Site icon NTV Telugu

ఒకే రోజున వచ్చిన చిరంజీవి రెండు సినిమాలు!

Chiranjeevi

Chiranjeevi

మెగాస్టార్ చిరంజీవి తన సినిమాలను విడుదల చేసే విషయంలో వ్యూహాత్మక ప్రణాళికలు రూపొందిస్తారని ప్రతీతి. మెగా కాంపౌండ్ లో ఎంతోమంది హీరోలు ఉన్న కారణంగా, తమ కుటుంబంలోని ఓ హీరో సినిమాకు మరో హీరో చిత్రం పోటీ కాకూడదనీ ఆయన శ్రద్ధ వహిస్తూ ఉంటారు. అలాంటి చిరంజీవి నటించిన రెండు చిత్రాలు ఒకే రోజున విడుదలయ్యాయి. అయితే ఆ రోజుల్లో ఆయన ఇంకా వర్ధమాన కథానాయకునిగానే రాణిస్తున్నారు. 1982 జులై 30న చిరంజీవి నటించిన “సీతాదేవి, రాధా మై డార్లింగ్” విడుదలయ్యాయి. ‘సీతాదేవి’లో టైటిల్ రోల్ పోషించిన సుజాతకు అన్నయ్యగా నటించారు చిరంజీవి. ఇక ‘రాధా మై డార్లింగ్’లో హీరోయిన్ బావగా అతిథి పాత్రలో కనిపిస్తారు.

‘సీతాదేవి’ కథ ఏమిటంటే – మీనాక్షమ్మకు ప్రభాకర్, సీతాదేవి పిల్లలు. సీత చిన్నతనంలోనే ప్రమాదానికి గురై, పక్షవాతంతో ఓ చేయి పడిపోతుంది. మీనాక్షమ్మ పెద్దకొడుకు రఘునాథ్ చిన్నతనంలోనే పారిపోయి ఉంటాడు. ప్రభు చెల్లెలును ఎంతో గారాబంగా పెంచి పెద్ద చేస్తాడు. అన్నాచెల్లెళ్ళు ఎంతో అనురాగంతో ఆనందంగా ఉంటారు. పెద్ద కొడుకు ఏదో ఒకరోజు వస్తాడని తల్లి ఎదురుచూస్తూ ఉంటుంది. చెల్లెలి పెళ్ళి కోసం ప్రభు దొంగతనాలు చేస్తాడు. అతనికి అలాంటి పనులు ఆ ఊరిలోని ఓ వ్యక్తి పురమాయిస్తూ ఉంటాడు. వారి ఊరికి పోలీస్ ఇన్ స్పెక్టర్ గా వచ్చిన చక్రపాణి, సీత పరిస్థితి చూసి జాలిపడతాడు. పైగా అతనికి భార్య చనిపోయి ఉంటుంది. దాంతో సీత కూడా అభ్యంతరం లేకుండా అతడిని పెళ్ళాడతానంటుంది. చెల్లెలు పెళ్ళిరోజునే ప్రభు ఓ దొంగతనం కేసులో అరెస్ట్ అవుతాడు. ఓ దొంగ చెల్లెలిని పెళ్ళి చేసుకున్నానని చక్రపాణి భార్యను నిరాదరిస్తాడు. ఆ తరువాత ఓ వ్యక్తి ప్రభుని విడిపిస్తాడు. అతని పేరు రఘునాథ్. అతను చెప్పిన పనల్లా చేస్తూ ఉంటాడు ప్రభు. అతను కూడా ఓ దొంగ అని తెలుసుకున్నాక వారి మధ్య విభేదాలు వస్తాయి. పేరు మోసిన దొంగ రఘును పట్టిస్తే తన చెల్లెలిని చక్రపాణి కాపురానికి తీసుకువెళతాడని ఆశిస్తాడు ప్రభు. దాంతో ప్లాన్ ప్రకారం రఘును పట్టించేందుకు వస్తాడు. ప్రభు చెల్లెలు సీతను రఘు బంధిస్తాడు. ప్రభు, రఘు పోట్లాడుకుంటూ ఉండగా, అక్కడ తమ తల్లి మీనాక్షమ్మ చిత్రపటం కనిపిస్తుంది. రఘు తమ అన్నయ్యనే అని తెలుసుకుంటారు ప్రభు, సీత. అన్ని విషయాలు తెలుసుకున్న రఘు తన కారణంగా చెల్లెలి బ్రతుకు చెడిపోరాదని భావిస్తాడు. పోలీసులకు లొంగిపోతాడు. రఘునాథ్ వంటి నేరస్థుడిని పట్టించినందుకు పోలీస్ అధికారులు ప్రభును అభినందిస్తారు. సీతను ఆమె భర్త ఆదరిస్తాడు. రఘు వాళ్ళ అన్నయ్య అన్న విషయం చక్రపాణికి కూడా తెలుసు – ఆ విషయం సీత, ప్రభుకు చక్రపాణి చెప్పడంతో కథ ముగుస్తుంది.

