NTV Telugu Site icon

Kodangal Medical College: కొడంగల్‌లో మెడికల్ కాలేజీ.. వచ్చే ఏడాది నుంచి అడ్మిషన్లు ప్రారంభం!

Kodangal Medical College

Kodangal Medical College

సీఎం రేవంత్ రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న కొడంగల్‌లో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తున్నామని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజ నర్సింహ తెలిపారు. వచ్చే అకాడమిక్ ఇయర్ నుంచి కొడంగల్ కాలేజీలో అడ్మిషన్లు ప్రారంభిస్తామని వెల్లడించారు. మెడికల్ కాలేజీకి అనుబంధంగా నర్సింగ్, పారామెడికల్ కాలేజీలు కూడా ప్రారంభిస్తున్నామన్నారు. ఆరోగ్య రంగానికి సంబంధించి శాసన మండలిలో సభ్యులు అడిగిన పలు ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. ఈ ఏడాది 8 కొత్త మెడికల్ కాలేజీలను ప్రారంభించామని మంత్రి గుర్తు చేశారు.

ఒక్కో కాలేజీలో 50 సీట్లు అందుబాటులోకి ఉంటాయని మంత్రి దామోదర రాజ నర్సింహ తెలిపారు. అన్ని కాలేజీల్లో ఎన్‌ఎంసీ నిబంధనలకు అనుగుణంగా ఫాకల్టీని నియమించామన్నారు. అన్ని హాస్పిటల్స్‌లో కలిపి 2,500లకు పైగా డయాగ్నస్టిక్స్ యంత్రాలు ఉన్నాయని తెలిపారు. ఈ యంత్రాల మెయింటనన్స్, రిపేర్లకు స్పెషల్ సెల్స్ ఏర్పాటు చేశామన్నారు. అవసరాన్ని బట్టి అవసరమైన చోట ఎంఆర్‌ఐ స్కానింగ్ సర్వీసులు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. యంత్రాలు నడిపేందుకు అవసరమైన హెచ్‌ఆర్‌ను కూడా రిక్రూట్ చేస్తామన్నారు. కేన్సర్ స్క్రీనింగ్ కోసం మొబైల్ స్క్రీనింగ్ సర్వీసులు అందుబాటులోకి తీసుకొస్తామని మంత్రి వెల్లడించారు. అలాగే రీజనల్ కేన్సర్ సెంటర్లను ఏర్పాటు చేయబోతున్నామని తెలిపారు.

ప్రభుత్వ హాస్పిటళ్లకు ప్రజలే యజమానులు అని మంత్రి దామోదర రాజ నర్సింహ వ్యాఖ్యానించారు‌. హైదరాబాద్‌తో పాటు జిల్లాల్లోనూ సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందించడానికి ప్రయత్నిస్తున్నామన్నారు. ఆ ప్రయత్నంలో భాగంగానే హైదరాబాద్‌‌లో సుదీర్ఘ కాలంగా పని చేస్తున్న కొంతమంది సీనియర్ డాక్టర్లను జిల్లాలకు ట్రాన్స్‌ఫర్ చేశామన్నారు. రాబోయే రోజుల్లో 90 శాతం ట్రీట్‌మెంట్ జిల్లాల్లోనే అందేలా చర్యలు తీసుకుంటామన్నామని మంత్రి చెప్పుకొచ్చారు.

Show comments