అటల్ మోడీ సుపరిపాలన యాత్ర రాజమహేంద్రవరానికి చేరుకుంది. ఈ యాత్ర సభలో ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సత్యకుమార్ మాట్లాడుతూ.. అటల్ జి ఒక స్ఫూర్తి దాత అభివృద్ధి ప్రధాత అని, అసమాన్య నాయకుడు అని కొనియాడారు. 6 సంవత్సరాలు ప్రతి పక్షంలో ఉన్నారని తెలిపారు. సమాజంలో ఉన్న ప్రజల కష్టాలని కవితా రుపంలో అద్భుతంగా పార్లమెంట్ లో కనబరిచారన్నారు. ప్రజల సమస్యలను పరిష్కరించేలా తనదైన శైలిలో మాట్లాడేవారు. ఆరోజు వేసిన పునాదుల కారణంగా 21 రాష్ట్రాల్లో యన్డీఎ నేడు అధికారంలో ఉందని తెలిపారు.
కనెక్టవిటీ రెవెల్యూషన్ ని తీసుకొచ్చారు.. ఐటీ, టెలికం, జాతీయ రహదారులు కనెక్టివిటీతో పాటు, పొలిటికల్ కనెక్టివిటీ కూడా ఆయన ప్రారంభించారన్నారు. ఓటమిని అంగీకరించని వ్యక్తి వాజ్ పేయ్ అని వెల్లడించారు. కాలం రాసిన గీతను చెరిపేసి కొత్త చరిత్ర రాస్తానని చెప్పి రాశారన్నారు. దేశ ప్రజలకి, దేశ రైతంగానికి ఎంతో మేలు చేసిన గొప్ప వ్యక్తి అటల్ జి అని కితాబిచ్చారు. ఆల్ ఇండియా మెడికల్ సైన్స్ కళాశాలలని 7రాష్ట్రాలలో నిర్మించేలా చేశారు. దేశమంతా రహదారులు నిర్మిస్తే నేడు మరింత విస్తరించేలా వాటిని మోడీ నిర్మాణాలు చేపట్టారని మంత్రి సత్యకుమార్ తెలిపారు.
మెట్రో స్థాయి నుంచి వందే భారత్ వరకు అభివృద్ధి చెందింది.. కేంద్రం నుంచి సంపూర్ణ సహకారంతో నేడు ఆంధ్రప్రదేశ్ లో మెట్రో రైలు నిర్మాణం జరగబోతుందని తెలిపారు. టెలికామ్ సంస్కరణలు, డిజిటల్ రెవెల్యూషన్ తీసుకొచ్చారని తెలిపారు. వందేభారత్ నుంచి బుల్లెట్ ట్రైన్లను మోడీ నడుపుతున్నారని అన్నారు. విద్యా వ్యవస్థలో వాజ్ పేయ్ మార్పులు తెస్తే.. మోడీ.. అనేక యూనివర్సీలను తెచ్చారని ప్రశంసించారు. వాజ్ పేయ్ జాతీయ రహదారుల నిర్మాణానికి శ్రీకారం చుడితే.. నేడు మోడీ ఎక్స్ ప్రెస్ రోడ్లు నిర్మాణం చేస్తున్నారని తెలిపారు. నిర్మాణాత్మక చర్యల కారణంగా దేశం ఆర్దికాభివృద్దిలో నాలుగో స్థానికి తెచ్చారని వెల్లడించారు.
2047 నాటికి మొదటి స్థానానికి దేశం వచ్చే దిశగా మోడీ పాలన సాగుతుందన్నారు. 2014 లో చంద్రబాబు మోడీ సారధ్యంలో ఏపీ అభివృద్ది చెందిందన్నారు. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం రాక్షస పాలనతో రాష్ట్రం వెనక్కి వెళ్లిందని మండిపడ్డారు. మళ్లీ కూటమి పాలనలో మోడీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ నేతృత్వంలో రాష్ట్రం అభివృద్ధిలో పరుగులు పెడుతోందని తెలిపారు. విశాఖ, కోస్తా, రాయలసీమల్లో వేల కోట్ల రూపాయల అభివృద్ది పనులకు శ్రీకారం చుట్టారన్నారు. క్వాంటమ్ కంప్యూటర్, అమరావతి, పోలవరం, కృష్ణపట్నం, ఇలా ఎన్నో అభివృద్ది పనులు శరవేగంగా జరుగుతున్నాయని తెలిపారు.
విధ్వంసకర పాలన తర్వాత ఆర్ధికంగా చితికిపోయిన రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెడుతున్నారని అన్నారు. సామాజిక పెన్షన్లు, తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, దీపం కింద ఉచిత సిలిండర్లు, స్త్రీ శక్తి పధకాలను అమలు చేస్తున్నారని చెప్పారు. ఉచిత బస్సు ప్రయాణం కారణంగా నేడు మహిళలు తమ పనులు తామే చేసుకుంటున్నారని మంత్రి సత్యకుమార్ వెల్లడించారు.
