డీఆర్‌డీవో రూపొందించిన మిషన్ దివ్యాస్త్ర క్షిపణి ప్రయోగం విజయవంతం వెనుక హైదరాబాద్‌కు చెందిన ఓ మహిళా శాస్త్రవేత్త ఉండడం ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రస్తుతం ఆమె పేరు దేశ వ్యాప్తంగా మార్మోగుతోంది. మిషన్ దివ్యాస్త్ర ప్రాజెక్ట్‌కి మహిళా సైంటిస్ట్ షీనా రాణి నాయకత్వం వహించారు. 1999 నుంచి అగ్ని క్షిపణి వ్యవస్థలపై ఆమె పని చేస్తున్నారు. షీనా రాణి DRDOలో అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ లాబొరేటరీలో శాస్త్రవేత్తగా ఉన్నారు.
సోమవారం బహుళ వార్‌హెడ్‌లతో అగ్ని-5 క్షిపణిని భారతదేశం విజయవంతంగా పరీక్షించింది. ఈ సందర్భంగా ప్రధాని మోడీ శాస్త్రవేత్తలను అభినందించారు. అంతేకాకుండా ఈ ప్రయోగానికి ‘మిషన్ దివ్యాస్త్ర’ అనే పేరును ప్రధాని ప్రకటించారు.
ఈ ప్రయోగం సక్సెస్ కావడంతో ఇప్పుడు మహిళా శాస్త్రవేత్త షీనా రాణి పేరు మార్మోగుతోంది. ఈ ప్రాజెక్ట్‌కు ఆమెనే నాయకత్వం వహించారు. ఓ నారీమణి సారథ్యంలో ఈ క్షిపణి ప్రయోగం విజయవంతం కావడంతో ఆమెను అభినందనలతో ముంచెత్తున్నారు. ఇక ఆమె హైదరాబాద్ వాసి కావడం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. 1999 నుంచి ఆమె అగ్ని క్షిపణి వ్యవస్థలపై పని చేస్తున్నారు.
భారతదేశాన్ని రక్షించడంలో సహాయపడే డీఆర్‌డీవో బృందంలో తాను గర్వించదగిన పాత్రను పోషించినట్లుగా ఆమె పేర్కొన్నారు. అగ్ని శ్రేణి క్షిపణుల అభివృద్ధిలో కీలక పాత్ర పోషించిన క్షిపణి సాంకేతిక నిపుణుడు ‘అగ్ని పుత్రి’ టెస్సీ థామస్ యొక్క అడుగుజాడల్లో ఆమె వెళ్లారు.
షీనా రాణి తిరువనంతపురంలోని కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్‌లో చదువుకున్నారు. కంప్యూటర్ సైన్స్‌లో నైపుణ్యం కలిగిన శిక్షణ పొందారు. అలాగే ఎలక్ట్రానిక్స్ మరియు కమ్యూనికేషన్స్ ఇంజనీర్‌లో మంచి అనుభవం సంపాదించారు. భారతదేశపు అగ్రగామి పౌర రాకెట్ ల్యాబ్ అయిన విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ (VSSC)లో ఆమె ఎనిమిదేళ్లు పనిచేశారు. 1998లో పోఖ్రాన్ అణు పరీక్ష తర్వాత ఆమె పార్శ్వ ప్రవేశంగా DRDOలోకి వచ్చారు. 1999 నుంచి అగ్ని శ్రేణి క్షిపణుల ప్రయోగ నియంత్రణ వ్యవస్థలపై పని చేస్తూ వచ్చారు.
అలాగే DRDO మాజీ అధిపతి, డాక్టర్ APJ అబ్దుల్ కలాం నుంచి కూడా ఆమె ప్రేరణ పొందారు. తన కెరీర్‌ను రూపొందించడంలో సహాయపడిన మరొక వ్యక్తి, DRDOకి నాయకత్వం వహించిన క్షిపణి సాంకేతిక నిపుణుడు డాక్టర్ అవినాష్ చందర్ ఒకరని ఆమె చెప్పుకొచ్చారు.
ఇక షీనా రాణి భర్త కూడా శాస్త్రవేత్తనే. క్షిపణులపై DRDOతో కలిసి పనిచేశారు. 2019లో ISRO ప్రయోగించిన కౌటిల్య ఉపగ్రహానికి ఇన్‌ఛార్జ్‌గా కూడా ఉన్నారు.
ఇక తాజా ప్రయోగం సక్సెస్ కావడంతో చైనాకు భారత్ గట్టి హెచ్చరికనే జారీ చేసింది. అలాగే MIRV సాంకేతికతను కలిగి ఉన్న US, UK, రష్యా, ఫ్రాన్స్ , చైనా దేశాల సరసన ఇండియా చేరింది. MIRV సామర్థ్యం గల క్షిపణులను కలిగి ఉన్న ఆరు దేశాల్లో భారతదేశం ఒకటి కావడం మరింత గర్వించదగిన విషయం.
