తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడి వేడిగా సాగుతున్నాయి. అసెంబ్లీ సమావేశాల నుంచి ఇప్పటికే బీజేపీ ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్, రఘునందన్ రావు లను స్పీకర్ సస్పెండ్ చేశారు. ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాల్లో అధికార టీఆర్‌ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్ ల మధ్య చర్చ జరుగుతోంది. ఈ క్రమంలోనే తాజాగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. ముషీరాబాద్ ఏరియాలోని అజమాబాద్‌లో 136 ఎకరాల్లో పలు పరిశ్రమలు ఉన్నాయి. ప్రస్తుతం 58 కంపెనీలు అక్కడ ఉన్నాయి. వాటికి 30 ఏళ్ళు లీజ్ ఇస్తూ నాటి కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 58 కంపెనీల్లో 36 మంది వ్యాపారాలు చేస్తుండగా 22 మంది సబ్ లీజ్ ఇచ్చారు. రాంనగర్ ఏరియాలో ఆధునిక ఫిష్ మార్కెట్ కట్టాలని నిర్ణయించాము. బస్ భవన్ కు కొంత స్థలం ఉంది. ప్రజాపయోగమైన పనులు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది.
పరిశ్రమ కోసం ఇచ్చిన స్థలంలో ఎక్కడా ఇతర అవసరాలకు వాడటం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అనేక అక్రమాలు జరిగాయి. స్టూడియోల పేరుతో ఇతర నిర్మాణాలు చేపట్టారు. తెలంగాణలో పరిశ్రమల కోసం ఇచ్చిన స్థలాల్లో ఎక్కడా అక్రమాలు జరగలేదు. భూ కేటాయింపులు ఒకటికి రెండు సార్లు చూసి చేసాం. 1234 ఎకరాలు ఇప్పటి వరకు ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. అజమాబాద్ లో 9 యూనిట్లు ప్రభుత్వ రంగ సంస్థలు ఉన్నాయి. 2003లో జీవో నెంబర్ 20 ద్వారా కాలుష్య కారక పరిశ్రమలను ఔటర్ బయటకు తరలించాలని ఆదేశాలు జారీ చేశారు. వాణిజ్యపరమైన అవసరాలకు కూడా అజమాబాద్ భూములను వాడుకుంటాం అని ఆయన వివరించారు.