Site icon NTV Telugu

Female Terrorists: మసూద్ అజార్ భారీ కుట్ర.. పాకిస్థాన్ కేంద్రంగా మహిళా ఉగ్రవాదులకు శిక్షణ..

Female Terrorists

Female Terrorists

Female Terrorists: పాకిస్థాన్ కేంద్రంగా మసూద్ అజార్ భారీ కుట్రకు తెరలేపాడు. ఆపరేషన్ సింధూర్‌లో దాదాపు తన కుటుంబాన్ని కోల్పోయిన పాకిస్థాన్ ఉగ్రవాది మసూద్ అజార్ తన కుట్రలను ఇంకా ఆపలేదని నిఘావర్గాలు తెలిపాయి. ఆయన ఇప్పుడు దాయాది దేశంలో మహిళా దళాన్ని ఏర్పాటు చేస్తున్నాడని సమాచారం. మహిళలను నియమించిన తర్వాత, వారు పూర్తి శిక్షణ పొంది ఉగ్రవాద పనిని కొనసాగించనున్నారు. ఈ విధంగా మహిళలను నియమించి ఉగ్రవాద శిక్షణ ఇచ్చిన ఉగ్రసంస్థ కేవలం జైషే ఒక్కటే కాదు, గతంలో అనేక ఉగ్రవాద గ్రూపులలో ఇలా మహిళలను నియమించారు. ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ISIS)లో చేరడానికి సంపన్న దేశాల నుంచి కూడా యువతులు సిరియాకు ప్రయాణించారు.

READ ALSO: SEBI Recruitment 2025: సెబీలో అసిస్టెంట్ మేనేజర్ జాబ్స్.. అర్హులు వీరే

మహిళలు తీవ్రవాదం వైపు ఆకర్షితులవడానికి కారణం ఏమిటి?
జైషే మహ్మద్ తీవ్ర సంస్థ మహిళలను చురుగ్గా నియమించుకోవడం ప్రారంభించిందని వార్తలు వస్తున్నాయి. వారిని ఒక ప్రత్యేక బ్రిగేడ్‌లో ఉంచి, భారతదేశ ప్రయోజనాల కోసం పనిచేసే మహిళలకు హాని కలిగించడానికి శిక్షణ ఇస్తున్నట్లు సమాచారం. ఈ మహిళా బ్రిగేడ్ బాధ్యతను మసూద్ అజార్ స్వయానా తన సోదరి సాదియా అజార్‌కు అప్పగిస్తున్నట్లు పలు కథనాలు వస్తున్నాయి. ఈ సంస్థను జమాత్-ఉల్-మోమినాత్ అని పిలుస్తారు. పాకిస్థాన్‌లోని ప్రతి జిల్లాలో దీనికి సంబంధించిన ఒక శాఖ ఉంటుంది. ఈ కార్యక్రమం కింద మహిళలు దౌరా-ఎ-తస్కియా అనే 15 రోజుల కోర్సులో పాల్గొంటారు. దీని తర్వాత దాదాపు అదే వ్యవధి గల మరో శిక్షణా కార్యక్రమం ఉంటుంది. ఇందులో వాళ్లకు ఆయుధ శిక్షణ కూడా ఉండవచ్చని సమాచారం. అలాగే శిక్షణలో పాల్గొన్న మహిళలకు ప్రతిరోజూ దాదాపు 40 నిమిషాల ఆన్‌లైన్ తరగతులు ఉంటాయి.

