Modi G20 Initiatives: 20 ఏళ్ల చరిత్రలో తొలిసారిగా దక్షిణాఫ్రికాలో జీ 20 శిఖరాగ్ర సమావేశం జరుగుతోంది. ఈ జీ–20 శిఖరాగ్ర సమావేశంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రపంచ అభివృద్ధి నమూనాలపై కొత్తగా ఆలోచించే సమయం వచ్చిందని స్పష్టం చేశారు. ‘సమగ్ర, స్థిరమైన ఆర్థిక వృద్ధి – ఎవరూ వెనుకపడకూడదు’ అనే అంశంపై మోడీ మాట్లాడారు. ఇప్పటి వరకు అవలంభించిన గ్లోబల్ గ్రోత్ విధానాలు అనేవి పెద్ద సంఖ్యలో ప్రజలకు వనరులు అందకుండా చేయడం మాత్రమే కాకుండా, ప్రకృతి దోపిడీకి దారితీసి ప్రపంచానికి కొత్త సవాళ్లను సృష్టించాయని పేర్కొన్నారు. ఈ సమస్యలు ఆఫ్రికా వంటి ప్రాంతాల్లో మరింత తీవ్రంగా కనిపిస్తున్నాయని ఆయన వెల్లడించారు. ఈ నేపథ్యంలో ప్రపంచ సమగ్రాభివృద్ధిని లక్ష్యంగా చేసుకుని ప్రధాని మోడీ జీ–20 వేదికపై మూడు కీలక కార్యక్రమాలను ప్రతిపాదించారు.. అవి ఏమిటంటే..
READ ALSO: Hyderabad: హైదరాబాద్‌లో బీభత్సం.. కర్రలు, కత్తులతో నడిరోడ్డుపై గ్యాంగ్ వార్ !
* గ్లోబల్ ట్రెడిషనల్ నాలెడ్జ్ రిపోజిటరీ
ఈ సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతూ.. ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో సమాజాలు శతాబ్దాలుగా పర్యావరణ సమతుల్యత, సాంస్కృతిక సంపద, సామాజిక ఐక్యతను కాపాడే జీవన శైలులను అనుసరిస్తున్నాయని పేర్కొన్నారు. ఈ విలువైన జ్ఞానం అనేది భవిష్యత్ తరాలకు అందేలా ‘గ్లోబల్ ట్రెడిషనల్ నాలెడ్జ్ రిపోజిటరీ’ ను జీ–20 ఆధ్వర్యంలో ఏర్పాటు చేయాలని సూచించారు. భారతదేశం చేపట్టిన ఇండియన్ నోలెడ్జ్ సిస్టమ్స్ (IKS) ఈ ప్లాట్‌ఫారమ్‌కు బలమైన పునాది అవుతుందని నరేంద్ర మోడీ వెల్లడించారు.
* జీ–20.. ఆఫ్రికా స్కిల్స్ మల్టిప్లయర్ ఇనిషియేటివ్
ఆఫ్రికా పురోగతి ప్రపంచ అభివృద్ధికి అత్యంత కీలకం అని ప్రధాని మోడీ వెల్లడించారు. ఈ దిశగా ‘G20–Africa Skills Multiplier’ కార్యక్రమాన్ని మోడీ ప్రతిపాదించారు. ఇది ట్రైన్-ది-ట్రైనర్స్ మోడల్‌పై ముందుకు వెళ్తుందని చెప్పారు. జీ–20 దేశాలు కలిసి దీనికి ఆర్థిక సహకారం అందిస్తాయని వెల్లడించారు. రాబోయే పదేళ్లలో ఆఫ్రికాలో ఒక మిలియన్ సర్టిఫైడ్ ట్రైనర్లను తయారు చేయడం ఈ కార్యక్రమం లక్ష్యంగా మోడీ అభివర్ణించారు. వీరి ద్వారా కోట్లాది యువతకు నైపుణ్యాలు అందించవచ్చని ఆయన చెప్పారు.
* డ్రగ్–టెర్రర్ నెక్సస్‌ను అడ్డుకునే జీ–20 కలెక్టివ్ ఇనిషియేటివ్
ప్రపంచ వ్యాప్తంగా ఫెంటనిల్ వంటి ప్రాణాంతక సింథటిక్ మాదక ద్రవ్యాలు వేగంగా వ్యాపిస్తున్నాయని, ఇవి ప్రజారోగ్యం, సామాజిక స్థిరత్వం, ప్రపంచ భద్రతను తీవ్రమైన ప్రమాదంలో పడేస్తున్నాయని భారత ప్రధాని నరేంద్ర మోడీ హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ‘G20 Initiative on Countering the Drug–Terror Nexus’ ను ఏర్పాటు చేయాలని ఆయన ప్రతిపాదించారు. దీనివల్ల డ్రగ్ మాఫియా–టెర్రరిస్ట్ నెట్‌వర్క్‌లను అణచివేయడానికి ఆర్థిక, పాలన, భద్రతా రంగాల్లో సమగ్ర చర్యలు తీసుకోవచ్చని వెల్లడించారు. అక్రమ నిధుల ప్రవాహాలను అడ్డుకోవడం, తీవ్రవాదానికి నిధులు అందే మార్గాలను మూసివేయడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని మోడీ తెలిపారు.
