NTV Telugu Site icon

Fire Works Blast: బాణాసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు.. ఎనిమిది మంది మృతి

Fire Works Blast

Fire Works Blast

Fire Works Blast: అనకాపల్లి జిల్లా కోటవురట్ల మండలం కైలాసపట్నంలో భారీ విషాదం చోటు చేసుకుంది. ఓ బాణాసంచా తయారీ కేంద్రంలో ఇవాళ మధ్యాహ్నం జరిగిన ఘోర పేలుడులో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో నలుగురు కార్మికులు అక్కడికక్కడే కాలిబూడిద కాగా, మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. ఘటనాస్థలికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చేందుకు తీవ్రంగా శ్రమించారు.

Read Also: RR vs RCB : టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న ఆర్సీబీ.. 2023 సీన్ రిపీట్ అవుతుందా?

కైలాసపట్నంలో ఉన్న బాణాసంచా తయారీ కేంద్రంలో అకస్మాత్తుగా మంటలు ఎగసిపడి భారీ శబ్దంతో పేలుడు సంభవించింది. ఇది చుట్టుపక్కల ప్రాంతాల్లోని ప్రజలను భయభ్రాంతులకు గురి చేసింది. పేలుడులో అక్కడ పనిచేస్తున్న 15 మంది సిబ్బందిలో ఎనిమిది మంది మృతి చెందారు. మిగిలినవారు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఘటనాస్థలిలో ఇంకా కొందరు చిక్కుకుపోయినట్లు అనుమానం వ్యక్తమవుతోంది. వారి కోసం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది.

ఈ ప్రమాదం సమాచారం అందుకున్న హోం మంత్రి అనిత వెంటనే సంఘటనా స్థలానికి బయలుదేరారు. జిల్లా అధికారులకు తక్షణ సహాయ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కలెక్టర్ విజయ కృష్ణన్ ఈ అగ్నిప్రమాదంపై విచారణకు ఆదేశించారు. అధికారులు మృతుల వివరాలు సేకరిస్తున్నారు. ఘటనా సమయంలో బాణాసంచా కేంద్రంలో 15 మంది సిబ్బంది విధుల్లో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ ఘటనతో మొత్తం గ్రామంలో విషాదం నెలకొంది. మృతుల కుటుంబాలకు సానుభూతి వ్యక్తం చేస్తూ పలువురు నాయకులు స్పందించారు. ప్రభుత్వం బాధిత కుటుంబాలకు తగిన న్యాయం చేసి, ప్రమాదానికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారం వెల్లడయ్యే అవకాశం ఉంది.

అనకాపల్లి జిల్లా, కోటవురట్లలో బాణసంచా తయారీ కేంద్రంలో అగ్నిప్రమాదం ఘటనకు సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోషల్ మీడియా వేదికగా స్పందించారు. కార్మికులు మృతి చెందడం దిగ్భ్రాంతి కలిగించిందని, మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందన్న సమాచారం ఆందోళన కలిగించిందని అన్నారు. ఘటనపై జిల్లా కలెక్టర్, ఎస్పీ, హోంమంత్రి శ్రీమతి అనితతో ఫోన్ లో మాట్లాడానని, ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించాను. అగ్నిప్రమాద సమయంలో కర్మాగారంలో ఎంతమంది కార్మికులు ఉన్నారు, వారి పరిస్థితి ప్రస్తుతం ఎలా ఉందని ఆరా తీశానని, బాధిత కుటుంబాలను ఆదుకుంటామని, ధైర్యంగా ఉండాలని కోరుతున్నానని ఆయన అన్నారు. ఘటనపై విచారణ చేసి నివేదించాలని ఆదేశించినట్లు అయ్యన తెలిపారు.

బాణా సంచా తయారీ కేంద్రంలో ప్రమాద ఘటన పట్ల మాజీ ముఖ్యమంత్రి, వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్‌.జగన్ మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనలో పలువురు మరణించడం, మరికొందరు తీవ్రంగా గాయపడ్డం తీవ్ర విచారకరమన్నారు. మరణించినవారి కుటుంబాలకు తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. ఈ ప్రమాదంలో మరణించిన, గాయపడ్డ వారి కుటుంబాలకు తోడుగా నిలవాలని వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులను ఆదేశించారు.