NTV Telugu Site icon

KTR on Batukamma Sarees: మహిళల అభిరుచులకు అనుగుణంగా కోటి చీరలు సిద్ధం

Ktr

Ktr

KTR on Batukamma Sarees: పేదింటి ఆడబిడ్డల మోముల్లో చిరునవ్వులు చూసేందుకు, సిరిసిల్ల నేత కార్మికులకు పని కల్పించేందుకు, ఆత్మహత్యలు దూరం చేసేందుకు బతుకమ్మ పండుగ సారెగా బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టిందని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్‌లో మహిళలకు బతుకమ్మ చీరలు పంపిణీ చేసే రాష్ట్రస్థాయి ప్రారంభ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రతి సంవత్సరం రూ.300 కోట్లు బతుకమ్మ చీరల కోసం వెచ్చిస్తున్నామని మంత్రి పేర్కొన్నారు.

చేనేత కార్మికులకు 40 శాతం, మర కార్మికులకు 10 శాతం నూలు రాయితీ ఇస్తున్నామన్నారు. సిరిసిల్ల పట్టు చీరలకు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్‌ ఉందన్నారు. త్వరలో సిరిసిల్లలో అపెరల్‌ పార్క్‌ను ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, టెక్స్‌టైల్‌ మంత్రి కేటీఆర్‌ ప్రకటించారు. 8 నుంచి10 వేల మంది మహిళలకు త్వరలోనే ఉపాధి కల్పిస్తామన్నారు. పెద్దూర్‌లో 80 ఎకరాల్లో వీవింగ్ పార్క్‌ను ఏర్పాటు చేయనున్నామన్నారు.

పక్క రాష్ట్రం తమిళనాడు తిరుప్పూర్‌లో ప్రతి సంవత్సరం ప్రపంచ విపణిలోకి 40 వేల కోట్ల వస్త్ర ఎగుమతులు చేస్తున్నారన్న మంత్రి.. సిరిసిల్లలో 2 వేల కోట్లు మాత్రమే చేస్తున్నారన్నారు. తిరుప్పూర్‌కు వెళ్లి అక్కడి వస్త్ర పరిశ్రమను పరిశీలించి రావాలని పవర్‌లూమ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్ చైర్మన్ గూడూరి ప్రవీణ్, సెక్రెటరీ బుద్ధ ప్రకాశ్‌కు సూచించారు. చేతనైన స్థాయిలో మంచి బతుకమ్మ చీరెలను ఉత్పత్తి చేస్తున్నామన్న కేటీఆర్‌.. నేతన్నల అభివృద్ధికి అన్ని రకాల కార్యక్రమాలు చేపడుతామన్నారు.న్యూజిలాండ్‌లో రాజన్న సిరిపట్టు పేరుతో సిరిసిల్ల చీరలకు బ్రాండింగ్ చేస్తున్నామన్నారు. కొత్త తరహా ఆలోచనలతో తిరుప్పూర్‌కు దీటుగా సిరిసిల్లను తీర్చిదిద్దేలా ఆలోచనలు చేస్తున్నామన్నారు.

Munugode By Poll: మునుగోడు ఉపఎన్నికకు 16 మందితో బీజేపీ స్టీరింగ్ కమిటీ

మహిళల అభిరుచులకు అనుగుణంగా కోటి చీరలు సిద్ధం చేశామని మంత్రి కేటీఆర్ తెలిపారు. తెలంగాణ మొత్తానికి బతుకమ్మ పండుగ కానుక అందించే చీరలు సిరిసిల్ల నుంచే ఉత్పత్తి కావడం మనందరికీ గర్వ కారణమన్నారు. ఇంకా ఎవరైనా పింఛన్లు రాని వారు ఉంటే వారికి అందిస్తామన్నారు. త్వరలోనే సొంత స్థలంలో ఇండ్లను నిర్మించుకునే పేదలకు ప్రభుత్వం తరఫున రూ.3 లక్షలు అందించే కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు.