MLA Tellam Venkatrao Do Delivery to two pregnant womens: ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ఇద్దరు గర్భిణులకు అత్యవసరంగా సిజేరియన్ చేయాల్సి వచ్చింది. ఆ సమయంలో ఆసుపత్రిలో సర్జన్ లేకపోవడంతో వైద్యులు, సిబ్బంది కంగారుపడిపోయారు. విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే.. నేనున్నానంటూ రంగంలోకి దిగారు. ఇద్దరు గర్భిణులకు విజయవంతంగా సిజేరియన్ చేశారు. ప్రసూతి సేవలందించిన ఎమ్మెల్యేపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఆ ఎమ్మెల్యే మరెవరో కాదు.. తెల్లం వెంకట్రావు. ఎంఎస్ సర్జన్ అయిన తెల్లం గతంలో భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో సర్జన్‌గా సేవలందించారు.
గత 4-5 రోజులుగా కురుస్తున్న వర్షాలతో గోదావరి ఉప్పొంగుతోంది. దాంతో వరద ప్రభావిత ప్రాంతాల్లోని నిండు గర్భిణులను ముందస్తుగానే భద్రాచలం ఏరియా ఆసుపత్రికి అధికార యంత్రాంగం తరలించింది. భద్రాచలం ఆసుపత్రిలో ఐదుగురు సర్జన్లు ఉండాల్సి ఉండగా.. ఇటీవల నలుగురు బదిలీ అయ్యారు. ఉన్న ఆ ఒక్క సర్జన్ కోర్టు పని మీద బయటకు వెళ్లారు. మంగళవారం ఆసుపత్రిలోని గర్భిణుల్లో ఇద్దరికి పురిటి నొప్పులు వచ్చాయి. సిజేరియన్ తప్పనిసరి కావడం, సర్జన్ లేకపోవడంతో.. మిగతా వైద్యులు, సిబ్బంది కంగారుపడ్డారు.
Also Read: Road Accident: చందానగర్‌లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు యువకులు మృతి!
ఎంఎస్ సర్జన్ అయిన ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావుకు ఆసుపత్రి వర్గాలు సమాచారం ఇచ్చాయి. వరద సహాయక చర్యల్లో ఉన్న తెల్లం హుటాహుటిన ఆసుపత్రికి చేరుకున్నారు. ఆసుపత్రిలోని వైద్యులు, సిబ్బంది సాయంతో ఇద్దరు గర్భిణులకు విజయవంతంగా సిజేరియన్ చేశారు. ఇద్దరు పండండి బిడ్డలకు జన్మనిచ్చారు. దుమ్ముగూడెం మండలం డబ్ల్యూరేగుబల్లికి చెందిన భీమనబోయిన స్వప్న మగబిడ్డకు జన్మనివ్వగా.. చర్ల మండలం అంబేడ్కర్‌నగర్‌కు చెందిన పిల్లి పుష్ప ఆడబిడ్డకు జన్మనిచ్చింది. సమయానికి వచ్చి తల్లీబిడ్డలను రక్షించిన ఎమ్మెల్యే తెల్లంను అందరూ ప్రశంసించారు. ఏజెన్సీ ప్రాంత వాసుల కోసం తాను ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు చెప్పారు.