Mamata Banerjee: మమతా బెనర్జీ ఇంట్లో విషాదం.. మేనకోడలు ఆత్మహత్య

  • మమతా బెనర్జీ ఇంట్లో విషాదం
  • ఇంట్లో మేనకోడలు ఆత్మహత్య
  • అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్న పోలీసులు
Mamata Banerjee

Mamata Banerjee

పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. సోదరుడు నిహార్ ముఖర్జీ కుమార్తె బ్రిష్టి ముఖర్జీ (28) ఆత్మహత్య చేసుకుంది. ఇంట్లో ఉరివేసుకుని ప్రాణాలు తీసుకుంది. బీర్భూమిలోని రాంపూర్‌హాట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కుసుంబా గ్రామంలో మంగళవారం ఉదయం ఇంట్లో బలవన్మరణానికి పాల్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఉపాధ్యాయుల నియామక ప్రక్రియలో అక్రమంగా ఉద్యోగం పొందిందనే ఆరోపణలు ఉన్నాయి. విచారణ సమయంలో ఆమె ఉద్యోగాన్ని తొలగించారు. దీంతో ఆమె అప్పటి నుంచి మానసికంగా కృంగిబాటులో ఉంది. అంతేకాకుండా మరోవైపు విడాకుల కేసు కూడా విచారణలో ఉండడంతో తీవ్ర ఆందోళనలో ఉండడంతో ప్రాణాలు తీసుకున్నట్లు పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. ఇదిలా ఉంటే ఘటనాస్థలిలో ఎలాంటి ఆత్మహత్య లేఖ లభించలేదని పోలీసులు తెలిపారు. పోస్ట్‌మార్టం రిపోర్ట్ కోసం నిరీక్షిస్తున్నారు. అలాగే అన్ని కోణాల్లో కేసు దర్యాప్తు చేస్తున్నట్లుగా పోలీసులు వెల్లడించారు.

కొద్ది రోజులకే మరో విషాదం

రాంపూర్‌హాట్‌లోనే తృణమూల్ కాంగ్రెస్ సీనియర్ నేత, పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ మాజీ డిప్యూటీ స్పీకర్ ఆశిష్ బెనర్జీ ఆదివారం పార్టీ కార్యాలయంలో ఉరి వేసుకున్న స్థితిలో కనిపించిన ఘటన జరిగిన కొద్ది రోజులకే ఈ విషాదం చోటుచేసుకుంది. ఐదుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన ఆశిష్ బెనర్జీ.. అవినీతి ఆరోపణలను ఖండిస్తూ, తనపై బురదజల్లేందుకు ప్రయత్నాలు జరిగాయని పేర్కొంటూ ఒక సూసైడ్ నోట్‌ వదిలినట్లు పోలీసులు తెలిపారు.