ఆస్ట్రేలియా స్టార్ బౌలర్ మిచెల్ స్టార్క్ షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు. అంతర్జాతీయ టీ20 ఫార్మాట్‌కు గుడ్‌బై చెప్పేశాడు. టీ20 ప్రపంచకప్ 2026కు కొన్ని నెలల ముందు రిటైర్మెంట్ ప్రకటించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. వచ్చే జనవరిలో 36 ఏళ్ల పడిలోకి వెళ్లనున్న స్టార్క్.. టెస్ట్‌లు, వన్డేల్లో కొనసాగుతానని తెలిపాడు. దేశవాలీ టీ20 లీగ్ సహా ఐపీఎల్‌కు కూడా తాను అందుబాటులో ఉంటానని చెప్పాడు. భారత్ పర్యటన, యాషెస్ సిరీస్, 2027 వన్డే ప్రపంచకప్ కోసం తాను ఎదురుచూస్తున్నానని.. అందుకే టీ20 ఫార్మాట్‌కు వీడ్కోలు పలికానని స్టార్క్ స్పష్టం చేశాడు.
‘టెస్ట్ క్రికెట్ ఎల్లప్పుడూ నా మొదటి ప్రాధాన్యత. నేను ఆస్ట్రేలియా తరపున ఆడిన ప్రతి టీ20 మ్యాచ్, ప్రతి క్షణాన్ని ఆస్వాదించా. ముఖ్యంగా 2021 ప్రపంచకప్‌ను బాగా ఎంజాయ్ చేశా. ఆస్ట్రేలియా కప్ గెలిచినందుకు కాదు.. ఆ సమయంలో అద్భుతమైన టీమ్ ఉంది. భారత్ పర్యటన, యాషెస్ సిరీస్, 2027 వన్డే ప్రపంచకప్ కోసం ఎదురుచూస్తున్నా. ఈ టోర్నీలకు తాజాగా, ఫిట్‌గా, నా ఉత్తమ ప్రదర్శన ఇవ్వడానికి టీ20 ఫార్మాట్‌కు గుడ్‌బై చెప్పాను. టీ20 ప్రపంచకప్‌కు సిద్ధం కావడానికి మా బౌలర్లకు సమయం కూడా ఉంటుంది కాబట్టి రిటైర్మెంట్ ఇవ్వడానికి ఇదే మంచి సమయం అని భావించా. ఆసీస్ తరఫున పొట్టి ఫార్మాట్ ఆడటాన్ని బాగా ఎంజాయ్ చేశా’ అని మిచెల్ స్టార్క్ తెలిపాడు.
Also Read: Rohit Sharma: బ్రాంకో ఫిట్‌నెస్ టెస్ట్ పాస్.. ‘రోహిత్’ టార్గెట్ 2027?
మిచెల్ స్టార్క్ 2012లో అంతర్జాతీయ టీ20 అరంగేట్రం చేశాడు. 13 ఏళ్లలో 65 మ్యాచ్‌లు ఆడి 79 వికెట్లు తీశాడు. ఆసీస్ తరఫున అత్యధిక వికెట్స్ తీసిన పేసర్‌గా స్టార్క్ కొనసాగుతున్నాడు. ఓవరాల్‌గా స్పిన్నర్ ఆడమ్ జంపా (130) తర్వాత రెండో లీడింగ్ వికెట్ టేకర్‌గా ఉన్నాడు. 2024 టీ20 ప్రపంచకప్ నుంచి పొట్టి ఫార్మాట్‌కు స్టార్క్ దూరంగా ఉంటున్నాడు. ఆసీస్ 2021 టీ20 ప్రపంచకప్ విజేతగా నిలవడంతో స్టార్క్ ప్రభావం చూపాడు. ఇన్నింగ్స్ ఆరంభంలో, డెత్ ఓవర్లలో అతడి నైపుణ్యాలు పొట్టి ఫార్మాట్‌లో దేశానికి తొలి టైటిల్‌ను సాధించడంలో సహాయపడ్డాయి. ఈ ఏడాదిలో స్టీవ్ స్మిత్, మార్కస్ స్టోయినిస్, గ్లెన్ మ్యాక్స్‌వెల్ వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. సీనియర్ల నిష్క్రమణతో ఆసీస్ జట్టు డీలా పడిపోయింది.
