NTV Telugu Site icon

MLC Elections 2025: నేటితో ముగియనున్న ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం!

Mlc Elections 2025

Mlc Elections 2025

తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం నేటితో ముగియనుంది. ఈసీ ఆదేశాల ప్రకారం.. పోలింగ్‌ ముగిసే సమయానికి సరిగ్గా 48 గంటల ముందు ప్రచారం ఆపేయాలి. ఫిబ్రవరి 27 సాయంత్రం 4 గంటలకు పోలింగ్‌ ముగియనుండడంతో.. ఈరోజు సాయంత్రం 4 గంటలతో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి తెర పడనుంది. ఎమ్మెల్సీ ఎన్నికలకు అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ నెల 27న ఉదయం 8 నుంచి పోలింగ్‌ ఆరంభం కానుంది. పోలింగ్‌కు మరో రోజే గడువు ఉండటంతో ప్రధాన పార్టీలు బలపరిచిన అభ్యర్థులు తమ వ్యూహాలకు పదును పెడుతున్నారు.

మెదక్‌-నిజామాబాద్‌-ఆదిలాబాద్‌-కరీంనగర్‌ పట్టభద్రుల స్థానంలో 56 మంది పోటీలో ఉన్నారు. మొత్తం ఓటర్లు 3,41,313 మంది ఉండగా.. అందులో పురుషులు 2,18,060 మంది, మహిళలు 1,23,250 మంది, ఇతరులు ముగ్గురు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. మెదక్‌-నిజామాబాద్‌-ఆదిలాబాద్‌-కరీంనగర్‌ పట్టభద్రుల నియోజకవర్గంలో టీచర్ల స్థానంలో 15 మంది పోటీ ఉండగా.. మొత్తం ఓటర్లు 25,921 మంది ఉన్నారు. అందులో పురుషులు 16,364 మంది, మహిళలు 9,557 మంది ఉన్నారు.

వరంగల్‌-ఖమ్మం-నల్గొండ ఉపాధ్యాయ నియోజకవర్గంలో 19 మంది పోటీలో ఉండగా.. మొత్తం ఓటర్లు 24,905 మంది ఉన్నారు. అందులో పురుషులు 14,940 మంది, మహిళలు 9,965 మంది ఉన్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈసారి బహుముఖ పోటీ నెలకొనడంతో.. గెలుపు ఎవరిని వరిస్తుందో అని ఆసక్తికరంగా మారింది. పోలింగ్‌ ముగిసే వరకు 144 సెక్షన్‌ కూడా అమలులోకి రానుంది. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో మద్యం దుకాణాలు మూతపడనున్నాయి.