ఆగ్నేయ బంగాళాఖాతంలో తీవ్ర తుఫానుగా మాండూస్ కొనసాగుతోంది. అయితే.. ఐఎండీ సూచనల ప్రకారం.. గడిచిన 6 గంటల్లో పశ్చిమ-వాయువ్య దిశగా గంటకు 12కి.మీ వేగంతో తుఫాన్ కదులుతోంది. ప్రస్తుతానికి జఫ్నా(శ్రీలంక) తూర్పు ఆగ్నేయంగా 240కి.మీ., కారైకాల్‌కు 240 కి.మీ., చెన్నైకి 320 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉందని ఐఎండీ పేర్కొంది. ఇది వచ్చే 6 గంటలు తీవ్ర తుఫానుగా తీవ్రతను కొనసాగించి, ఆ తర్వాత క్రమంగా తుఫాన్ బలహీన పడనున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ రోజు అర్ధరాత్రి నుండి రేపు తెల్లవారు జాములోపు పుదుచ్చేరి- శ్రీహరికోట మధ్య మహాబలిపురం సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
Also Read : Himanta Biswa Sarma: ముస్లిం పురుషులకు బహుళ భార్యలు ఉండడాన్ని బీజేపీ వ్యతిరేకిస్తోంది..
తీరం దాటే సమయంలో 65-85 కిమీ వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని, దీని ప్రభావంతో ఈరోజు, రేపు దక్షిణకోస్తా, రాయలసీమలో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ అధికారులు వెల్లడించారు. మిగిలిన చోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని, మత్స్యకారులు వేటకు వెళ్లరాదని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలి, రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. అయితే.. ఇప్పటికే ఏపీలోని పలు జిల్లాలో వర్షాలు కురుస్తున్నాయి. నెల్లూరు, చిత్తూరు జిల్లాలో వర్షాలు ఉదయం నుంచి కురుస్తున్నాయి. అయితే.. చిత్తూరులో వర్షాల కారణంగా విద్యాసంస్థలకు నేడు సెలవు ప్రకటించారు జిల్లా కలెక్టర్.
