Middle East War Impact: పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులు ఇప్పుడు వ్యాపార రంగానికీ తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా ఇరాన్ – ఇజ్రాయెల్, అమెరికా మధ్య పెరుగుతున్న యుద్ధ వాతావరణం వల్ల ఒకప్పుడు విలాసవంతమైన జీవనశైలికి ప్రతీకగా నిలిచిన లగ్జరీ కార్ల మార్కెట్ కుదేలవుతోంది. కోట్ల రూపాయల విలువైన రోల్స్ రాయిస్, ఫెరారీ వంటి కార్లు షోరూమ్‌లలోనే నిలిచిపోతూ దుమ్ము పట్టే పరిస్థితి ఏర్పడింది. మధ్యప్రాచ్యం ఎప్పటికీ లగ్జరీ కార్ల తయారీదారులకు అత్యంత లాభదాయకమైన మార్కెట్‌గా ఉండేది. ఇక్కడి సంపన్నులు ప్రత్యేక ఎడిషన్, కస్టమ్ డిజైన్ కార్ల కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేయడం సాధారణమే. కంపెనీలు కూడా ఈ ప్రాంతాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక మోడళ్లను రూపొందించి అధిక ధరలకు విక్రయించేవి. కానీ, ప్రస్తుతం యుద్ధ ప్రభావంతో వినియోగదారుల నమ్మకం దెబ్బతింది. షోరూమ్‌లు వెలవెలబోతుండగా, కొనుగోళ్లు గణనీయంగా తగ్గిపోయాయి.
ఇటీవల ఒక ప్రత్యేక కస్టమర్ కోసం రూపొందించిన రోల్స్ రాయిస్ “ఫాంటమ్ అరబెస్క్” మోడల్ ఈ పరిస్థితికి ఉదాహరణగా నిలుస్తోంది. అరబ్ వాస్తుశిల్పం ఆధారంగా రూపొందించిన ఈ కారులో లేజర్ చెక్కిన డిజైన్, విలాసవంతమైన ఇంటీరియర్ వంటి ప్రత్యేకతలు ఉన్నాయి. సాధారణంగా రోల్స్ రాయిస్ ఫాంటమ్ ధర సుమారు 5 కోట్లకు పైగా ఉండగా, ప్రత్యేక కస్టమైజేషన్‌తో ఇది మరింత పెరుగుతుంది. అయితే ఇలాంటి కార్లకు ఇప్పుడు కొనుగోలుదారులు తగ్గిపోయారు. యుద్ధం ప్రారంభమైన తర్వాత అనేక లగ్జరీ కార్ల షోరూమ్‌లు తాత్కాలికంగా మూతపడ్డాయి. ఫెరారీ, మసెరటి వంటి ప్రముఖ కంపెనీలు డెలివరీలను కూడా నిలిపివేశాయి. దుబాయ్‌లోని ప్రముఖ డీలర్‌షిప్‌లలో ఒకటైన ఫస్ట్ మోటార్స్ వ్యాపారం సుమారు 30 శాతం వరకు పడిపోయిందని నివేదికలు చెబుతున్నాయి. షోరూమ్‌లు తిరిగి తెరిచినా, కస్టమర్ల రాక తగ్గిపోవడం వ్యాపారులకు ఆందోళన కలిగిస్తోంది.
లంబోర్ఘిని, బెంట్లీ, పోర్షే, జాగ్వార్ ల్యాండ్ రోవర్ వంటి ప్రముఖ కంపెనీలు ఈ పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నాయి. మధ్యప్రాచ్యంలో భారీ లాభాలను అందించే కస్టమ్ మరియు లిమిటెడ్ ఎడిషన్ కార్ల ఉత్పత్తి దాదాపుగా ఆగిపోయింది. పరిస్థితి త్వరగా మారకపోతే, కంపెనీల లాభాలపై నేరుగా ప్రభావం పడే అవకాశం ఉంది. పశ్చిమ ఆసియా మార్కెట్ ప్రత్యేకత ఏమిటంటే, ఇక్కడి వినియోగదారులు కస్టమ్ డిజైన్లకు పెద్దపీట వేస్తారు. ఒక్కో వాహనం ధర సాధారణ ధర కంటే రెండు మూడు రెట్లు పెరగడం కూడా సాధారణమే. కానీ ప్రస్తుతం అలాంటి ఆర్డర్లు దాదాపుగా నిలిచిపోయాయి.
ఇప్పటికే అమెరికా, చైనా, ఐరోపా మార్కెట్లలో సవాళ్లు ఎదుర్కొంటున్న లగ్జరీ కార్ల కంపెనీలకు మధ్యప్రాచ్యం చివరి ఆశగా నిలిచింది. కానీ, యుద్ధ ప్రభావంతో అక్కడ కూడా పరిస్థితి దిగజారుతోంది. కొన్ని కంపెనీలు ఉత్పత్తి తగ్గించే దిశగా ఆలోచిస్తున్నాయి. మొత్తానికి, యుద్ధం ప్రభావం కేవలం రాజకీయాలకే పరిమితం కాకుండా వ్యాపార రంగానికీ తీవ్రంగా దెబ్బతీస్తోంది. ముఖ్యంగా లగ్జరీ కార్ల రంగం పెద్ద సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. పరిస్థితి త్వరలో చక్కబడకపోతే, ఈ ప్రభావం మరింత తీవ్రంగా మారే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.