Site icon NTV Telugu

MiG-21 Retirement: శత్రు గుండెల్లో పరుగులు పెట్టిన యుద్ధ విమానం.. 62 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణానికి ముగింపు..

Mig 21 Retirement

Mig 21 Retirement

MiG-21 Retirement: భారతదేశ వైమానిక దళం చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయం ముగియబోతోంది. రష్యాలో నిర్మించిన మిగ్-21 భారతదేశపు మొట్టమొదటి సూపర్‌సోనిక్ యుద్ధ విమానంగా చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. భారతదేశం – పాకిస్థాన్ మధ్య జరిగిన అనేక యుద్ధాలలో ఇండియా విజయానికి చిరునామాను లిఖించిన అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకున్న ఈ సూపర్‌సోనిక్ యుద్ధ విమానం వీడ్కోలుకు సిద్ధం అవుతోంది. సెప్టెంబర్ 26న చండీగఢ్ ఎయిర్‌బేస్‌లో జరిగే వేడుకతో ఈ విమానం తన 62 ఏళ్ల ప్రయాణానికి ముగింపు పలకనుంది.

READ ALSO: AP Politics : ఏపీ మెడికల్ కాలేజీల విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం..

సోవియట్ యూనియన్‌లో ఆవిష్కరణ..
మిగ్-21 యుద్ధ విమానం భారత గగనతలాన్ని రక్షించడమే కాకుండా ప్రతిసారీ శత్రువులను ఓడించిన పేరును సొంతం చేసుకుంది. మిగ్-21 సోవియట్ యూనియన్‌లో ఉద్భవించింది. 1955లో మికోయన్-గురేవిచ్ డిజైన్ బ్యూరో రూపొందించిన ఈ యుద్ధ విమానం.. సింగిల్-ఇంజన్, సింగిల్-సీట్, మల్టీ-రోల్ ఫైటర్‌గా రూపుదిద్దుకుంది. ఇది మాక్ 2 వేగంతో, ధ్వని వేగం కంటే రెండింతలు వేగంగా ప్రయాణించగలుగుతుంది. 1960లలో భారతదేశం, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు క్రమంగా పెరుగుతున్నాయి. 1962 చైనా యుద్ధం తర్వాత, భారత వైమానిక దళం కొత్త యుద్ధ విమానాలతో తన పోరాట నౌకాదళాన్ని బలోపేతం చేయాలని చూస్తోంది. ఈ సమయంలో యునైటెడ్ స్టేట్స్ పాకిస్థాన్‌కు F-104 స్టార్‌ఫైటర్‌లను బహుమతిగా అందించింది. అయితే భారతదేశం.. అమెరికా నుంచి స్టార్‌ఫైటర్‌లను కొనుగోలు చేయడానికి ప్రయత్నించినప్పుడు ఆ దేశం వెనుకాడటం ప్రారంభించింది. దీంతో ఇండియా అప్పటి సోవియట్ యూనియన్.. నేటి రష్యా వైపు మొగ్గు చూపింది.

1963 ప్రారంభంలో MiG-21 భారత వైమానిక దళంలోకి ప్రవేశించింది. ఏప్రిల్‌లో మొదటి ఆరు MiG-21లు చండీగఢ్‌కు వచ్చాయి. IAF 28వ స్క్వాడ్రన్‌కు “మొదటి సూపర్‌సోనిక్‌లు” అవార్డు లభించింది. ప్రారంభంలో వాటిని శత్రుదేశాలను అడ్డగించడానికి ఇంటర్‌సెప్టర్‌లుగా ఉపయోగించారు. అనంతర కాలంలో అవి భూ దాడితో సహా అనేక పాత్రలలో పనిచేయడం ప్రారంభించాయి. తర్వాత భారతదేశంలో ఈ యుద్ధ విమానాలను హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL) ఉత్పత్తి చేయడం ప్రారంభించింది. మొత్తం 850కి పైగా MiG-21లు భారతదేశానికి వచ్చాయి. వీటిలో HAL సుమారు 600 తయారు చేసింది. ఇది భారతదేశపు మొట్టమొదటి పాశ్చాత్యేతర యుద్ధ విమానం. వాస్తవానికి ఈ యుద్ధ విమానం సోవియట్ యూనియన్‌తో భారత్ రక్షణ సంబంధాలను బలోపేతం చేసింది.

