NTV Telugu Site icon

Parthasarathy: ఏపీ కేబినెట్ నిర్ణయాలు వెల్లడించిన మంత్రి.. మందుబాబులకు శుభవార్త

Partha Sarathi

Partha Sarathi

అన్ని రకాల బ్రాండ్లు కేవలం రూ. 99కే:
ఏపీ కేబినెట్ నిర్ణయాలను మంత్రి కొలుసు పార్ధసారథి వెల్లడించారు. నాణ్యమైన మద్యాన్ని అన్ని రకాల బ్రాండ్లను కేవలం రూ. 99కే అందించే నిబంధనకు కేబినెట్ ఆమోదం తెలిపిందని అన్నారు. గతంలో రూ. 120కి ఇచ్చిన మద్యాన్ని కొత్త పాలసీ ప్రకారం రూ. 99కే అందిస్తామని తెలిపారు. అలాగే.. గీత కార్మికులకు పది శాతం లిక్కర్ షాపుల కేటాయింపునకు నిర్ణయం తీసుకున్నామన్నారు. అప్లికేషన్ ఫీజు రూ. 2 లక్షలు, రెండేళ్ల కాలపరిమితితో ప్రైవేట్ మద్యం దుకాణాలకు అనుమతి ఇవ్వనున్నట్లు తెలిపారు. మరోవైపు.. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మద్యం దుకాణాలకు అనుమతి ఉంటుందని చెప్పారు. లైసెన్స్ ఫీజు రూ. 50 లక్షల నుంచి రూ. 80 లక్షల వరకు ఉండేలా కొత్త పాలసీ తీసుకొస్తామన్నారు. అలాగే.. ఐదేళ్ల కాలపరిమితితో ఏపీలో 12 ప్రీమియర్ షాపులకు అనుమతి ఇస్తామని.. ప్రీమియర్ షాపులకు నాన్ రిఫండ్ ఫీజు రూ. 15 లక్షలు.. ప్రీమియర్ షాపులకు రూ. 1 కోటి మేర లైసెన్స్ ఫీజు ఉంటుందని తెలిపారు. ఇదిలా ఉంటే.. తిరుపతిలో ప్రీమియర్ మద్యం దుకాణాలకు అనుమతి నిరాకరించారు.

వాలంటీర్లకు ఆర్ధిక సాయం నిలిపివేత:
గతేడాది ఆగస్టులో వాలంటీర్ల కాలపరిమితి ముగిసింది. అయితే.. గత ప్రభుత్వం న్యూస్ పేపర్ కొనుగోళ్ల కోసం వాలంటీర్లకు రూ. 200 ఆర్దిక సాయం అందించింది. కాగా.. ఈ ఆర్ధిక సాయాన్ని నిలిపేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుందని మంత్రి పార్ధసారథి తెలిపారు. వాలంటీర్లకు ఇచ్చిన రూ. 200తో ఒకే పత్రికను కొనుగోలు చేశారు.. ఏడాదికి రూ. 102 కోట్లు మేర నిధులను ఒకే పత్రికను కొనుగోలు నిమిత్తం ఖర్చు చేశారని అన్నారు.

అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుగా నామకరణం:
భోగాపురం ఎయిర్ పోర్టుకు అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుగా నామ కరణం చేయడానికి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని మంత్రి వెల్లడించారు.

ఆరోగ్యానికి అత్యంత ప్రాధాన్యత:
కూటమి వంద రోజుల పాలనలో భాగంగా ప్రజల ఆరోగ్యానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని మంత్రి పార్ధసారథి పేర్కొన్నారు. దీని కోసం ఎస్టీ ఎలివేషన్ వయో కార్డియల్ -స్టెమీ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి కేబినెట్ ఆమోదించిందని తెలిపారు. స్టెమీ ద్వారా ప్రాణాంతక జబ్బులకు పరీక్షలు నిర్వహించేందుకు వెసులుబాటు ఉంటుంది.. స్కూల్ పిల్లలకు కూడా అపార్ ఐడీ కార్డ్స్ అందిస్తాం.. విద్యార్థుల ఆరోగ్య వివరాలను ఈ కార్డ్సుల్లో ఉంటాయని మంత్రి తెలిపారు.

