బుధవారం సాయంత్రం తిరుపతిలోని మోహన్ బాబు యూనివర్సిటీ వద్ద మరోసారి తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. టాలీవుడ్ హీరో మంచు మనోజ్ యూనివర్సిటీ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా.. పోలీసులు అతడిని అడ్డుకున్నారు. తాత, నానమ్మ సమాధులను చూసేందుకు ఎవరి అనుమతి కావాలి? అంటూ పోలీసులను మనోజ్ ప్రశ్నించారు. కోర్టు ఆర్డర్ నేపథ్యంలో యూనివర్సిటీ లోపలికి వెళ్లేందుకు అనుమతి లేదని పోలీసులు తెలిపారు.
యూనివర్సిటీ లోపలికి వెళ్లనీయకపోవడంతో సినీ నటుడు మోహన్ బాబు బౌన్సర్లతో మనోజ్ బౌన్సర్లు గొడవ పడ్డారు. ఇరు వర్గాల బౌన్సర్లు ఒకరినొకరు కొట్టుకున్నారు. బౌన్సర్లు రాళ్ల దాడులు చేసుకున్నారు. దాంతో పోలీసులు లాఠీఛార్జ్ చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. తాత, నానమ్మ సమాధుల వద్దకు వెళ్లొద్దని కోర్టు ఆర్డర్‌లో లేదని, తాను చిన్నప్పటి నుంచి ఇక్కడికి వస్తున్నా అని పోలీసులతో మనోజ్ చెప్పారు. తనకు గొడవ చేయాలనే ఉద్దేశం లేదని, అనవసరంగా ఎందుకు రాద్ధాంతం చేస్తున్నారన్నారు. అనుమతిస్తే సమాధుల వద్దకు వెళ్లి దండం పెట్టుకుని వచ్చేస్తా అని పోలీసులను మనోజ్ కోరారు. ఉద్రిక్తల మధ్య తాతయ్య, నానమ్మ సమాధి వద్దకు మనోజ్‌ను పోలీసులు పంపారు.
ఈరోజు మనోజ్ కుటుంబ సమేతంగా హైదరాబాద్ నుంచి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. రోడ్డు మార్గంలో మోహన్ బాబు యూనివర్సిటీకి ర్యాలీతో చేరుకున్నారు. కోర్టు ఆర్డర్ నేపథ్యంలో లోపలికి వెళ్లేందుకు అనుమతి లేదని పోలీసులు అతడిని అడ్డుకున్నారు. పోలీసుల సూచనతో వెనుదిరిగిన మనోజ్.. నారావారిపల్లెకు వెళ్లి మంత్రి నారా లోకేశ్‌తో భేటీ అయ్యారు. అనంతరం మనోజ్ దంపతులు ఎ.రంగంపేట చేరుకుని.. పశువుల పండుగను వీక్షించారు. సాయంత్రం మోహన్ బాబు యూనివర్సిటీలో ఉన్న తన నానమ్మ, అమ్మమ్మ సమాధుల వద్ద నివాళులర్పించడానికి వెళ్లారు.