భారత్ – పాక్ యుద్ధంలో MiG ఫైట్
MiG -21 కు నిజమైన పరీక్ష 1965 ఇండో-పాకిస్థాన్ యుద్ధ సమయంలో ఎదురైంది. ఈ యుద్ధంలో ఈ ఫైటర్ జెట్‌లు తక్కువ సంఖ్యలో ఉండటం, ఫైలట్‌లకు సరైన శిక్షణ లేకపోవడంతో దీని పాత్ర పరిమితం అయింది. అయినప్పటికీ ఇవి పాకిస్థాన్ విమానాలను గణనీయంగా ఇబ్బంది పెట్టాయి. తరువాత 1971 బంగ్లాదేశ్ విముక్తి యుద్ధం, తరువాత మళ్లీ జరిగిన ఇండో-పాకిస్థాన్ యుద్ధంలో MiG-21 అద్భుతంగా పోరాడింది. 1971 యుద్ధంలో ఈ సూపర్సోనిక్ ఫైటర్ జెట్ పాకిస్థాన్‌ను తీవ్రంగా దెబ్బతీశాయి. ఈ యుద్ధంలో భారత వైమానిక దళం MiG-21తో శత్రుదేశానికి చెందిన అనేక ట్యాంకులను నాశనం చేశాయి. అలాగే 11 పాకిస్థానీ యుద్ధ విమానాలను కూల్చివేశారు.

కార్గిల్‌ పోరులో అప్‌గ్రేడ్‌లు..
1980లలో మిగ్-21ను అప్‌గ్రేడ్ చేశారు. మిగ్-21 బిస్, మిగ్-21 బైసన్ వంటి వైవిధ్యాలను ఈ యుద్ధ విమానాల్లో ప్రవేశపెట్టారు. వీటిలో మెరుగైన రాడార్, ఏవియానిక్స్, ఆయుధ వ్యవస్థలు అందుబాటులోకి తీసుకొచ్చారు. 1984లో సియాచిన్‌లో జరిగిన ఆపరేషన్ మేఘదూత్‌లో ఈ యుద్ధ విమానాలు కీలక పాత్ర పోషించాయి. 1999 కార్గిల్ యుద్ధంలో మిగ్-21 నూతన అధ్యాయాన్ని లిఖించింది. ఈ సూపర్‌సోనిక్ ఫైటర్ ఆపరేషన్ సఫేద్ సాగర్‌లో మిరాజ్ 2000, మిగ్-29 వంటి ఆధునిక జెట్‌లతో పాటు గగనతలంలో విహరించింది. ఎత్తైన పర్వతాలలో దాని ప్రాణాంతక బాంబు దాడులు పాకిస్థాన్ చొరబాటుదారులను వెనక్కి తగ్గేలా చేశాయి. స్క్వాడ్రన్ లీడర్ అజయ్ అహుజా జెట్ ఈ యుద్ధంలో కూలిపోయినప్పటికీ, మిగ్-21 ప్రత్యర్థిపై పైచేయి సాధించింది.

MiG-21 తో ముడిపడి ఉన్న చీకటి అధ్యాయం..
MiG-21 సుదీర్ఘ ప్రయాణంలో పలు చీకటి అధ్యాయాలు దాగి ఉన్నాయి. 1963 లో మొదటి సంవత్సరం రెండు MiG-21 విమానాలు కూలిపోయాయి. పలు నివేదికల ప్రకారం.. 60 ఏళ్లలో 500 కి పైగా MiG-21 విమానాలు కూలిపోయాయి. ఈ ప్రమాదాల్లో సుమారుగా 170 మందికి పైగా పైలట్లు మరణించారు. 1970 నుంచి MiG-21 ప్రమాదాలలో 170 మంది పైలట్లు, 40 మంది పౌరులు మరణించారు. 1971 నుంచి 2022 మధ్యలోనే ఏకంగా 400 కి పైగా ప్రమాదాలు జరిగాయి. మిగ్-21 ప్రమాదాల సంఖ్య నిరంతరం పెరుగుతుండటం దృష్ట్యా, భారత వైమానిక దళం MiG-21 విమానాలను వైమానిక దళం నుంచి విరమించుకోవాలని నిర్ణయం తీసుకుంది. ఈ యుద్ధ విమానాల స్థానంలోతేజస్ Mk-1A రానున్నాయి. HAL ఇప్పటికే తేజస్ యుద్ధ విమానాల ఉత్పత్తిని పెంచుతోంది.

READ ALSO: Hyderabad : హైదరాబాద్‌పై వర్షాల విరుచుకుపాటు.. మునిగిన నగరం

Exit mobile version