OU Police Investigation on MLA Sri Ganesh Attack: సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేశ్‌పై దాడికి యత్నం కేసులో ఓయూ పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఎమ్మెల్యే శ్రీ గణేష్ వాహనం, అతనిపై దాడికి యత్నించిన తర్వాత యువకులు అడిక్‌మెట్ వైపు బైకులపై వెళ్లిన్నట్లు గుర్తించారు. తార్నాక ఆర్టీసీ హాస్పిటల్ దగ్గర సీసీ ఫోటేజ్‌ని పోలీసులు పరిశీలించారు. ప్రస్తుతం పోలీసుల అదుపులో కొందరు యువకులు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనను పోలీస్ శాఖా చాలా సీరియస్‌గా తీసుకుంది. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.
సికింద్రాబాద్ నుంచి మాణికేశ్వర్ నగర్‌లో ఫలహారం బండి ఊరేగింపు కార్యక్రమానికి వెళ్తున్న ఎమ్మెల్యే శ్రీ గణేశ్‌పై ఆదివారం రాత్రి దుండగులు దాడికి యత్నించారు. తార్నాక నుంచి మాణికేశ్వర్ నగర్‌కు వెళ్తుండగా.. కొందరు యువకులు తార్నాక నుంచే ఎమ్మెల్యే కారును ఫాలో అయ్యారు. కారును రెండు వైపులా బైకులతో బ్లాక్ చేశారు. ఆర్టీసీ హాస్పిటల్ వద్ద యువకులు కారును అడ్డగించి ఆపారు. 10 బైకుల మీద ముగ్గురు ముగ్గురుగా వచ్చి.. అద్దాలపై దాడి చేసి, పగలగొట్టే యత్నం చేశారు. అద్దాలు దించాలంటూ గట్టిగా అరిచారు.
Also Read: Strange Tradition: మహాలక్ష్మి అమ్మవారికి నైవేద్యంగా మద్యం, మాంసం.. ఎక్కడో తెలుసా?
అప్రమత్తమైన ఎమ్మెల్యే శ్రీ గణేశ్ గన్‌మెన్‌లు వాహనాన్ని నేరుగా ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. ఈ ఘటనపై ఓయూ పోలీస్ స్టేషన్‌లో ఎమ్మెల్యే శ్రీ గణేశ్ ఫిర్యాదు చేశారు. కాసేపటికి మంత్రి వాకిటి శ్రీహరి ఓయూ పోలీస్టేషన్‌కు వెళ్లి.. ఎమ్మెల్యే ద్వారా పూర్తి వివరాలు తెలుసుకున్నారు. దాడికి పాల్పడిన వారిని త్వరగా పట్టుకోవాలని ఓయూ పోలీసులకు సూచించారు. ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోంది. ఎమ్మెల్యే శ్రీ గణేష్‌పై దాడి నగరంలో కలకలం రేపింది.
