ఐపీఎల్ 2024లో ముంబై ఇండియన్స్ కథ ముగిసినట్లే. ఇక ప్లే ఆఫ్స్ చేరే అవకాశాలు దాదాపుగా లేవు. శుక్రవారం వాంఖడే మైదానంలో కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఓడిపోయింది. 170 పరుగుల లక్ష్య ఛేదనలో హార్దిక్ సేన 145 పరుగులకే ఆలౌటైంది. సూర్యకుమార్ యాదవ్ (56) పోరాడకుంటే.. ముంబై 100 స్కోర్ కూడా చేసుండేది కాదు. కెప్టెన్ హార్దిక్ పాండ్యా (1) బ్యాటింగ్‌లో తేలిపోయాడు. బౌలింగ్‌లో రెండు వికెట్లు తీసినా 44 పరుగులు సమర్పించాడు. సొంతమైదానంలో వరుసగా రెండో ఓటమిని ఏడుకోవడంతో హార్దిక్ కెప్టెన్సీపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.
మ్యాచ్ అనంతరం హార్దిక్ పాండ్యా మాట్లాడుతూ ముంబై ఇండియన్స్ జట్టు ప్రదర్శనపై వచ్చిన ప్రశ్నలకు సమాధానం చెప్పడం కష్టమేనని పేర్కొన్నాడు. ‘చాలా ప్రశ్నలు ఉన్నాయి. కానీ సమాధానం చెప్పడానికి కొంత సమయం పడుతుంది. ప్రస్తుతానికి ఈ ఓటమిపై మాట్లాడేందుకు ఏమీ లేదు. మేము సరైన బ్యాటింగ్ చేయలేదు. మంచి భాగస్వామ్యాలను ఏర్పరచలేకపోయాము. టీ20లలో భాగస్వామ్యాలు నిర్మించకపోతే ఓటమి తప్పదు. వరుస విరామాల్లో వికెట్లను కోల్పోయి మూల్యం చెల్లించుకున్నాం’ అని హార్దిక్ చెప్పాడు.
Aslo Read: T20 World Cup 2024: హార్దిక్ పాండ్యా బదులుగా.. అతడిని తీసుకుంటే బాగుండేది!
‘మా బౌలర్లు మాత్రం అద్భుతంగా బంతులు వేశారు. మొదటి ఇన్నింగ్స్ తర్వాత వికెట్ కొంచెం మెరుగైంది. డ్యూ వచ్చింది. మంచు ప్రభావం ఎక్కువగా ఉండే రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేయడం సులువే. కానీ మేం మాత్రం ఓడిపోయాం. మిగతా మ్యాచుల్లోనూ మేం పోరాడతాం. చివరి వరకూ విజయం కోసం శ్రమిస్తాం. ప్రస్తుతం మేం క్లిష్టపరిస్థితుల్లో ఉన్నాం. తప్పకుండా మాకు మంచి రోజులు వస్తాయి. సవాళ్లను ఎదుర్కొనేందుకు మేం సిద్ధమే’ అని ముంబై కెప్టెన్ హార్దిక్ చెప్పుకోచ్చాడు. ఇప్పటివరకు ఆడిన 11 మ్యాచ్‌లలో కేవలం మూడు విజయాలు మాత్రమే సాధించిన ముంబై.. ఏకంగా 8 పరాజయాలను ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం పట్టికలో 9వ స్థానంలో ఉన్న హార్దిక్ సేన.. మిగిలిన మూడు మ్యాచ్‌లలో గెలిచినా ప్లేఆఫ్స్ చేరే అవకాశాలు దాదాపుగా లేవు.