Site icon NTV Telugu

MallaReddy IT Raids: మల్లారెడ్డి ఎన్ని కోట్లు పోగేశాడో… విచారణలో తేల్చనున్న అధికారులు

Malla Reddy

Malla Reddy

MallaReddy IT Raids: మంత్రి మల్లారెడ్డికి సంబంధించిన సంస్థల్లో ఐటీ సోదాలు ముగిశాయి. రెండు రోజుల పాటు జరిగిన ఐటీ దాడుల్లో భారీ మొత్తంలో నగదు పట్టుబడింది. సుమారు 18.5కోట్ల రూపాయల నగదు సీజ్ చేసినట్లు సమాచారం. దీంతో పాటు 15కిలోల బంగారు ఆభరణాలను సైతం అధికారులు కనుగొన్నారు. ఇప్పుడు వాటి వాటి మూలాలను గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు. ఈ నేపథ్యంలో మంత్రి మల్లారెడ్డి సహా 16 మందికి నోటీసులు జారీ చేశారు. ఆయన కుటుంబసభ్యులు, బంధువులు, వ్యాపార భాగస్వాములు, కళాశాలల ప్రతినిధులు ఈ జాబితాలో ఉన్నారు. వచ్చే సోమవారం నుంచి వీరు విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. తెలంగాణ మంత్రి మల్లారెడ్డి, ఆయన కుటుంబసభ్యులపై జరిగిన ఐటీ దాడులు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపాయి. ఈ దాడుల్లో పలు కీలక పత్రాలతో పాటు కంప్యూటర్ హార్డ్ డిస్క్‌లను ఐటీ డిపార్ట్‌మెంట్ స్వాధీనం చేసుకుంది. మల్లారెడ్డి మరదలి కుమారుడు ప్రవీణ్‌ రెడ్డి ఇంట్లో రూ.15 కోట్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోండగా.. మల్లారెడ్డి బంధువు త్రిశూల్ రెడ్డి ఇంట్లో రూ.2 కోట్లు, రఘునందన్ రెడ్డి ఇంట్లో రూ.2 కోట్లు, ప్రవీణ్ కుమార్ ఇంట్లో రూ.2.5 కోట్లు, సుధీర్ రెడ్డి ఇంట్లో రూ.కోటి సీజ్ చేశారు.

Read Also:Ashok Hotel: త్వరపడండి.. అమ్మకానికి చారిత్రాత్మక అశోకా హోటల్

Read Also: Basara IIIT: బాసర ట్రిపుల్‌ ఐటీలో విద్యార్థినులకు వేధింపులు?

మంత్రి మల్లారెడ్డి ఇంట్లో రూ.6 లక్షలు, మల్లారెడ్డి అల్లుడు రాజశేఖర్ రెడ్డి ఇంట్లో రూ.3 కోట్లు, మల్లారెడ్డి పెద్ద కుమారుడు మహేందర్ రెడ్డి ఇంట్లో రూ.12 లక్షలు, మల్లారెడ్డి చిన్న కుమారుడు భద్రారెడ్డి ఇంట్లో రూ.6 లక్షలు ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. అలాగే మరికొన్ని లాకర్స్‌ను ఐటీ అధికారులు తెరవాల్సి ఉంది. పట్టుబడిన నగదు అంతా కాలేజీల అడ్మిషన్లు పూర్తి కావడంతో వచ్చిన సొమ్ముగా చెబుతున్నారు. కాలేజీల్లో విద్యార్థుల నుంచి మూడేళ్లుగా రూ.135 కోట్లు డొనేషన్ల రూపంలో వసూలు చేసినట్లు ఐటీ అధికారులు గుర్తించినట్లు చెబుతున్నారు. ఇంకోవైపు ఈ దాడులపై మల్లారెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది రాజకీయ కక్షపూరితమైన చర్య అని అన్నారు. ఇలాంటి దాడులను తానెప్పుడూ చూడలేదని అన్నారు. ఐటీ దాడులతో తన కుటుంబ సభ్యులు తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. ఐటీ విచారణకు సహకరిస్తానని తెలిపారు.

Exit mobile version