Site icon NTV Telugu

MLC 2025: డికాక్ సూపర్ ఇన్నింగ్స్‌.. ఎంఎల్‌సీ విజేతగా ముంబై ఇండియన్స్‌!

Mumbai Indians New York

Mumbai Indians New York

మేజర్‌ లీగ్‌ క్రికెట్‌ (ఎంఎల్‌సీ) 2025 విజేతగా ముంబై ఇండియన్స్‌ న్యూయార్క్‌ నిలిచింది. డల్లాస్‌ వేదికగా జరిగిన 2025 ఎంఎల్‌సీ ఫైనల్‌లో వాషింగ్టన్ ఫ్రీడమ్‌పై 5 పరుగుల తేడాతో ఎంఐ విజయం సాధించింది. క్వింటన్ డికాక్ (77) హాఫ్‌ సెంచరీతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఎంఎల్‌సీలో ఎంఐ న్యూయార్క్‌కు ఇది రెండో టైటిల్‌. 2023లో మొదటి టైటిల్‌ కైవసం చేసుకుంది. మొత్తంగా టీ20 క్రికెట్‌లో ముంబై ఇండియన్స్‌ ఫ్రాంచైజీలకు ఇది 13వ టైటిల్‌ కావడం విశేషం.

ఈ మ్యాచులో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన న్యూయార్క్‌ 7 వికెట్లకు 180 స్కోరు చేసింది. మోనాంక్‌ పటేల్ (28)తో కలిసి క్వింటన్ డికాక్ మంచి ఆరంభం అందించాడు. తేజిందర్‌ ధిల్లాన్ (14) త్వరగా ఔటైనప్పటికీ.. నికోలస్ పూరన్‌తో (21)తో డికాక్‌ ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లాడు. ఈ క్రమంలోనే హాఫ్ సెంచరీ చేశాడు. ఈ సమయంలో వాషింగ్టన్ బౌలర్లు విజృంభించి డికాక్ (77), కిరణ్ పొలార్డ్ (0), బ్రాస్‌వెల్ (4), ట్రిస్టన్‌ లూస్ (2)లను అవుట్ చేశారు. ఇన్నింగ్స్ చివరలో కున్వార్‌జీత్‌ సింగ్ 13 బంతుల్లో 22 రన్స్ చేసి జట్టు స్కోరు 180కి చేర్చాడు. వాషింగ్టన్‌ బౌలర్లు లాకీ ఫెర్గూసన్ 3 వికెట్స్ పడగొట్టాడు.

లక్ష్య ఛేదనలో వాషింగ్టన్‌కు ఆదిలోనే షాక్ తగిలింది. ఓపెనర్ మిచెల్ ఓవెన్ (0), ఆండ్రీస్ గౌస్ (0) త్వరగానే పెవిలియన్‌కు చేరారు. ఈ సమయంలో రచిన్ రవీంద్ర (70), జాక్ ఎడ్వర్డ్స్‌ (33) జట్టును ఆదుకున్నారు. ఇద్దరు మూడో వికెట్‌కు 45 బంతుల్లోనే 84 పరుగులు జోడించి వాషింగ్టన్ను విజయం దిశగా తీసుకెళ్లారు. ఎడ్వర్డ్స్‌ ఔటైనప్పటికీ గ్లెన్ ఫిలిప్స్ (48)తో కలిసి రచిన్‌ మరో మంచి భాగస్వామ్యం నెలకొల్పాడు. అనంతరం గ్లెన్‌ మ్యాక్స్‌వెల్ (15) వేగంగా ఆడలేకపోయాడు. చివరి ఓవర్‌లో 12 పరుగులు అవసరమైన క్రమంలో మ్యాక్స్‌వెల్ విఫలమయ్యాడు. మరోవైపు ఫిలిప్స్‌కి ఒక్క బంతిని ఆడే అవకాశం రావడంతో వాషింగ్టన్‌కు ఓటమి తప్ప్పలేదు.

 

 

Exit mobile version