ఇందులో ప్రభుగా చిరంజీవి, సీతగా సుజాత, చక్రపాణిగా సత్యేంద్ర కుమార్, రఘుగా హరిబాబు నటించారు. టి.రామన్ నిర్మించిన ఈ చిత్రానికి ఈరంకి శర్మ దర్శకులు. ఎమ్మెస్ విశ్వనాథన్ సంగీత దర్శకుడు.

ఇక ‘రాధా మై డార్లింగ్’ కథ ఏమిటంటే – రాధా అనే అమ్మాయి తమ పక్కింటి గోపి అనే బాబుతో ఎంతో చనువుగా ఉంటుంది. వాడు టీనేజ్ వచ్చిన తరువాత నుంచీ ఆమెను అనుభవించాలని, సొంతం చేసుకోవాలని చూస్తూ ఉంటాడు. ఆమె చిన్నపిల్లాడు కదా అని భావిస్తూ, తన బావ కోసం కలలు కంటూ ఉంటుంది. రాధ, గోపి కలసే ఎక్కడికి వెళ్ళినా కలసే వెళ్తూ ఉంటారు. అతనికి ఆ ఊరిలోని ఓ వ్యక్తి రాధను ఎలాగైనా అనుభవించమని సలహాలు ఇస్తూ ఉంటాడు. ఓ సారి రాధను ఆ ఉద్దేశంతోనే చేయి పట్టుకుంటాడు. చెంప చెళ్ళుమనిపిస్తుంది. తప్పపోయిందని చెప్పి ఎప్పటిలాగే ఉంటాడు గోపి. రాధ క్షమిస్తుంది. రాధకు ఆమె బావతో పెళ్ళి కుదురుతుంది. పెళ్ళి కూతురుగా ముస్తాబవుతుంది. రేపు రాధ పెళ్ళి అనగా, గోపి తాము ఎప్పుడూ కలుసుకొనే చోటకు ఒక్కసారి రమ్మంటాడు. వెళ్తుంది. తనకు దక్కదని భావించి, రాధను మానభంగం చేస్తాడు. రాధ ఆత్మహత్య చేసుకుంటుంది. ఆమె చితి దగ్గర గోపి ఏడుస్తూ ఉండగా కథ ముగుస్తుంది.

NTR: ఆరోజు నాలో భయం మొదలయ్యింది.. నా అన్న రక్తం ధారబోశాడు

‘రాధా మై డార్లింగ్’ కథను నిర్మాత త్రినాథరావు పాలవెళ్లి సమకూర్చారు. బి.భాస్కర్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాతో విజయకళ అనే అమ్మాయి నాయికగా పరిచయం అయింది. తరువాతి రోజుల్లో నటుడిగా మంచి పేరు సంపాదించిన పృథ్వీ ఇందులో మాస్టర్ విమల్ రాజ్ పేరుతో కనిపించాడు. అంతకు ముందు కొన్ని చిత్రాలలో బబ్లూ పేరుతోనూ పృథ్వీ నటించాడు. ఆ రోజుల్లో ఈ సినిమా యువతను భలేగా ఆకట్టుకుంది. ఏది ఏమైనా ఈ రెండు చిత్రాలలో చిరంజీవి నటించినా, ఆయనకు పెద్దగా ఒరిగిందేమీ లేదు. తరువాత ఆయన హీరోగా నటించిన చిత్రాలే మంచి పేరు సంపాదించి పెట్టాయి.

Exit mobile version