అయిదుసార్లు గ్రాండ్‌స్లామ్ టైటిల్ విజేత, మాజీ ప్రపంచ నంబర్ వన్ ‘మరియా షరపోవా’కు అరుదైన గౌరవం దక్కింది. ఇంటర్నేషనల్ టెన్నిస్ హాల్ ఆఫ్ ఫేమ్‌లో రష్యా అందం షరపోవా చోటు దక్కించుకున్నారు. మరోవైపు అమెరికా కవల సోదరులు బాబ్ బ్రయాన్, మైక్ బ్రయాన్‌లు కూడా హాల్ ఆఫ్ ఫేమ్‌లో స్థానం దక్కించుకున్నారు. బ్రయాన్ సోదరులు టెన్నిస్ చరిత్రలో అత్యంత విజయవంతమైన పురుషుల డబుల్స్ జోడి అన్న విషయం తెలిసిందే.
కెరీర్ స్లామ్ పూర్తి చేసిన పది మంది క్రీడాకారిణుల్లో మరియా షరపోవా ఒకరు. 2004లో 17 ఏళ్ల వయసులో షరపోవా వింబుల్డన్ టైటిల్ గెలిచారు. 2006లో యుఎస్ ఓపెన్.. 2008లో ఆస్ట్రేలియన్ ఓపెన్.. 2012, 2014లో ఫ్రెంచ్ ఓపెన్ ట్రోఫీలు సాధించారు. 2012 ఒలింపిక్స్‌లో మహిళల సింగిల్స్‌లో రజతం కూడా సాధించారు. ఇయర్ ఎండ్ ఛాంపియన్‌షిప్‌లతో సహా 36 టైటిళ్లను గెలుచుకున్నారు. 18 ఏళ్ల వయస్సులో డబ్ల్యూటీఏ ర్యాంకింగ్స్‌లో నంబర్ వన్‌గా (2005 ఆగస్ట్ 22) నిలిచిన తొలి రష్యా అమ్మాయి కూడా షరపోవానే.
Also Read: INDW vs NZW: న్యూజిలాండ్‌తో తొలి వన్డే.. భారత్ ఘన విజయం!
2008లో రష్యా బిల్లీ జీన్‌కింగ్ కప్ గెలవడంలో మరియా షరపోవాది కీలకపాత్ర. 2020లో 32 ఏళ్ల వయసులో ఆటకు వీడ్కోలు పలికారు. పదిహేనేళ్ల పాటు షరపోవా కెరీర్ కొనసాగింది. కెరీర్ మధ్యలో భుజం గాయంతో ఇబ్బందిపడిన షరపోవా.. డోప్ నిబంధనలు మీరడంతో 15 నెలల నిషేధాన్ని కూడా ఎదుర్కొన్నారు. ఇక బ్రయాన్ సోదరులు 2012లో స్వర్ణంతో సహా పలు ఒలింపిక్ పతకాలను గెలిచారు. 438 వారాల పాటు ప్రపంచ నంబర్ 1 డబుల్స్ ర్యాంకింగ్‌ను కలిగి ఉన్నారు.