గ్రామీణ ప్రాంతాలలో రవాణా సౌకర్యాలను మెరుగుపరచడానికి, ప్రజల ప్రయాణ కష్టాలను తీర్చడానికి ప్రభుత్వం కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వెచ్చించి నాణ్యమైన రహదారులను నిర్మిస్తోంది. మౌలిక వసతుల కల్పనతో ఆయా ప్రాంతాలు ఆర్థికంగా అభివృద్ధి చెందడమే కాకుండా, రవాణా వ్యవస్థ కూడా సులభతరమవుతుంది. అయితే కొందరి నిర్లక్ష్యం, బాధ్యతారాహిత్యం వల్ల ఈ రోడ్లు నిర్మించిన కొద్ది కాలానికే తీవ్రంగా దెబ్బతింటున్నాయి. ముఖ్యంగా వ్యవసాయ పనుల కోసం ఉపయోగించే ట్రాక్టర్లకు కేజీ వీల్స్ అమర్చి, వాటిని నేరుగా తారు, సిమెంట్ రోడ్లపై నడపడం వల్ల రోడ్ల రూపురేఖలు మారిపోతున్నాయి.
వరి నాట్లు, పొలం దుక్కి పనుల్లో వీటిని ఎక్కువగా ఉపయోగిస్తారు. కానీ పొలం పనులు పూర్తయిన తర్వాత ఆ ఇనుప చక్రాలను తొలగించకుండా, నేరుగా తారు లేదా సీసీ రోడ్లపై నడపడం వల్ల తీవ్ర నష్టం వాటిల్లుతుంది. ఇనుప చక్రాల పదునైన భాగాలు రోడ్డు ఉపరితలంపై తీవ్రమైన ఒత్తిడిని కలిగిస్తాయి. దీనివల్ల తారు పొరలు ఊడిపోయి, పెద్ద పెద్ద గోతులు ఏర్పడతాయి. సాధారణంగా 15 నుంచి 20 సంవత్సరాల పాటు నిలిచేలా నిర్మించిన రహదారులు, ఈ కేజీ వీల్స్ రాపిడి కారణంగా కేవలం 15 నుంచి 20 నెలలకే పూర్తిగా ధ్వంసమవుతున్నాయి. దీనివల్ల నిరంతరం మరమ్మతులు చేయాల్సి వచ్చి ప్రభుత్వానికి, పంచాయతీలకు అదనపు ఆర్థిక భారం పడుతోంది. అంతేకాకుండా.. దెబ్బతిన్న రోడ్ల వల్ల ద్విచక్ర వాహనదారులు, బాటసారులు ప్రమాదాల బారిన పడి తీవ్రంగా గాయపడుతున్నారు.
ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు, ప్రజారోగ్యంతో పాటు ప్రభుత్వ ఆస్తులను కాపాడుకునేందుకు వరంగల్ జిల్లా మంగపేట మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ అధికారులు ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల కోట్ల రూపాయల వ్యయంతో మండల కేంద్రంలో రోడ్డు వెడల్పు, సెంట్రల్ లైటింగ్ పనులతో వీధులను ఎంతో అందంగా ఆధునీకరించారు. ఈ నూతన రహదారులను రక్షించుకోవడానికి అధికారులు వినూత్నంగా ప్రజల భాగస్వామ్యాన్ని కోరుతున్నారు.
మండల కేంద్రంలోని ప్రధాన కూడళ్లయిన గంపోనిగూడెం క్రాస్, కోమటిపల్లి క్రాస్, ప్రభుత్వ ఆసుపత్రి మార్గం, జడ్పీహెచ్ఎస్ పాఠశాల ప్రాంతం, ఓల్డ్ బస్టాండ్ చౌరస్తా, మహావీర్ వై జంక్షన్, వైఎస్ఆర్ సెంటర్ మరియు ప్రధాన హైవే రోడ్లపై నిబంధనలకు విరుద్ధంగా కేజీ వీల్స్‌తో తిరిగే ట్రాక్టర్ల సమాచారాన్ని అందించిన వారికి రూ. 5,000 నగదు బహుమతి అందజేస్తామని పంచాయతీ అధికారులు ప్రకటించారు. నిబంధనలు ఉల్లంఘించే ట్రాక్టర్ల ఫోటోలు లేదా వీడియోలను తీసి ‘మంగపేట గ్రామపంచాయతీ’ వాట్సాప్ గ్రూప్‌లో గానీ, లేదా పంచాయతీ కార్యదర్శి నంబర్ కు పంపించి ఈ పారితోషికాన్ని పొందవచ్చని సూచించారు. గ్రామాభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై, ప్రభుత్వ ఆస్తులను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందనే చైతన్యాన్ని ఈ నిర్ణయం కలిగిస్తోంది.

