Site icon NTV Telugu

Siddaramaiah: సిద్ధరామయ్యకు ఊహించని పరిమాణం.. తుపాకీతో వ్యక్తి హల్‌చల్

Gun

Gun

కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు ఎన్నికల ప్రచారంలో ఊహించని పరిణామం ఎదురైంది. వాహనం పైనుంచి కార్యకర్తలకు అభివాదం చేసుకుంటూ వెళ్తున్న సిద్ధరామయ్య దగ్గరకు ఓ వ్యక్తి నడుముకు తుపాకీ పెట్టుకుని వెళ్లి పూల దండ వేశాడు. ఈ దృశ్యాన్ని చూసిన కార్యకర్తలంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. వాహనంపై ఉన్న ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు, పార్టీ అభ్యర్థులకు పూలదండలు వేసి హల్‌చల్ చేశాడు. అనంతరం ఆ వ్యక్తి వాహనం దిగి కిందికి వెళ్తుండగా అతడి దగ్గర తుపాకీ చూసి సిద్ధరామయ్య, నాయకులు అవాక్కయ్యారు.

బెంగళూరులోని విల్సన్ గార్డెన్‌ సమీపంలో రవాణాశాఖ మంత్రి రామలింగారెడ్డి కుమార్తె, లోక్‌సభ ఎన్నికల అభ్యర్థి సౌమ్య రెడ్డి తరఫును సీఎం సిద్ధరామయ్య ప్రచార ర్యాలీలో పాల్గొన్నారు. ప్రచార వాహనం పైకి ఎక్కిన వ్యక్తి.. కాంగ్రెస్ నినాదాలు చేస్తూ సిద్ధరామయ్యకు, మంత్రి రామలింగారెడ్డికి, సౌమ్య రెడ్డికి పూల దండలు వేశాడు. కానీ నడుము దగ్గర తుపాకీ ఉందన్న సంగతిని ముఖ్యమంత్రి గానీ.. నాయకులు గానీ గుర్తించలేకపోయారు. వాహనం దిగితుండగా గమనించి ఝలక్‌కు గురయ్యారు. అందరూ ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు.

అయితే తుపాకీ ధరించిన వ్యక్తిని రియాజ్‌గా పోలీసులు గుర్తించారు. ఆత్మరక్షణ కోసమే అతను కొన్నేళ్ల నుంచి తుపాకీని వెంటపెట్టుకుని తిరుగుతున్నాడని పోలీసులు తెలిపారు. ఎన్నికల కోడ్‌ అమలు నేపథ్యంలో లైసెన్సెడ్‌ గన్‌లను సైతం పోలీసులకు అప్పగించాల్సి ఉంటుంది. అయితే ఎన్నికల సమయంలో సైతం తుపాకీ వెంటపట్టుకుని తిరిగేలా పోలీసుల నుంచి అనుమతి పొందాడు. కొన్నేళ్ల క్రితం రియాజ్‌పై హత్యాకాండ జరిగినప్పటి నుంచి తుపాకీ పట్టుకుని తిరుగుతున్నాడని, అతడికి తుపాకీ మినహాయింపు ఉందని పోలీసులు తెలిపారు. అతడికి లైసెన్స్‌ కూడా ఉందని పోలీసు ఉన్నతాధికారి మీడియాకు వెల్లడించారు.

ఇక ఈ ఘటనపై బీజేపీ.. కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించింది. సీఎం సిద్ధరామయ్యకు పోకిరిలు, రౌడీలు పూలమాలలు వేస్తారని చూపించేందుకే ఈ ఘటన జరిగిందని బీజేపీ దుయ్యబట్టింది. రౌడీలు ఇప్పుడు ర్యాలీల్లో ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎంలకు పూలదండలు వేసి ఫోజులిచ్చే పరిస్థితులు తలెత్తాయని ఆరోపించారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉన్నప్పటికీ ఆ ప్రాంతంలోని ఓటర్లను భయభ్రాంతులకు గురి చేసేందుకు తుపాకులు పట్టుకుని ఇలా ప్రదర్శిస్తున్నారని బీజేపీ ధ్వజమెత్తింది. మరి బీజేపీ ఆరోపణలపై కాంగ్రెస్ ఎలా స్పందిస్తుందో చూడాలి.

 

Exit mobile version