దౌరా-ఎ-తస్కియా.. మహిళలను ఎలా టెంప్ట్ చేస్తుంది
ఉగ్రవాదంలోకి మహిళలను ఆకర్షించడానికి మసూద్ అజార్ అనేక ప్రకటనలు చేస్తున్నాడు. ఉదాహరణకు ఈ శిక్షణలో పాల్గొనే మహిళలు సమాధి నుంచి నేరుగా స్వర్గానికి వెళతారని ఆయన పేర్కొన్నాడు. అలాగే పొరుగున ఉన్న భారతదేశం తన సైన్యం, మీడియాలో హిందూ మహిళలను మోహరించిందని చెబుతూ దేశంలోని ముస్లిం మహిళలను రెచ్చకొట్టడం లాంటివి చేస్తున్నాడు. ఇటీవల జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ అధినేత మసూద్ అజార్‌కు సంబంధించిన దాదాపు 20 నిమిషాల ఆడియో రికార్డింగ్ వైరల్‌గా మారింది. ఈ ఆడియో రికార్డింగ్‌లో ఆయన మాట్లాడుతూ.. శిక్షణకు సంబంధించిన నియామకాలు, నిధుల ప్రక్రియ సిద్ధంగా ఉందని చెప్పారు. స్వర్గం చేరుకోడానికి ఈ కోర్సులో చేరే ప్రతి మహిళ రూ.500 విరాళంగా ఇవ్వాలని చెప్పారు. ఈ మొత్తం చాలా తక్కువ అని, వీటిని తీసుకోవడం ఎందుకంటే నియామక ప్రక్రియలో దేశంలో తక్కువ ఆదాయం ఉన్న మహిళలను లక్ష్యంగా చేసుకున్నట్లు నిఘా వర్గాలు వెల్లడించాయి. ఇక్కడ మరోక విశేషం ఏమిటంటే ఉగ్రవాద కమాండర్ల భార్యలకు ఇందులో ప్రత్యేక మినహాయింపులు ఉన్నాయి.

శిక్షణలో కఠినమైన నియమాలు..
మహిళలు తమ లక్ష్యాల నుంచి పక్కకు తప్పుకోకుండా చూసుకోవడానికి కఠినమైన నియమాలు అమలులో ఉన్నాయి. ఉదాహరణకు మహిళలు మహిళల నుంచి మాత్రమే శిక్షణ పొందుతారు. ఇంకా వారు పురుషులతో సంబంధంలోకి రారు. బ్రిగేడ్‌లోని మహిళలు ఫోన్ లేదా మెసెంజర్ ద్వారా తెలియని పురుషులతో కనెక్ట్ అవ్వకూడదని కూడా ఆదేశాలు ఉన్నాయని నిఘా వర్గాలు వెల్లడించాయి. గత రెండు దశాబ్దాలుగా పెద్ద సంఖ్యలో మహిళలను రిక్రూట్ చేసుకున్న లేదా ఏదో ఒక విధంగా వారిని ఉగ్రవాద ప్రయోజనాల కోసం ఉపయోగించుకున్న అనేక ఉగ్రవాద సంస్థల అడుగుజాడల్లో జైష్ నడుస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు.

ఉగ్రవాద సంస్థలు.. మహిళా విభాగాలు
ఇస్లామిక్ స్టేట్ మూడేళ్లలో 5 వేల మందికి పైగా మహిళలను నియమించుకుంది. 2000లలో అల్-ఖైదా మహిళా బోధకులను కూడా నియమించడం ప్రారంభించింది. తరువాత ప్రచారం కోసం ఆన్‌లైన్ కోర్సులు, వెబ్‌సైట్‌లు సృష్టించారు. అలాగే బోకో హరామ్ నిరంతరం మహిళలను ఆత్మాహుతి బాంబర్లుగా నియమించుకుంది. 2014 నుంచి 400 మందికి పైగా మహిళలను ఆత్మాహుతి దాడులలో ఉపయోగిస్తున్నారు. లష్కరే తోయిబా దావత్-ఏ-తోయిబా అనే మహిళా విభాగాన్ని కూడా నిర్వహిస్తోంది. మహిళలతో నిధులను సేకరించడం, తీవ్రవాద భావజాలాన్ని వ్యాప్తి చేయడం లాంటి చేయిస్తున్నారు. హమాస్ గాజాలో మహిళా బ్రిగేడ్‌ను కూడా ఏర్పాటు చేసింది. ఇది చాలా మంది ఆత్మాహుతి బాంబర్లను ఉత్పత్తి చేసింది. నేటికీ హమాస్ మహిళలు జిహాద్‌ శిక్షణ ఇవ్వడం, ఇందులో తోటి మహిళలను పాల్గొనాలని ప్రోత్సహించడం ఆపలేదని నిఘా వర్గాలు వెల్లడించాయి. సోమాలియాలో ఉన్న అల్-షబాబ్ అనే ఉగ్రసంస్థ, ప్రత్యక్షంగా కాకపోయినా, భవిష్యత్ అమరవీరుల తల్లులు లేదా భార్యలుగా చిత్రీకరించడం ద్వారా మహిళలను ఈ దిశలో ప్రేరేపిస్తోందని సమాచారం.

