Michael Vaughan Heap Paise on Joe Root: టెస్టు క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా సచిన్ టెండ్యూలర్ ఉన్న విషయం తెలిసిందే. 200 టెస్టుల్లో 15921 పరుగులు చేశాడు. సచిన్ దరిదాపుల్లో కూడా ఎవరూ లేరు. ప్రస్తుత క్రికెటర్లలో ఇంగ్లండ్ బ్యాటర్ జో రూట్ మాత్రమే కాస్త దగ్గరగా ఉన్నాడు. ఇప్పటివరకు 142 టెస్టులు ఆడిన రూట్.. 11,940 పరుగులు చేశాడు. తాజాగా విండీస్‌పై రెండో టెస్టులో రూట్ సెంచరీ బాదాడు. దీంతో భవిష్యత్తులో సచిన్ రికార్డును అధిగమించే సత్తా రూట్‌కు మాత్రమే ఉందని ఇంగ్లీష్ మాజీ కెప్టెన్, కామెంటెటర్ మైకెల్ వాన్ అన్నాడు. విరాట్ కోహ్లీ, కేన్ విలియమ్సన్ వల్ల కాదని వ్యాఖ్యానించాడు.
‘రాబోయే కొన్ని నెలల్లో ఇంగ్లండ్ తరఫున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా జో రూట్ నిలుస్తాడు. అలెస్టర్ కుక్ (12,472) కంటే కొద్దిలోనే వెనుక ఉన్నాడు. భవిష్యత్తులో సచిన్ టెండూల్కర్ రికార్డునూ అధిగమిస్తాడు. రూట్ గతంలో మాదిరిగా ఆచితూచి ఆడటం లేదు. దూకుడుగానే రన్స్ చేస్తున్నాడు. రూట్ నాణ్యమైన క్రికెట్ ఆడుతున్నాడు’ అని టెలిగ్రాఫ్ కాలమ్‌లో మైకెల్ వాన్ రాసుకొచ్చాడు. వెస్టిండీస్‌పై రెండో టెస్టులో ఇంగ్లీష్ జట్టు 241 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. 384 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్ 143 పరుగులకే ఆలౌటైంది.