ20 అంతర్జాతీయ క్రికెట్ గణాంకాలను పరిశీలిస్తే బుమ్రాకు, భువికి మధ్య పెద్దగా తేడా ఉండదని కైఫ్ పేర్కొన్నారు. బుమ్రా టీ20 ఇంటర్నేషనల్స్ లో 6.52 ఎకానమీ రేట్ కలిగి ఉండగా, భువనేశ్వర్ కుమార్ ఎకానమీ రేట్ 6.96గా ఉందని, ఈ రికార్డులే వారిద్దరి సత్తాను తెలియజేస్తాయని తెలిపారు.
సెలెక్షన్ గురించి ఎక్కువగా ఆలోచించకుండా కేవలం తన ఆటపైనే దృష్టి పెట్టడం వల్లే భువి మళ్లీ జట్టులోకి పునరాగమనం చేయగలిగాడని కైఫ్ అన్నారు. సెలెక్షన్ కోసం మీడియాను ఆశ్రయించడం, ఇతరులతో సిఫార్సులు చేయించడం వంటి పనులకు భువి దూరంగా ఉంటాడని చెప్పారు. నిరంతరం ట్రైనర్లు, ఫిజియోలతో కలిసి శ్రమిస్తూ, తన బౌలింగ్ నైపుణ్యాలైన యార్కర్లు, ఇన్-స్వింగ్, అవుట్-స్వింగ్, స్లోయర్ బంతులను మెరుగుపరుచుకోవడంలో ఎప్పుడూ నిమగ్నమై ఉంటాడని తెలిపారు.
గతంలో టీమిండియా ఓడిపోయిన కొన్ని మ్యాచ్‌లలో భువనేశ్వర్‌పై అనవసరంగా విమర్శలు వచ్చాయని కైఫ్ గుర్తుచేశారు. బోర్డుపై తగినన్ని పరుగులు లేనప్పటికీ, ఆ వైఫల్యాల భారాన్ని మొత్తం బౌలర్లపైనే మోపడం సరికాదన్నారు. భువి రికార్డులు ఎప్పుడూ అద్భుతంగానే ఉన్నాయని, ఏకాగ్రతతో చేసే కఠిన సాధనే ఆయనను మళ్లీ ఉన్నత స్థాయికి చేర్చిందని కైఫ్ అభిప్రాయపడ్డారు.

