NTV Telugu Site icon

Manu Bhaker: నీరజ్‌ చోప్రాతో ప్రేమ.. స్పందించిన మను బాకర్‌!

Manu Bhakar

Manu Bhakar

Manu Bhaker reacts on Love With Neeraj Chopra: పారిస్‌ ఒలింపిక్స్‌ 2024లో రెండు పతకాలు సాధించి రికార్డు సృష్టించిన భారత షూటర్ మను బాకర్‌ పేరు సోషల్ మీడియాలో మార్మోగిపోతోంది. మను ఏం చేసినా అది ట్రెండింగ్‌లోకి వచ్చేస్తోంది. ఈ క్రమంలోనే భారత స్టార్‌ జావెలిన్‌ త్రోయర్‌ నీరజ్‌ చోప్రాతో మను మాట్లాడిన వీడియో ఇటీవల వైరల్‌ అయింది. అంతేకాదు మను తల్లి నీరజ్‌తో మాట్లాడడం, తలపై చోప్రా చేతిని ఉంచి ఒట్టు తీసుకున్నట్లుగా కనిపించడంతో నెట్టింట ఊహాగానాలు మరో స్థాయికి వెళ్లాయి. మనుతో నీరజ్‌ ప్రేమలో ఉన్నాడని, త్వరలోనే ఇద్దర పెళ్లి జరిగే అవకాశాలు ఉన్నాయని వార్తలు చక్కర్లు కొట్టాయి.

నీరజ్‌ చోప్రాతో ప్రేమ, పెళ్లి వార్తలను మను బాకర్‌ కుటుంబసభ్యులు ఖండించారు. తాజాగా మను కూడా స్పందించారు. సోషల్ మీడియాలో వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని చెప్పారు. ‘నెట్టింట వచ్చిన వార్తలను నేను కూడా విన్నాను. ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదు. నీరజ్‌ చోప్రాతో నేను మాట్లాడాను. అప్పుడు ఎవరో వీడియో తీశారు. మా మధ్య పెద్దగా ఇంటరాక్షన్‌ లేదు. ఈవెంట్ల సందర్భంగా కలిసినప్పుడే మాట్లాడుకుంటాం. మేమిద్దరం ప్రేమలో ఉన్నట్లు వస్తున్న వార్తలన్నీ అవాస్తవం. మా అమ్మ నీరజ్‌తో మాట్లాడినప్పుడు నేను అక్కడ లేను. వారిద్దరూ ఏం మాట్లాడుకున్నారో నాకు తెలియదు’ అని మను చెప్పారు.

పారిస్ ఒలింపిక్స్‌లో మను బాకర్‌ 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ వ్యక్తిగత విభాగంలో కాంస్యం గెలిచింది. షూటర్‌ సరబ్‌జోత్‌ సింగ్‌తో కలిసి 10 మీటర్ల పిస్టల్‌ మిక్స్‌డ్‌ డబుల్స్‌లో మరో కాంస్య పతకం కైవసం చేసుకుంది. పారిస్ ఒలింపిక్స్‌ ముగింపు వేడుకల్లో హాకీ దిగ్గజం పీఆర్ శ్రీజేశ్‌తో కలిసి భారత పతాకధారిగానూ మను వ్యవహరించారు. మరోవైపు జావెలిన్‌ త్రో ఫైనల్లో రెండో స్థానంలో నిలిచిన నీరజ్‌ చోప్రా రజతం సాధించాడు.

Show comments