ఏలూరు జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకాతిరుమల చిన వెంకన్న కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా జరిగింది. శ్రీదేవి భూదేవి సమెతుడైన ఆ శ్రీనివాసునీ కళ్యాణాన్ని తిలకించిన భక్తులు ఆనంద పారవశ్యంలో మునిగితేలారు. స్వామివారి వివాహ మహోత్సవానికి ఆలయ తూర్పు రాజగోపురం ముందర అనివేటి మండపంలో ప్రత్యేక కల్యాణ మండపాన్ని ఏర్పాటు చేశారు. ముందుగా స్వామి, అమ్మవార్లను వేర్వేరు వాహనాల్లో కళ్యాణ మండపానికి తీసుకువెళ్లారు. అక్కడ అర్చకులు స్వామి, అమ్మవార్ల కళ్యాణమూర్తులను ప్రత్యేక పూలతో అలంకరించారు.
స్వామి అమ్మవార్లకు ప్రభుత్వం తరఫున రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ పట్టు వస్త్రాలు సమర్పించారు. శుభ ముహూర్త సమయాన మంగళ వాయిద్యాలు మేళ తాళాలు నడుమ వేదమంత్రాల సాక్షిగా అర్చకులు జీలకర్ర బెల్లం పూర్తి చేశారు. అనంతరం స్వామివారి కల్యాణ మహోత్సవo అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ ఎస్ వి సుధాకర్ రావు, ఈవో వేండ్ర త్రినాధరావు, పాలకమండల సభ్యులతో పాటు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
Read Also:Ustaad Bagath Singh: ఫ్యాన్స్ .. ఉస్తాద్ వస్తున్నాడు.. పండగ షురూ చేయండి
కళ్యాణం అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలను, తలంబ్రాలను భక్తులకు ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి కొట్టు సత్యనారాయణ మాట్లాడుతూ.. స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని, రాష్ట్రం అన్ని విధాల అభివృద్ధి చెందాలంటే స్వామివారి ఆశీస్సులు కావాలని, అన్ని ప్రధాన ఆలయాల్లో భక్తులకు ఏటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని, ధార్మిక కార్యక్రమాల ఏర్పాటుకు ప్రతి ఆలయంలో కొంత నిధిని ఏర్పాటు చేశామని, ఈనెల 12 నుంచి 15 వరకు విజయవాడలో అష్టోత్తర శత కుండాత్మక చండీ రుద్ర రాజశ్యామల సుదర్శన సహిత శ్రీ లక్ష్మీ మహా యజ్ఞాన్ని నిర్వహిస్తున్నామని, లక్షలాదిమంది భక్తులు యజ్ఞంలో పాల్గొనే విధంగా ఏర్పాటు చేస్తున్నామని, యజ్ఞ ఫలాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి అందించనున్నామని, రాష్ట్ర ప్రజల సుఖ సంతోషాల కోసం ఈ యజ్ఞాన్ని నిర్వహిస్తున్నామన్నారు దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ.
Read Also: RR vs GT: కదం తొక్కిన జీటీ బౌలర్లు.. తక్కువ స్కోరుకే చాపచుట్టేసిన ఆర్ఆర్