పారిస్ ఒలింపిక్స్‌లో భారత యువ షూటర్ మను బాకర్ రెండు పతకాలు సాధించిన విషయం తెలిసిందే. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత విభాగంలో కాంస్యం గెలిచిన మను.. సరబ్‌జోత్ సింగ్‌తో కలిసి 10 మీటర్ల పిస్టల్ మిక్స్‌డ్ డబుల్స్‌లో మరో కాంస్య పతకం కైవసం చేసుకుంది. రెండు పతకాలు సాధించి రికార్డు సృష్టించిన మను పేరు నిత్యం సోషల్ మీడియాలో వినిపిస్తోంది. ఆమె ఏం చేసినా అది ట్రెండింగ్‌లోకి వచ్చేస్తోంది. ఈ క్రమంలోనే రిపోర్టర్స్ ప్రశ్నలపై మను అసహనం వ్యక్తం చేసిన న్యూస్ నెట్టింట వైరల్ అయింది.
Also Read: OnePlus Buds Pro 3 Price: ‘వన్‌ప్లస్’ బడ్స్ ప్రో 3 రిలీజ్.. 43 గంటల బ్యాటరీ లైఫ్! ప్రత్యేకతలు ఇవే
తాజాగా చెన్నైలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో మను బాకర్ పాల్గొన్న సంగతి తెలిసిందే. వివిధ అంశాలపై మాట్లాడుతూ.. క్రీడలను కెరీర్‌గా ఎంచుకోవాలని సూచించారు. అయితే ఈ కార్యక్రమం సందర్భంగా మనుకు మరోసారి రిపోర్టర్ల నుంచి నీరజ్ చోప్రా గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి. ‘జర్మనీలో మీరిద్దరూ సంభాషించుకున్న ఘటన, మీ అమ్మ కూడా నీరజ్‌తో మాట్లాడిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి’, ‘వినేశ్ ఫొగాట్‌పై తీర్పు రాజకీయంగా మారింది’.. వీటిపై మీ సమాధానం ఏంటి? అని మనును అడగగా సమాధానం ఇవ్వకుండా ఆమె అసహనం వ్యక్తం చేస్తూ అక్కడి నుంచి వెళ్లిపోయారు.