ఎంఎస్ఎంఈలకు క్రెడిట్ గ్యారెంటీ:
ఎంఎస్ఎంఈలకు క్రెడిట్ గ్యారెంటీ కల్పించే దిశగా కేబినెట్ ఆమోదం తెలిపింది. 20 లక్షల మందికి ఉపాధి కల్పించాలన్న ప్రభుత్వ హామీ నెరవేర్చేందుకు ఈ స్కీం ఉపకరిస్తుంది.. కేంద్ర పథకాల అనుసంధానంతో ఏపీలో పారిశ్రామికాభివృద్ధి.. ఉద్యోగాల కల్పన లక్ష్యంగా పని చేస్తామని మంత్రి పార్ధసారథి తెలిపారు. అలాగే.. మాజీ సైనికోద్యోగుల సంక్షేమం కోసం కార్పోరేషన్ ఏర్పాటు చేశాం..
ఇప్పటి వరకు మాజీ సైనికోద్యోగుల సంక్షేమం కోసం ఆరు రాష్ట్రాల్లో మాత్రమే కార్పోరేషన్ ఉంది.. రూ.10 కోట్ల కార్పస్ ఫండుతో మాజీ సైనికోద్యోగుల సంక్షేమం కోసం కార్పోరేషన్ ఏర్పాటు చేశామన్నారు.

ఎస్ఆర్ఎం డీమ్డ్ యూనివర్శిటీగా గుర్తింపు:
ఎస్ఆర్ఎం యూనివర్శిటీ గతంలో చంద్రబాబు హయాంలోనే ఏర్పాటు చేశారని మంత్రి చెప్పారు. వైసీపీ హయాంలో ఎస్ఆర్ఎం యూనివర్శిటీ అనేక ఇబ్బందులను ఎదుర్కొంది.. ఈ క్రమంలో.. ఎస్ఆర్ఎంను డీమ్డ్ యూనివర్శిటీగా గుర్తిస్తూ కేబినెట్ ఆమోదం తెలిపిందని పార్ధసారథి పేర్కొన్నారు. తెలంగాణలో 26 డీమ్డ్ యూనివర్శిటీలుంటే.. ఏపీలో కేవలం ఐదారు మాత్రమే ఉన్నాయన్నారు. దేశంలో ఉన్న టాప్ యూనివర్శిటీలను ఏపీకి రప్పించేందుకు ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. ఏపీలో బిట్స్ పిలానీ ఏర్పాటుకు మార్గం సుగమం అయిందని.. రూ. 1000 కోట్లతో బిట్స్ పిలానీ ఏర్పాటు చేస్తామన్నారు. ఏపీలో లా యూనివర్శిటీ, టాటా నేతృత్వంలోని ఎక్స్ఎల్ఆర్ఐ యూనివర్శిటీలను ఏపీకి రప్పించేలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి పార్ధసారథి తెలిపారు.

బీసీలకు 33 శాతం రిజర్వేషన్లు:
బీసీలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ కేంద్రాన్ని కోరుతూ కేబినెట్ తీర్మానం చేసిందని మంత్రి వెల్లడించారు. అలాగే.. కౌలు రైతుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. బీసీలు, ఎస్సీలు ఎక్కువగా కౌలు రైతులుగా ఉన్నారని.. వ్యవసాయం చేస్తోంది కూడా కౌలు రైతులేనని మంత్రి పేర్కొన్నారు. కౌలు కార్డుల ప్రోఫార్మా మార్చాలని కేబినెట్ నిర్ణయించిందని అన్నారు. కౌలు కార్డులపై రైతు సంతకం తప్పనిసరనే నిబంధన ఉంది. రైతు సంతకం అవసరం లేకుండానే కౌలు కార్డులు ఇవ్వాలని నిర్ణయం తీసుకుందని అన్నారు. పాత నిబంధనల వల్ల కౌలు రైతులకు కౌలు కార్డులు ఇవ్వలేని పరిస్థితి.. దీంతో కౌలు రైతులు నిర్లక్ష్యానికి గురవుతున్నారని మంత్రి తెలిపారు. రైతులకు ఆందోళన అవసరం లేదని.. భూ యజమానులతో సంప్రదింపులు జరపాలని కేబినెట్ సూచిందని పేర్కొన్నారు. కౌలు కార్డులను రెవెన్యూ అధికారులు ఇవ్వడం వల్ల భూ యజమానుల్లో ఆందోళన ఉందని.. ఆ ఆందోళనను దూరం చేస్తూ.. ఇక నుంచి మండల వ్యవసాయ విస్తరణాధికారుల ద్వారా జారీ చేయాలని నిర్ణయం తీసుకున్నామని మంత్రి పేర్కొన్నారు.