Site icon NTV Telugu

Minister Damodar Rajanarasimha: జర్నలిస్టులు, ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వం కీలక నిర్ణయం

Damodar Rajanarasimha

Damodar Rajanarasimha

ఉద్యోగులు, జర్నలిస్టులకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించేలా ఈజేహెచ్‌ఎస్ (ఎంప్లాయీస్, జర్నలిస్ట్‌ హెల్త్ స్కీమ్) వెల్‌నెస్ సెంటర్లలో సేవలను విస్తరించాలని ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులను మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆదేశించారు. వెల్‌నెస్ సెంటర్లలో కార్డియాలజీ, నెఫ్రాలజీ తదితర స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను అందుబాటులోకి తీసుకొచ్చే అంశంపై మంత్రి శుక్రవారం అధికారులతో హైదరాబాద్‌లోని ఆరోగ్యశ్రీ ట్రస్ట్ కార్యాలయంలో సమీక్ష చేశారు.

ఈజేహెచ్‌ఎస్ పరిధిలోని జర్నలిస్టులు, ప్రభుత్వ ఉద్యోగులకు వైద్య సేవలు అందించేందుకు రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం 12 వెల్‌నెస్ సెంటర్లను ఆరోగ్యశ్రీ ట్రస్ట్ నిర్వహిస్తోంది. సేవల విస్తరణ ప్రణాళికలో భాగంగా.. ఖైరతాబాద్, కూకట్‌పల్లి వెల్‌నెస్ సెంటర్ల నిర్వహణ బాధ్యతలను నిమ్స్‌కు, మిగిలిన 10 వెల్‌నెస్ సెంటర్ల నిర్వహణ బాధ్యతలను మెడికల్ ఎడ్యుకేషన్‌ డిపార్ట్‌మెంట్‌కు అప్పగిస్తూ ప్రభుత్వం ఇటీవలే నిర్ణయం తీసుకుంది.

ప్రస్తుతం మెడిసిన్, డెంటల్, ఫిజియోథెరపీ వంటి సేవలను వెల్‌నెస్ సెంటర్లు అందిస్తున్నాయి. కొన్నిచోట్ల గైనకాలజీ, జనరల్ మెడిసిన్, ఆర్థోపెడిక్ సేవలు అందుతున్నాయి. ఇకపై జనరల్ సర్జరీ, కార్డియాలజీ, నెఫ్రాలజీ, పీడియాట్రిక్స్‌, న్యూరాలజీ, డెర్మటాలజీ వంటి స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను కూడా వెల్‌నెస్ సెంటర్లలో దశలవారీగా అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను మంత్రి ఆదేశించారు…

ఆయా స్పెషాలిటీలకు సంబంధించిన డాక్టర్లను, సిబ్బందిని వెల్‌నెస్ సెంటర్లలో నియమించడంతో పాటు, పేషెంట్లకు టెస్టులు చేసేందుకు అవసరమైన పరికరాలను కూడా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. సెంటర్లలో పేషెంట్లకు అవసరమైన వెయిటింగ్ ఏరియా, ఇతర సౌకర్యాలను మెరుగుపర్చాలని సూచించారు. వెల్‌నెస్ సెంటర్లలో మెడిసిన్స్ అందుబాటులో లేవంటూ ఉద్యోగులు, జర్నలిస్టుల నుంచి ఫిర్యాదులు వచ్చే పరిస్థితి ఉండకూడదన్నారు. అవసరమైన అన్నిరకాల మెడిసిన్స్‌ను అన్ని వెల్‌నెస్ సెంటర్లలో సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. మెడిసిన్ ఇండెంట్ నుంచి కొనుగోలు వరకూ పూర్తి ప్రక్రియ డిజిటల్‌గానే జరగాలని మంత్రి ఆదేశించారు. కొనుగోలు, సప్లైలో జాప్యం ఉండకూడదన్నారు. ఆన్‌లైన్‌లో ఓపీ బుక్ చేసుకునేందుకు వీలుగా యాప్‌ను సిద్ధం చేయాలని అధికారులకు మంత్రి సూచించారు.

Exit mobile version