వేధింపులకు గురైన మహిళలే టార్గెట్..
ఈ ఉగ్రవాద సంస్థలు ఏదో ఒక విధంగా వేధింపులకు గురైన మహిళలను లక్ష్యంగా చేసుకుంటున్నాయి. ఉదాహరణకు ఒంటరిగా ఉన్నవారు, ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నవారు, గృహ సమస్యలను ఎదుర్కొంటున్నవారు లేదా వారి స్వంత గుర్తింపును కోరుకునే వారు వీరి ప్రధాన టార్గెట్ అని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ ప్రయత్నంలో ఇస్లామిక్ స్టేట్ అత్యంత విజయవంతం అయ్యిందని వెల్లడించారు. ఈ ఉగ్ర సంస్థ ఆన్‌లైన్‌లో కమ్యూనికేట్ చేయడం ద్వారా రిక్రూట్ ప్రారంభించిందని చెబుతున్నారు. ఇది పాశ్చాత్య మహిళలను లక్ష్యంగా చేసుకుని ఒక ప్రత్యేక మాడ్యూల్‌ను సృష్టించిందని, మహిళలు మోసపూరిత ప్రపంచంలో చిక్కుకున్నారని, వారు స్వర్గం నుంచి దూరంగా వెళ్తున్నారని వారికి చెప్పి, యువతులను శిక్షణలో చేర్చుకొవడం ఇస్లామిక్ స్టేట్‌ ప్రారంభించదని తెలిపారు. చాలా మంది యువతులు ఇందులో చేరడానికి వారి ఇళ్లను వదిలి ఇరాక్, సిరియాకు చేరుకోవడం ప్రారంభించారు. అలాగే ఆధ్యాత్మిక లక్ష్యం ఆకర్షణతో పాటు, మహిళలకు తరచుగా ప్రేమ లేదా స్నేహం ద్వారా దగ్గర అవుతూ ఇందులోకి లాగుతున్నారని చెబుతున్నారు. యువతులకు వారు ఒక గొప్ప కార్యాన్ని నిర్వహిస్తున్నారని చెబుతారని, అలాగే డబ్బు, రేషన్ లేదా మందులు వంటి అవసరమైన వారికి చిన్న విరాళాలు అందిస్తూ ఈ ఉచ్చులో పడేస్తున్నారని వెల్లడించారు. ఇది పేదరికం లేదా గుర్తింపు కోసం పోరాడుతున్న మహిళలను సులభంగా ఆకర్షిస్తుందని విశ్లేషకులు పేర్కొన్నారు.

నియామకం తర్వాత ఏం చేస్తారంటే ..

* సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం, సందేశాల ద్వారా కొత్త వ్యక్తులతో మాట్లాడటం, మహిళలతో కనెక్ట్ అవ్వడానికి ప్రయత్నించడం.

* వంట చేయడం, వసతి గృహాలను శుభ్రపరచడం, యోధులు, కమాండర్లు వారి కుటుంబాలను జాగ్రత్తగా చూసుకోవడం.

* కొన్నిసార్లు వారు గూఢచారులుగా కూడా పనిచేస్తారు. ఇక్కడ నుంచి అక్కడికి సమాచారాన్ని అందిస్తారు.

* ఇస్లామిక్ స్టేట్, బోకో హరామ్ వంటి సంస్థలు కూడా యువతులను ఆత్మాహుతి బాంబర్లుగా మార్చడానికి శిక్షణ ఇస్తాయి.

* చాలా సందర్భాలలో మహిళలు బలవంతంగా లైంగిక దోపిడీకి గురవుతారు లేదా లైంగిక బానిసలుగా మారుతారు.

READ ALSO: Palnadu: పల్నాడు జిల్లాలో లక్షల ఎకరాల్లో దెబ్బతిన్న పంటలు, రైతులకు తీవ్ర నష్టం

Exit mobile version